14 ఏళ్ల వయసులో పాఠశాల జట్టు రిజ్వీ స్ప్రింగ్ ఫీల్డ్ తరఫున ఒకే ఇన్నింగ్స్‌లో 546 పరుగులు. 17 ఏళ్ల వయసులో అరంగేట్ర ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో పాటు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కైవసం. తొలి దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లోనే, అదీ అతి చిన్న వయసులోనే సెంచరీ చేసిన అరుదైన రికార్డు. దేశానికి అండర్–19 ప్రపంచ కప్ సారథి. ఇప్పుడిక మొదటి ఫస్ట్‌క్లాస్‌మ్యాచ్ ఆడిన 21 నెలల వ్యవధిలోనే జాతీయ జట్టు తరఫున ప్రాతినిధ్యం... ఈ ఘనతలన్నీ పృథ్వీ షా సొంతం. గురువారం రాజ్‌కోట్ టెస్టు బరిలో దిగనున్న 18 ఏళ్ల 329 రోజుల పృథ్వీ... గత 11 ఏళ్లలో టీమిండియాకు ఆడిన పిన్న వయస్కుడు కానుండటం విశేషం. 2007లో ఇషాంత్ శర్మ (అప్పటికి 18 ఏళ్ల 265 రోజులు) తర్వాత మరే టీనేజ్ ఆటగాడూ టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించలేదు.
ఇంత త్వరగా ఊహించలేదు...
పృథ్వీ టీమిండియాకు ఆడటం ఖాయమన్నది అతడి మొదటి మ్యాచ్‌లోనే తేలిపోయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ ముంబైకర్... అక్కడా ఇక్కడా అని కాకుండా అన్ని స్థాయిల జట్లపై, భిన్న వేదికలపై పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లోనూ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. దీనికి తగ్గట్లే పరిస్థితులు కలిసి వచ్చి ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్టులకు ఎంపికయ్యాడు. అక్కడ దక్కని అవకాశం... నేడు వరించింది. అయితే, ఇది కొంత ఆశ్చర్యకరమే అనుకోవాలి. ఎందుకంటే రాజ్‌కోట్‌లో కేఎల్ రాహుల్‌తో కలిసి మయాంక్ అగర్వాల్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడన్న ఊహాగానాలు బలంగా వినిపించాయి. అనుభవం పరంగా చూసుకున్నా మయాంక్ వైపే మొగ్గు కనిపించింది. కానీ, టీం మేనేజ్‌మెంట్ మరోలా ఆలోచించింది. రెండో ఓపెనర్‌గా 27 ఏళ్ల మయాంక్ కంటే పృథ్వీనే ఎంచుకుంది. ఇంగ్లండ్‌లో జట్టుతో పాటు ఉండటం పృథ్వీకి చివరి నిమిషంలో మేలు చేసింది.
కొసమెరుపు: రంజీట్రోఫీలో భాగంగా పృథ్వీ తన తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ (2017 జనవరి 1–5)ను తమిళనాడుపై రాజ్‌కోట్‌లోనే ఆడాడు. నాటి ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో అతడు తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులకే ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చెలరేగి ఆడాడు. 250 పరుగుల లక్ష్య ఛేదనలో ఐదో రోజు బ్యాటింగ్‌కు దిగిన ముంబై... పృథ్వీ (175 బంతుల్లో 120; 13 ఫోర్లు, 1 సిక్స్) దూకుడైన ఆటతో విజయం అందుకుంది. నాటి అద్భుత ఇన్నింగ్స్‌కు వేదికైన రాజ్‌కోట్‌లోనే పృథ్వీ నేడు దేశానికి ఆడనుండటం విశేషం.
–సాక్షి క్రీడా విభాగం
కోహ్లి నాతో మరాఠీలో మాట్లాడాడు...
డ్రెస్సింగ్ రూమ్‌లో నన్ను ఊహించుకోవడం ఉద్వేగంగా ఉన్నా... బాగుంది. ఇక్కడ జూనియర్, సీనియర్ భేదం లేదని విరాట్ భాయ్, రవి సర్ చెప్పారు. మైదానంలో కోహ్లిని చూస్తే సీరియస్‌గా ఉంటాడని అనుకుంటారు. కానీ, మైదానం బయట చాలా సరదా మనిషి. మాట్లాటడం మొదలైన కొద్దిసేపటికే నాపై జోకులు వేశాడు. అంతేకాక అతడు మరాఠీలో సంభాషించేందుకు యత్నించడం నవ్వు తెప్పించింది.
– పృథ్వీ షా
Comments
Please login to add a commentAdd a comment