సెమీస్‌ 'ఫీవర్‌' | Cricket World Cup Semi Final Fever in Hyderabad | Sakshi
Sakshi News home page

సెమీస్‌ ఫీవర్‌

Published Tue, Jul 9 2019 7:21 AM | Last Updated on Tue, Jul 9 2019 12:23 PM

Cricket World Cup Semi Final Fever in Hyderabad - Sakshi

సిటీలో క్రికెట్‌ ఫీవర్‌ పీక్‌స్థాయికి చేరింది. నేడు ఇండియా–న్యూజిలాండ్‌ జట్ల సెమీఫైనల్‌ మ్యాచ్‌ నేపథ్యంలో అంతటా ఉత్కంఠ నెలకొంది. ఫెక్సీలు..బ్యానర్లు..ప్రత్యేక స్క్రీన్లతో అభిమానులు హడావుడి చేస్తున్నారు.  న్యూజిలాండ్‌పై విజయం సాధించి ఇండియా ఫైనల్‌కు చేరుతుందని,ఫైనల్‌లోనూ గెలుపొంది వరల్డ్‌ కప్‌ సాధించడం ఖాయమని క్రికెట్‌ లవర్స్‌తోపాటు పలువురు ప్రముఖులు ధీమాగా ఉన్నారు.

సాక్షి, సిటీబ్యూరో/చార్మినార్‌/హిమాయత్‌నగర్‌ :నగరానికి వరల్డ్‌కప్‌ ఫీవర్‌ పట్టుకుంది..  క్రికెట్‌ అభిమానులు మంచి జోష్‌లో ఉన్నారు. నేడు మాంచెస్టర్‌లో జరిగే భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య సెమీఫైనల్‌ మ్యాచ్‌ కోసం ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల క్రికెట్‌ క్రేజ్‌కు మరింత జోష్‌నిస్తూ నగరంలోని బడా రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్బులు, క్లబ్బులు, కాఫీ షాపులు ప్రత్యేక ఆఫర్‌లతో ఓ వైపు విందు.. మరోవైపు క్రికెట్‌ వినోదాన్ని పంచేందుకు అన్ని ఏర్పాట్లు చేశాయి. జయహో భారత్‌ అనే ప్రత్యేక స్క్రీన్‌లతో మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారాలను అభిమానులు చూసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నోరూరించే రుచులతో విభిన్నమైన వంటకాలను ప్రత్యేక ఆఫర్‌లతో నగరవాసులకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చేవారికి ప్రత్యేక వంటకాల మెనూను అందుబాటులో ఉంచామని వివిధ రెస్టారెంట్‌ నిర్వాహకులు చెబుతున్నారు. ‘రోజువారీ వంటకాలకు కొంచెం డిఫరెంట్‌గా అదనంగా రెండు రకాల బిర్యానీ రుచులు అందించేందుకుసిద్ధమవుతున్నాం’ అని గచ్చిబౌలిలోని ఉలవచారు రెస్టారెంట్‌ ఎండీ వినయ్‌ తెలిపారు. ‘స్పెషల్‌ డీజేతో పాటు పెద్ద స్క్రీన్‌ ఏర్పాటు చేశాం.  డ్రింక్స్‌ మీద కూడా ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నాం. మ్యాచ్‌ ముగిసినా మరో గంట పాటు పార్టీకొనసాగుతుంది’ అని చెప్పారు అవుట్‌ స్వింగర్‌ పబ్‌కు చెందిన అమేయ్‌. ఇదే తరహాలో పలు హోటల్స్‌ సైతం ప్రత్యేక ఆఫర్లతో సిటీ యూత్‌ని ఆకట్టుకుంటున్నాయి. 

పాతబస్తీలో భారీ ఫ్లెక్సీలు..  
కమాన్‌ ఇండియా.. విన్‌ ఫైనల్‌.. టేక్‌ వరల్డ్‌ కప్‌ అంటూ పాతబస్తీలో ఫ్లెక్సీలు వెలిశాయి. మదీనా సర్కిల్‌లోని మహ్మద్‌ క్యాప్‌ మార్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహ్మద్‌ ఇలియాస్‌ బుకారీ ఆధ్వర్యంలో నయాపూల్‌ బ్రిడ్జిపై ప్రపంచ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో భారత్‌దే విజయమంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి క్రికెట్‌పై తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. సెమీఫైనల్లో భారత్‌ నెగ్గి ఫైనల్‌ చేరుకుంటే ఈ నెల 14న పాతబస్తీ నుంచి గుర్రం బగ్గీతో ప్రదర్శన నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎనిమిది గుర్రాలతో ప్రత్యేక బగ్గీని తయారు చేయించి భారత క్రికెట్‌ ఆటగాళ్ల బొమ్మలను ఏర్పాటు చేసి బాజాభజంత్రీలతో పాతబస్తీలోని మదీనా నుంచి మొజంజాహీ మార్కెట్, అబిడ్స్, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌ రోడ్డు మీదుగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ వరకు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  

సెమీస్‌.. కప్పు.. రెండూ గెలవబోతున్నాం
‘లా ఆఫ్‌ యావరేజెస్‌’ ప్రకారం చూస్తే ఈసారి భారత్‌ జట్టు సెమీ ఫైనల్స్‌తో పాటు ఫైనల్స్‌లోనూ గెలిచి ప్రపంచ కప్పు సొంతం చేసుకోబోతోంది. ఇప్పటికి జరిగిన మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల్లో వరుసగా గెలిస్తే ఆ ధీమాతో ఉదాసీనత కారణంగా ఓడిపోయే ప్రమాదం ఉండేది. లా ఆఫ్‌ యావరేజెస్‌ ప్రకారం తొమ్మిదింటిలో ఏదో ఒక మ్యాచ్‌లో ఓడిపోవాల్సిందే. ఇప్పటికే భారత్‌ జట్టు ఇంగ్లండ్‌పై ఓడిపోయింది. దీంతో ఆ థియరీ ప్రకారం ఇక కప్పు గెలుచుకునే అవకాశాలు పెరిగాయి. ఇప్పటి వరకు క్రికెట్‌ కెరీర్‌లో టీ– 20 సహా అనేక మ్యాచ్‌లు ఆడిన నా అనుభవం సైతం ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది. వాటిలో వరుసగా మ్యాచ్‌లు గెలిస్తే సెమీస్‌ లేదా ఫైనల్స్‌లో కప్పును కోల్పోయేవాళ్లం. అలా కాకుండా ఏదో ఒక మ్యాచ్‌లో ఓడి సెమీస్‌ వరకు వెళ్తే కప్పును సొంతం చేసుకునేవాళ్లం. ఇలా లా ఆఫ్‌ యావరేజెస్‌ థియరీ అనేకసార్లు నిజమైంది. ఇప్పుడు భారత జట్టు విషయంలోనూ నిజమవుతుందనే భావిస్తున్నా.– సీవీ ఆనంద్, సీఐఎస్‌ఎఫ్‌ ఐజీ/క్రికెటర్‌

అభిమానులను ఉత్సాహపర్చాలని..  
మా కుటుంబానికి క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టం. భారత ఆటగాళ్లంటే అభిమానం. భారత్‌ విజయం సాధించినప్పుడల్లా కుటుంబ సభ్యులందరం పండగ చేసుకుంటాం. మా నాన్నగారు దివంగత మహ్మద్‌ యాకుబ్‌ బుకారీ సైతం క్రికెట్‌ అభిమానే. ఆయన కాలం నుంచే మేము వినూత్న ప్రదర్శనలు నిర్వహిస్తూ వస్తున్నాం.    – మహ్మద్‌ ఇలియాస్‌ బుకారీ,మహ్మద్‌ క్యాప్‌ మార్ట్‌ ఎండీ

వరల్డ్‌ కప్‌ మనదే..
భారత జట్టు ఆటతీరు ఎంతో బాగుంది. మునుపెన్నడూ లేని విధంగా చక్కటి ప్రతిభను కనబరుస్తున్నారు. అంచనాలనుతలకిందులు చేస్తూ క్రీడాభిమానుల మన్ననలు  అందుకుంటున్నారు మనవాళ్లు. సెమీఫైనల్‌లో అత్యుత్తమ ప్రతిభను కనబరచి ఫైనల్‌కు చేరుకుంటారనే నమ్మకం బలంగా ఉంది. ఫైనల్‌లోనూ ప్రత్యర్థిని ఓడించి వరల్డ్‌ కప్‌ను కచ్చితంగా సాధిస్తుందని విశ్వసిస్తున్నా. – అజారుద్దీన్, మాజీ కెప్టెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement