హైదరాబాద్‌కు తొలి విజయం | COL CK Nayudu Trophy 2020 Hyderabad Register First Win | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు తొలి విజయం

Published Sat, Jan 25 2020 8:38 AM | Last Updated on Sat, Jan 25 2020 8:38 AM

COL CK Nayudu Trophy 2020 Hyderabad Register First Win - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కల్నల్‌ సీకే నాయుడు అండర్‌–23 క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ గెలుపు రుచి చూసింది. స్థానిక జింఖానా మైదానంలో రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 41 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. టోర్నీలో భాగంగా ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’లో ఆరు మ్యాచ్‌లాడిన హైదరాబాద్‌ 4 మ్యాచ్‌ల్లో ఓటమి పాలై మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌ విజయంతో పాయింట్ల పట్టికలో హైదరాబాద్‌ (7 పాయింట్లు) ఆరో స్థానానికి చేరింది. 179 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్‌ స్కోరు 35/3తో ఆటకు చివరిరోజైన శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన రాజస్తాన్‌ 36 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. 

ఏబీ కూక్నా (45 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌. హైదరాబాద్‌ బౌలర్లలో కృష్ణ చరిత్‌ 3 వికెట్లు పడగొట్టగా... రక్షణ్, ప్రణీత్‌ రాజ్, అజయ్‌దేవ్‌ గౌడ్‌ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. రతన్‌ తేజ ఒక వికెట్‌ తీశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ 241 పరుగులు చేయగా... రాజస్తాన్‌ 237కు ఆలౌటైంది. హైదరాబాద్‌ రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులు చేసింది. ఒంగోల్‌ వేదికగా  ఫిబ్రవరి 6 నుంచి జరిగే తమ తదుపరి లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుతో హైదరాబాద్‌ ఆడుతుంది.    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement