క్రికెట్ జూదంలా మారింది: మాజీ క్రికెటర్
కొలంబో: ఇటీవల వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లంక క్రికెట్ బోర్డును జూదగాళ్లు నడిపిస్తున్నారని ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు. ‘ప్రస్తుతం శ్రీలంక జట్టు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటోంది. మా దేశ క్రికెట్ బోర్డు పరిపాలనా విభాగంలో లోపాలున్నాయి. క్రికెట్‌ని జూదగాళ్లు నడిపిస్తున్నారు. దీంతో క్రికెట్ జూదగాళ్ల ఆటలా మారింది. వరుస పరాజాయాలకు ఆటగాళ్లు కారణం కాదు. దయచేసి వారిని నిందించవద్దు’ అని రణతుంగ అభిమానులను కోరారు.
ప్రస్తుతం బోర్డులో ఉన్న సభ్యుల్లో ఏ ఒక్కరికీ క్రికెట్ ఆడిన అనుభవం లేదని, ఇది చాల విచారించతగిన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డును నడిపించడానికి వారు అర్హులు కాదని, దీనివల్లనే తప్పులు జరుగుతున్నాయని రణతుంగ లంక బోర్డుపై మండిపడ్డారు. రెండు రోజుల క్రితం భారత్ అభిమానులను ఉద్దేశించి రణతుంగా వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గతంలో 2011 వరల్డ్‌కప్ ఫైనల్ ఫిక్సయిందని ఈ మ్యాచ్‌పై పూర్తి విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు.