పేరే పెట్టుబడి లేదు రాబడి
► వేర్వేరు క్రీడల జట్లలో భాగస్వాములుగా భారత క్రికెటర్లు
► జట్టు పాపులారిటీపై కనిపించని ప్రభావం ఒకట్రెండు కార్యక్రమాలకే పరిమితం
క్రికెటర్‌గా ఇప్పటికే వచ్చిన పేరు ప్రతిష్టలతో పోలిస్తే కొత్తగా వచ్చే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమీ లేదు... ఆదాయ పరంగా కూడా ఫ్రాంచైజీ యజమానికి అంత గిట్టుబాటు అవుతుందని కూడా గ్యారంటీ ఏమీ లేదు...
పోనీ సదరు ఆటకు చిన్నప్పటి నుంచి వీరాభిమాని కాబట్టి అభిమానంతో వెళ్లారా అంటే టోర్నీ ముగిశాక మరోసారి అటు వైపు తిరిగి కూడా చూసింది లేదు. మరి భారత క్రికెటర్లు ఇతర క్రీడల లీగ్‌లలో ఎందుకు సహ భాగస్వాములు అవుతున్నారు. వారు ఆశిస్తున్నదేమిటి. అసలు క్రికెటర్లు ఏ మాత్రం పెట్టుబడి పెడుతున్నారు. అది ఫ్రాంచైజీలకు ఏమైనా లాభం చేకూరుస్తోందా... క్రికెటర్లను ముందు పెడితే వారికి వస్తోందేమిటి. వారు తిరిగి ఇస్తున్నదేమిటి?
సాక్షి క్రీడా విభాగం
సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, రోహిత్ శర్మ... క్రికెటేతర లీగ్‌లలో భాగస్వాములుగా మారిన భారత క్రికెటర్ల జాబితా ఇది. గతంలో కపిల్ జమానానుంచి కూడా అనేక మంది క్రికెటర్లు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెడుతూనే వచ్చారు. కొన్ని మంచి లాభాలతో వెలిగిపోగా మరికొన్ని నష్టాలు చవిచూశాయి. అయితే ఇప్పుడు ఒకే సారి ఇంత మంది క్రికెటర్లు స్పోర్ట్స్ లీగ్‌లో భాగస్వాములుగా ఉండటం విశేషం. ఇటీవల ఆయా లీగ్‌లలో మ్యాచ్‌లు జరిగినప్పుడు జట్టులోని సభ్యుడో లేక కెప్టెనో కాకుండా... సచిన్ వర్సెస్ గంగూలీ, ధోని వర్సెస్ కోహ్లి అంటూ ఆ మ్యాచ్‌లు ఎక్కువగా ఆసక్తి రేపాయి.
ఎవరెక్కడ..?
భారత అత్యుత్తమ కెప్టెన్‌గా నిలిచిన ధోని ప్రస్తుతం రెండు లీగ్‌లలో భాగస్వామిగా ఉన్నాడు. హాకీ ఇండియా లీగ్‌లో తన సొంత నగరం పేరుతో ఉన్న రాంచీ రేస్, ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్‌లో చెన్నైయిన్ టీమ్‌లకు అతను సహ యజమాని. గతంలో ధోని ‘మహి రేసింగ్ టీమ్’లో కూడా పార్ట్‌నర్‌గా ఉన్నా... ఆర్థికపరమైన నష్టాలతో ఆ టీమ్ గత సీజన్‌లోనే పోటీనుంచి తప్పుకుంది.
ఐఎస్‌ఎల్‌లో గోవా జట్టుకు భాగస్వామి అయి, ఇండియన్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్‌లో యూఏఈ రాయల్స్‌లో జత కట్టిన కోహ్లి... ఆ తర్వాత రెజ్లింగ్ లీగ్‌లో బెంగళూరు టీమ్‌ను కొన్నాడు. ఐఎస్‌ఎల్‌లో సచిన్ కేరళ బ్లాస్టర్స్, గంగూలీ కోల్‌కతాకు సహ యజమానులుగా ఉన్నారు. రైనా హాకీలోనే యూపీ విజార్డ్స్ టీమ్‌ను తీసుకోగా, రోహిత్ రెజ్లింగ్‌లో యూపీ వారియర్స్ టీమ్‌తో చేరాడు. వీరంతా తమ తమ జట్లలో పూర్తిగా వంద శాతం యజమానులుగా కాకుండా కన్సార్టియంగా ఏర్పడిన టీమ్‌లో భాగస్వాములుగా ఉన్నారు.
