
మిచెల్ జాన్సన్ కు కుక్ సవాల్
కార్డిఫ్: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ క్రికెట్ జట్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ కు ఒకరోజు ముందు మాటల యుద్ధానికి తెరలేచింది. బుధవారం ఇరు జట్లు కార్డిఫ్ లో తొలి టెస్ట్ కు సన్నద్ధమవుతున్న తరుణంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ కు ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ సవాల్ విసిరాడు. 2013-14 లో మిచెల్ జాన్సన్ చూపించిన హీరోయిజాన్ని మరోసారి చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడా?అంటూ సవాల్ విసిరాడు. ఆ సిరీస్ లో ఇంగ్లండ్ ను వైట్ వాష్ చేయడంలో కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్న మిచెల్.. అందుకు మరోసారి సన్నద్ధమైయ్యాడా? అంటూ కుక్ ఛాలెంజ్ చేశాడు.
ఆ సిరీస్ ను పునరావృతం చేయడానికి ఆసీస్ సర్వశక్తులు పెట్టి పోరాడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని.. 2010-11 యాషెస్ సిరీస్ లో ఏమైందో ఒకసారి గుర్తుకు తెచ్చకోవాలంటూ కుక్ ఎద్దేవా చేశాడు. గత సిరీస్ లో మిచెల్ జాన్సన్ 37 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.