డబ్లిన్: ఇంగ్లండ్‌తో ప్రధాన సిరీస్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో భారత జట్టు ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌లోనే తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. పసికూనలపై విరుచుకుపడి భారీ విజయం సొంతం చేసుకుంది. ఐర్లాండ్‌తో రెండు టి20ల సిరీస్ తొలి మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో గెలిచిన కోహ్లి సేన శుక్రవారం చివరిదైన రెండో టి20 ఆడనుంది. బుధవారం మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్, శిఖర్ ధావన్ చెలరేగడంతో భారత్ భారీ స్కోరు చేసింది. ఆపై స్పిన్నర్లు కుల్దీప్, చహల్ విజృంభించడంతో ఐర్లాండ్ కోలుకోలేకపోయింది. ఇదే ఊపులో రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ గెలుచుకోవాలని కోహ్లి సేన పట్టుదలగా ఉంది.
మార్పులకు వేళాయె....
సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లో ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. మూడు నెలల సుదీర్ఘ పర్యటన కావడంతో రిజర్వ్ బెంచ్ సత్తాను పరీక్షించుకునేందుకు టీమిండియాకు ఇది చక్కటి అవకాశం. గత మ్యాచ్‌లో బరిలో దిగిన సురేశ్ రైనా, మనీశ్ పాండేల స్థానంలో కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్‌లను ఆడించవచ్చని సమాచారం. విజయవంతమైన స్పిన్ ద్వయం చహల్–కుల్దీప్‌లకు ఢోకా లేకున్నా... పేసర్లు భువనేశ్వర్, బుమ్రాల స్థానాల్లో ఉమేశ్, సిద్ధార్థ్ కౌల్‌లకు చోటు దక్కవచ్చు.
ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలో దిగాలనుకుంటే పాండ్యానూ పక్కన పెట్టొచ్చు. మిడిలార్డర్‌లో భారీ మార్పులు తథ్యమన్న కెప్టెన్ విరాట్ కోహ్లి మాటలను బట్టి చూస్తే... ఓపెనర్లు రోహిత్, ధావన్, కెప్టెన్ కోహ్లి, కీపర్ ధోని, స్పిన్నర్లు కుల్దీప్, చహల్‌లు జట్టుతో ఉంటారు. మిగతా ఐదు స్థానాల్లో కొత్తవారు బరిలో దిగొచ్చు. తొలి మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ... ‘మిడిలార్డర్‌లో మార్పులు చేయనున్నాం. ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్‌లో ఆడని వారు శుక్రవారం బరిలో దిగుతారు’ అని అన్నాడు.
ఈ సారైనా పోటీనిస్తుందా...
ఓ వైపు టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్‌లో పటిష్టంగా కనిపిస్తుంటే... మరోవైపు ఐర్లాండ్ జట్టు అన్ని రంగాల్లో తడబడుతోంది. పెద్ద జట్లతో ఆడిన అనుభవంలేని ఆ జట్టు బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో మెరుగుపడాల్సి ఉంది. తొలిమ్యాచ్‌లో చెలరేగిన షెనాన్‌తో పాటు విల్సన్, పోర్టర్ ఫీల్డ్, కెవిన్ ఓబ్రైన్ బ్యాటింగ్‌లో సత్తా చాటాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment