గంభీర్ & గంభీర్
న్యూఢిల్లీ: అదో బార్ అండ్ రెస్టారెంట్... దాని పేరు ఘుంగ్రూ ‘బై’ గౌతమ్ గంభీర్. ఇదే పేరుతో రాజధాని నగరంలో పలు చోట్ల హోర్డింగ్‌లు వెలిశాయి. చూడగానే ఇదేదో భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్‌కు సంబంధించిందే అనిపిస్తుంది కదా! సరిగ్గా ఇదే విషయం గంభీర్‌కు కూడా చిర్రెత్తించింది. అసలు మద్యం ముట్టని తన పేరును ఇలా బార్ ప్రచారానికి వాడుకోవడం ఏమిటని ఆగ్రహించిన అతను ఏకంగా ఢిల్లీ హైకోర్టులోనే కేసు వేశాడు. తనకు ఈ బార్‌తో చెడ్డ పేరు వస్తోందని అతను పిటిషిన్ దాఖలు చేశాడు. అయితే ఇక్కడే ఉంది ట్విస్ట్. ఆ బార్ యజమాని పేరు కూడా గౌతమ్ గంభీర్ కావడమే వివాదానికి కారణం.
అతనితో చర్చించేందుకు గంభీర్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాను కూడా వెనక్కి తగ్గనని, కోర్టులోనే తేల్చుకుంటానని అతను కూడా సవాల్ చేశాడు. ‘ఆయన ప్రముఖుడు, పెద్ద క్రికెటర్ కావచ్చు. అయితే ఏంటి? నాకంటూ సొంత గుర్తింపు ఉంది. ఆయన పేరు గౌతమ్ గంభీర్ అయితే నన్ను పేరు మార్చుకోమంటారా? నేనేమీ ఆయనను బద్నాం చేయడం లేదు. ఎక్కడా క్రికెట్‌కు సంబంధించిన వస్తువులను ప్రకటనల్లో చూపించడం లేదు. నా సొంత పేరును నా వ్యాపారానికి వాడుకునే హక్కు నాకు ఉంది’ అంటూ వ్యాపారి గంభీర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు!