న్యూఢిల్లీ : ముంబై యువ క్రికెటర్, భారత టెస్టు ఓపెనర్ పృథ్వీ షా డోపింగ్ టెస్టులో దొరికిపోయాడు. అతని నుంచి సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షించగా నిషేధిత ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలింది. దీంతో బీసీసీఐ అతనిపై 8 నెలల నిషేధం విధించింది. కానీ దీన్ని తాజాగా కాకుండా పాత తేదీ (మార్చి 16)తో విధించడం వల్ల వచ్చే నవంబర్ 15వ తేదీతో నిషేధం ముగుస్తుంది. మరో ఇద్దరు జూనియర్ క్రికెటర్లు అక్షయ్, దివ్య గజ్‌రాజ్‌లకు కూడా ఇదే విధమైన నిషేధాన్ని బోర్డు విధించింది. అయితే పృథ్వీ షా కావాలని ఉత్ప్రేరకాన్ని తీసుకోలేదు. దగ్గుతో బాధపడుతుండగా దగ్గుమందులో నిషేధిత టెర్బుటలైన్ అనే ఉత్ప్రేరకం ఉంది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలో టెర్బుటలైన్ ఉత్ప్రేరకం ఉంది. దీనిపై అవగాహన లేకే తీసుకున్నట్లు పృథ్వీ బోర్డుకు వివరణ ఇచ్చాడు. కావాలని కాకుండా మెడిసిన్‌గా తీసుకోవడంతో బోర్డు కరుణించి 8 నెలలతో సరిపెట్టింది.
నిషేధం సరే... మరి ఐపీఎల్ ఆడాడుగా!
బోర్డు ప్రతిభావంతుడైన యువ క్రికెటర్ పృథ్వీ షాపై కరుణ చూపించడం బాగానే ఉంది. అతని కెరీర్‌కు ఇబ్బంది లేకుండా పాత తేదీతో విధించింది. అలాంటపుడు ఐపీఎల్ ఆడిన సంగతి మరిచిందా. మార్చి 15 నుంచి నిషేధం అమలైతే మార్చి 23 నుంచి మొదలైన ఐపీఎల్ 12వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడుగా... మరి ఇదేరకమైన నిషేధమో బోర్డే సెలవివ్వాలి!
Comments
Please login to add a commentAdd a comment