
న్యూఢిల్లీ: ఇప్పటికే సుప్రీం కోర్టు మొట్టికాయలతో విలవిల్లాడుతున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై మరో పిడుగు జరిమానా రూపంలో పడింది. మీడియా రైట్స్ గుత్తాధిపత్యంపై కన్నెర్ర జేసిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ. 52.24 కోట్లు జరిమానా కట్టాలని బీసీసీఐని ఆదేశించింది. గత మూడేళ్ల బోర్డు ఆదాయం నుంచి సుమారు 4.48 శాతాన్ని జరిమానాగా కట్టాలని 44 పేజీల ఉత్తర్వులో పేర్కొంది. ఐపీఎల్ మీడియా రైట్స్ విషయంలో బోర్డు ఏకంగా పదేళ్ల హక్కులను ఒక్క మీడియా (సోనీ) సంస్థకే గుత్తాధిపత్యంగా కేటాయించడం వల్ల మిగతా బ్రాడ్‌కాస్టర్లు పోటీపడే అవకాశాల్ని కోల్పోయారని ఆ ఉత్తర్వులో వెల్లడించింది.
దీంతో 2013–14, 2014–15, 2015–16 ఆర్థిక సంవత్సరాల్లోని బోర్డు సగటు వార్షికాదాయం రూ. 1164.7 కోట్లను లెక్కలోకి తీసుకొని జరిమానాను ఖరారు చేసింది. నాలుగేళ్ల క్రితం 2013లో కూడా సీసీఐ ఇంతే మొత్తాన్ని జరిమానాగా విధించినప్పటికీ ట్రిబ్యునల్‌లో సవాలు చేయడం ద్వారా బోర్డు జరిమానా నుంచి బయటపడింది.
బెదిరింపుపై వివరణ కోరిన సుప్రీం...: బీసీసీఐ కోశాధికారి అనిరుధ్ చౌదరి... చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) సంతోష్ రంగ్నేకర్‌ను బెదిరించడంపై సుప్రీం కోర్టు మండిపడింది. ఆరోపణలపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, ఖన్విల్కర్, చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ బుధవారం ఆదేశించింది. లోధా సిఫార్సులను చేర్చిన బీసీసీఐ నియమావళిపై సలహాలు, సూచనలతో కూడిన నివేదికను జనవరి 15లోపు అందజేయాలని పరిపాలక కమిటీని సుప్రీం బెంచ్ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment