మాజీ క్రికెటర్ మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)పై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి(Manoj Tiwary) సంచలన ఆరోపణలు చేశాడు. గంభీర్‌కు నోటి దురుసు ఎక్కువని.. తన కుటుంబంతో పాటు ఓ టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ను కూడా అసభ్యకరంగా తిట్టాడని ఆరోపించాడు.
తనకు నచ్చిన వాళ్లకు పెద్దపీట వేయడం గంభీర్‌కు అలవాటని.. అందుకే ఆస్ట్రేలియా పర్యటనలో ఆకాశ్ దీప్(Akash Deep)ను బలిచేశాడని మండిపడ్డాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు గంభీర్- మనోజ్ తివారి కలిసి ఆడారు.
గతంలో దేశవాళీ క్రికెట్‌లోనూ ఢిల్లీ తరఫున గంభీర్- బెంగాల్ జట్టు తరఫున తివారి ప్రత్యర్థులుగా పోటీపడ్డారు. ఇదిలా ఉంటే.. టీమిండియా హెడ్‌కోచ్‌గా ఎంపికైన గౌతం గంభీర్‌కు వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్న విషయం తెలిసిందే.
గంభీర్ హయాంలో చేదు అనుభవాలు
తొలుత స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ ఓడిపోయింది. కంగారూ గడ్డపై 3-1తో ఓడి పదేళ్ల తర్వాత ట్రోఫీని ఆసీస్‌కు చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఎంపిక, గంభీర్ వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలో మనోజ్ తివారి సైతం తన అభిప్రాయాలను పంచుకుంటూ.. గంభీర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అతడొక మోసగాడు అని.. గౌతీ చెత్త నిర్ణయాల వల్లే టీమిండియాకు ఈ దుస్థితి వచ్చిందని విమర్శించాడు. అయితే, నితీశ్ రాణా, హర్షిత్ రాణా వంటి యువ ప్లేయర్లు ఈ విషయంలో మనోజ్ తివారిని తప్పుబడుతూ.. గంభీర్‌కు మద్దతుగా కామెంట్లు చేసినట్లు వార్తలు వచ్చాయి.
హర్షిత్ రాణాను ఎందుకు ఆడించారు?
ఈ విషయాలపై మనోజ్ తివారి తాజాగా స్పందించాడు. అర్హత లేకున్నా.. కేవలం గంభీర్ చెప్పడం వల్ల అవకాశాలు పొందిన వారు ఇలాగే మాట్లాడతారని నితీశ్, హర్షిత్‌లను ఉద్దేశించి కౌంటర్లు వేశాడు. ‘‘నితీశ్ రాణా, హర్షిత్ రాణా వంటి వాళ్లు గౌతం గంభీర్‌కు ఎందుకు సపోర్టు చేయరు? తప్పకుండా చేస్తారు.
ఎందుకంటే పెర్త్ టెస్టులో ఆకాశ్ దీప్‌ను కాదని హర్షిత్ రాణాను ఆడించింది ఎవరో మనకు తెలియదా? అయినా.. ఆకాశ్ ఏం తప్పు చేశాడని అతడిని మొదటి టెస్టుకు పక్కనపెట్టారు? బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో టెస్టుల్లో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
ఒక ఫాస్ట్ బౌలర్‌గా తనకు సహకరించే పిచ్‌లపై వీలైనంత ఎక్కువగా బౌలింగ్ చేయాలని అతడు కోరుకోవడం సహజం. కానీ కారణం లేకుండా అతడిని జట్టు నుంచి తప్పించారు. హర్షిత్ కోసం ఆకాశ్‌పై తొలి టెస్టులో వేటు వేశారు. హర్షిత్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ గణాంకాలు కూడా అంతంతమాత్రమే. ఆకాశ్ దీప్ మాత్రం అద్భుతంగా ఆడుతున్నాడు.
నా కుటుంబాన్ని అసభ్యంగా తిట్టాడు.. గంగూలీని కూడా..
అయినా.. సరే అతడిని పక్కనపెట్టారంటే.. సెలక్షన్‌లో ఎంతటి వివక్ష ఉందో అర్థం కావడం లేదా?.. అందుకే గంభీర్‌కు ఇలాంటి వాళ్లు మద్దతు ఇస్తారు. అయినా నేనేమీ ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. ఉన్న విషయాల్నే నిర్భయంగా చెప్పాను.
రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీతో మ్యాచ్ జరిగినపుడు గౌతం గంభీర్ నోటి నుంచి ఎలాంటి మాటలు వచ్చాయో.. అప్పుడు అక్కడ ఉన్నవాళ్లంతా విన్నారు. సౌరవ్ గంగూలీ గురించి అతడు అన్న మాటలు.. నా కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు అందరూ విన్నారు. అయినా.. వారిలో కొంతమంది అప్పుడు అతడికే సపోర్టు చేశారు. జనాలు ఇలాగే ఉంటారు.
అతడిని తొక్కేయాలని చూశారు
హర్షిత్ కంటే ఆకాశ్ దీప్ బెటర్ అని మేనేజ్‌మెంట్ త్వరగానే గ్రహించింది. అందుకే రెండో టెస్టు నుంచి అతడిని పిలిపించారు. ఇక్కడ కొంతమంది స్వార్థం వల్ల జట్టుకు చెడు జరిగే అవకాశం ఉంది.
పాపం ఆకాశ్ దీప్ తన సెలక్షన్ గురించి నోరు విప్పలేడు. అందుకే అతడిని తొక్కేయాలని చూశారు’’ అని మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: నవశకం.. కొత్త కెప్టెన్ అతడే!.. ఆర్సీబీ హెడ్‌కోచ్ వ్యాఖ్యలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment