రంజీ ట్రోఫీలో ఇవాళ (జనవరి 23) టీమిండియా స్టార్ బ్యాటర్లకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. రోహిత్ శర్మ మొదలుకుని.. వెటరన్లు రహానే, పుజారా, హనుమ విహారి వరకు అంతా దారుణంగా విఫలమయ్యారు. ప్రస్తుత భారత టెస్ట్ జట్టు సభ్యులు రోహిత్ (3), జైస్వాల్ (4), శుభ్‌మన్ గిల్ (4), రిషబ్ పంత్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔట్ కాగా.. భారత వన్డే జట్టు సభ్యుడు శ్రేయస్ అయ్యర్ (11), టీమిండియా భవిష్యత్తు తార రుతురాజ్ గైక్వాడ్ (10) స్వల్ప స్కోర్లకే నిష్క్రమించారు.
గతంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన భారత క్లాసికల్ బ్యాటర్లు రహానే (12), పుజారా (6), హనుమ విహారి (6) కూడా తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. విధ్వంసకర ఆటగాళ్లు రజత్ పాటిదార్ (0), శివమ్ దూబేకు (0) కూడా ఇవాళ బ్యాడ్ డేనే.
టీమిండియా ఆటగాళ్లలో ఇవాళ ఎవరైనా సత్తా చాటారా అంటే అది రవీంద్ర జడేజా మాత్రమే. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో జడ్డూ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. జమ్మూ అండ్ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ (51) మెరుపు అర్ద సెంచరీ చేసి తన జట్టు (ముంబై) పరువు నిలబెట్టాడు.
ఇవాల్టి నుంచి ప్రారంభం
రంజీ ట్రోఫీ 2024-25లో ఇవాల్టి నుంచి (జనవరి 23) సెకెండ్ లెగ్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. తొలి రోజు టీమిండియా ఆటగాళ్లంతా దాదాపుగా తేలిపోయారు. రవీంద్ర జడేజా మినహాయించి చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు.
రంజీ ట్రోఫీలో ఇవాల్టి హైలైట్స్
- ఢిల్లీపై రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర) ఐదు వికెట్ల ప్రదర్శన
- ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్లు పడగొట్టిన గుజరాత్ బౌలర్ సిద్దార్థ్ దేశాయ్
- మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో ఒడిషా బౌలర్ తపస్ దాస్ 6 వికెట్ల ప్రదర్శన
- ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన బీహార్ ఆటగాడు ఆయుష్ లోహారుకా (101)
- జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్న చత్తీస్‌ఘడ్ ఆటగాడు అనుజ్ తివారి
- ఇదే మ్యాచ్‌లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన జార్ఖండ్ బౌలర్ ఉత్కర్ష్ సింగ్
- హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బెంగాల్ బౌలర్ సూరజ్ సింధు జైస్వాల్
- చండీఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన తమిళనాడు ఆటగాడు ఆండ్రీ సిద్దార్థ్ (106)
- ఇదే మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన చండీఘడ్ బౌలర్ విషు కశ్యప్
- మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన కేరళ బౌలర్ నిధీశ్
- హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకం బాదిన హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (137)
- పుదుచ్ఛేరిపై సెంచరీ చేసిన ఆంధ్ర ఓపెనర్ షేక్ రషీద్ (105)
- విదర్భపై 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రాజస్థాన్ బౌలర్ ఖలీల్ అహ్మద్
Comments
Please login to add a commentAdd a comment