
లాహోర్: టీమిండియా-పాకిస్తాన్ క్రికెట్ జట్లు ఒక ద్వైపాక్షిక సిరీస్ ఆడి చాలా ఏళ్లే అయ్యింది. చివరిసారి 2008లో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్ జరిగితే.. ఐసీసీ నిర్వహించే మేజర్ ఈవెంట్లలో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. 2013 నుంచి ఇరు జట్ల మధ్య ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా జరగలేదు. అయితే తమతో టీమిండియా ఆడాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పదే పదే విజ్ఞప్తి చేసినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. కాగా, పాకిస్తాన్‌లో క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం టీమిండియా క్రికెట్ జట్టు తమ దేశం రావాలని కోరుకుంటున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ సుల్తాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిమానులు ప్లకార్డుల పట్టుకుని మరీ తమ కోరికను వెల్లడించారు.
భారత క్రికెట్ జట్టు తమ దేశం రావాలని వారు బ్యానర్లతో స్టేడియంలో కనిపించారు. దీనిని పాకిస్తాన్ జర్నలిస్టు సజ్ సిద్ధిక్ తన ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీనికి ‘లాహోర్ ఫ్యాన్స్ భారత్‌ను పాకిస్తాన్ రావాలని కోరుకుంటున్నారు’ అని క్యాప్షన్‌లో ఇచ్చాడు. ఇటీవల షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది లాంటి మాజీ క్రికెటర్లు భారత్ తమ దేశం రావాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల రాజకీయ సమస్యలను పక్కన పెట్టి క్రీడను క్రీడగా చూడాలని వారు కోరారు. ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్‌లను ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment