మరో బాంబు పేల్చిన మియాందాద్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్, కోచ్ జావెద్ మియాందాద్ మరో బాబు పేల్చాడు. అవినీతి, ఆటగాళ్ల పేవలమైన ఆటతీరు తనను కోచ్ పదవికి రాజీనామా చేసేలా ప్రేరేపించాయని వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ కి చెందిన ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మియాందాద్ అప్పటి సంగతులు వివరించాడు. ఆటగాళ్ల అవినీతిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఖలీద్ మెహ్మూద్ కు ఫిర్యాదు చేశాననీ.. వీరిని ఉపేక్షిస్తే.. పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్ నాశమైతుందని హెచ్చరించానని.. బోర్డు తన మాటలు పెడచెవిన పెట్టిందని తెలిపాడు.
అప్పట్లో జట్టులో ఉన్న కొందరు సీనియర్ ఆటగాళ్లు.. బహిరంగంగానే అవినీతికి పాల్పడ్డారని చెప్పాడు. అదే ఏడాది ఇంగ్లండ్ లో జరిగిన ప్రపంచ కప్ కు కొద్ది రోజుల ముందు మియాందాద్ కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా చేయాల్సిందిగా తనపై పెద్దెత్తున వత్తిళ్లు వచ్చాయని మియాందాద్ తెలిపాడు. ప్రపంచ కప్ కి ముందు బోర్డు ఇచ్చిన విందులో ఆటగాళ్లంతా.. తనకు వ్యతిరేకంగా బోర్డుకు ఫిర్యాదు చేశారని వివరించాడు.
షార్జా టోర్నీలో సీనియర్లు ఫిక్సింగ్ కు పాల్పడ్డారంటూ మియాందాద్ ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే.. అయితే అది నిరాధారమని.. ఇక ఆయనతో కలిసి ఆడటం సాధ్యం కాదని.. ఆటగాళ్లు బోర్డుకు స్పష్టం చేశారు. దీంతో బోర్డు జోక్యం చేసుకుని మియాందాద్ ను కోచ్ పదవికి రాజీనామా చేయాల్సిందిగా వత్తిడి చేసింది. ఈ విషయాన్ని గుర్తుచేసుకున్న మియాందాద్.. "షార్జా టోర్నీలో ఇంగ్లండ్ పై మ్యాచ్ సందర్భంగా ఇద్దరు సీనియర్స్ కావాలని టీమ్ ఓడిపోయేలా చేశారు. ప్రశ్నించిన నాపై బ్యాట్ లు తీసుకుని బెదిరించారు.' అన్నాడు. అప్పటి బోర్డు చైర్మన్ తపై విశ్వాసం ఉంచలేదని.. దానికి ఫలితం.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం అనుభవిస్తోందని వ్యాఖ్యానించాడు. తనకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ఎంతో చింతిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం సయ్యద్ అన్వర్ స్వయంగా చెప్పాడని మియాందాద్ అన్నాడు. 1999 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ ఓడిపోవడానికి..వాల్డ్ కప్ ఫైనల్ లో జట్టు ఘోర పరాజయానికి కూడా ఈ అవినీతి ఆటగాళ్లే కారణమని చెప్పుకొచ్చాడు.