
అమ్మ అడిగిన మాట...
ఆ రెండు పాయింట్లే తేడా
ఆసియాగేమ్స్‌లోనూ సాధిస్తా
కామన్వెల్త్ ‘స్వర్ణ’ విజేత కశ్యప్
సాక్షి, హైదరాబాద్: ‘గత ఏడాది కాలంలో ఎన్నో టోర్నీలలో స్వల్ప తేడాతో ఓడిపోయాను. మూడో గేమ్ ఆడిన ప్రతిసారీ 19-21, 20-22, 22-24... ఇలాంటి స్కోర్లతో చివర్లో ఓడేవాడిని. దాంతో అమ్మ నన్ను పిలిచి ఆ రెండు పాయింట్లు ఇంకెప్పుడు సాధిస్తావు అని అడిగింది. ఈ సారి మాత్రం అమ్మను నిరాశపర్చలేదు.
ఆ రెండు పాయింట్లూ సాధించాను. స్వర్ణాన్నీ గెలుచుకున్నాను’... గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ భావోద్వేగంతో అన్న మాట ఇది. కోచ్ గోపీచంద్, సహచరులు గురుసాయిదత్, సింధులతో కలిసి నగరానికి చేరుకున్న అనంతరం కశ్యప్ తన విజయానందాన్ని పంచుకున్నాడు. మీడియా సమావేశానికి ముందు గుర్రపు బగ్గీలో ఊరేగిస్తూ కశ్యప్ తదితరులకు గోపీచంద్ అకాడమీ ముందు ఘనస్వాగతం లభించింది. ఆసియా క్రీడల్లోనూ పతకం సాధిస్తానంటున్న కశ్యప్ మనోభావాలు అతని మాటల్లోనే...
కామన్వెల్త్ గెలుపు: రెండేళ్ల తర్వాత మేజర్ ఈవెంట్‌లో పతకం నెగ్గడం ఎంతో సంతోషంగా ఉంది. చాన్నాళ్లుగా భారత నంబర్‌వన్‌గా ఉంటున్నాను. వరల్డ్ ర్యాంకింగ్స్‌లోనూ టాప్-20లో ఉన్నాను. పురుషుల సింగిల్స్‌లో పోటీ బాగా పెరిగిన ఈ సమయంలో ఈ స్వర్ణం ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. నాతో పాటు అకాడమీలో ఆడుతున్న కుర్రాళ్లకు కూడా ఇది స్ఫూర్తినిస్తుంది. ఈ విజయాలన్నీ మా కోచ్ గోపీచంద్ వల్లే సాధ్యమయ్యాయి.
విజయం ప్రత్యేకత: ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్, ఆల్ ఇంగ్లండ్‌లలో వరుసగా క్వార్టర్స్‌లోనే ఓడాను. దాంతో కీలక టోర్నీల్లో నేను గెలవలేనేమో అన్న పరిస్థితి వచ్చింది. నాపై తీవ్ర ఒత్తిడి ఉంది. సెమీస్‌లో నేను తలపడ్డ ఇంగ్లండ్ ఆటగాడిని కొన్నేళ్ల క్రితం ఎదుర్కొని ఓడాను. అప్పుడు కూడా స్కోర్లు సరిగ్గా ఇలాగే ఉన్నాయి. దాంతో మళ్లీ ఓడతాననే భయం వచ్చింది. ఆ సమయంలో మానసికంగా కూడా నేను పరీక్షను ఎదుర్కొన్నాను. కానీ పట్టుదలతో ఆడి గెలిచాను. అందుకే ఈ గెలుపు ఎంతో ప్రత్యేకం. ఫైనల్ ప్రత్యర్థి వీడియోలు చూసి అతనిపై అటాకింగ్ గేమ్ ఆడి ఫలితం సాధించాను.
భవిష్యత్తు..: త్వరలోనే జరగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం సన్నాహకాలు చేస్తున్నాను. ఆ తర్వాత ఆసియా క్రీడలు ఉన్నాయి. అక్కడ చైనా ఆటగాళ్ల వల్ల పోటీ తీవ్రమని తెలుసు. అయితే కష్ట పడతాను. అక్కడా పతకం గెలవాలనేదే నా ప్రస్తుత లక్ష్యం. కామన్వెల్త్ గెలుపు నా భవిష్యత్తును కూడా మారుస్తుందని నమ్ముతున్నాను.