ఆరంభ శూరత్వం
ఆయా లీగ్‌లలో యజమానులుగా ఈ క్రికెటర్ల పాత్ర చూస్తే చాలా వరకు తాము భాగస్వామిగా చేరుతున్నట్లు ప్రకటిస్తూ హడావిడి చేయడానికే ఎక్కువగా పరిమితమవుతున్నారు. లేదంటే ఆరంభంలో ఉన్న జోష్ రానురానూ తగ్గిపోయి నామ్‌కే వాస్తేగా ఉండిపోతున్నారు. ఐఎస్‌ఎల్ తొలి సీజన్‌లో సచిన్ భారీ హంగామా చేశాడు. కేరళ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఆ రాష్ట్ర ప్రచారకర్తగా మారిపోయాడు. రెండో సీజన్‌కు వచ్చే సరికి అలాంటిది ఏమీ కనిపించకపోగా, పెద్దగా హంగామా కూడా లేదు. ఫుట్‌బాల్ అంటే పిచ్చి ఉన్న ధోని కొంత వరకు ఐఎస్‌ఎల్‌లో కనిపించినా... హాకీ విషయానికి వస్తే అతనితో పాటు రైనా కూడా ప్రారంభ కార్యక్రమం మినహా మరోసారి కనిపిస్తే ఒట్టు! కోహ్లి కూడా దాదాపుగా అంతే. విరాట్... పొరపాటున కూడా టెన్నిస్ మ్యాచ్‌ల వైపు చూడలేదు. ఇక రెజ్లింగ్‌కూ అతను దూరంగానే ఉన్నాడు. రెజ్లింగ్ లీగ్‌లలో ఒక్క మ్యాచ్‌కు కూడా రోహిత్ రాలేదు.
పెట్టుబడి...రాబడి...
అనధికారిక సమాచారం ప్రకారం ఈ క్రికెటర్లు కేవలం తమ ‘పేరు ప్రఖ్యాతులనే’ పెట్టుబడిగా పెడుతున్నారు. ‘ఇది ఒక రకంగా వారితో వ్యాపార ప్రకటన చేయిస్తున్నట్లే. మార్కెట్‌లో కొత్త వస్తువు ఏదైనా వస్తే దాని గురించి ప్రపంచానికి మొదటిసారి చెప్పాలంటే కాస్త హంగామా అవసరం. పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండే ఈ క్రికెటర్లు ఆ పని చేయగలరు. వారి వల్ల ఏ మాత్రం ప్రచారం లభించినా అది ప్రయోజనకరమే. అందుకే అసలు ఓనర్లు సహ యజమాని అనే ముద్దు పేరు పెట్టి వారిని తీసుకొస్తున్నారు’ అని ఒక ప్రముఖ మార్కెటింగ్ సంస్థకు చెందిన సీనియర్ అధికారి వెల్లడించారు.
‘క్రికెటర్లలో ఎక్కువ మంది ఎవరూ తమ సొంత డబ్బుతో పెట్టుబడి పెట్టడం లేదు. ఒక వేళ ఉన్నా నామమాత్రమే. ఒప్పందం ప్రకారం ఒకట్రెండు ప్రచార కార్యక్రమాలకు హాజరు కావాలి. లీగ్ ముగిశాక సదరు జట్టుకు లాభం వస్తే అందులో కొంత వాటాను అందిస్తారు. ఒక వేళ నష్టపోతే మాత్రం ఆ భారం వారిపై వేయరు. ‘రెండు రకాలుగా కూడా క్రికెటర్లకు ఇది ప్రయోజనకరం. మరో ఆట గురించి నాలుగు మంచి మాటలు చెబితే పోయేదేముంది. ఈ విషయంలో యాజమాన్యానికి తమ సొంత లెక్కలు ఉన్నాయి’ అని ఆ అధికారి విశ్లేషించారు.
లాభం వస్తే కదా...
ఐపీఎల్ స్ఫూర్తితోనే, దాదాపు అదే తరహాలో ఈ కొత్త లీగ్‌లన్నీ పుట్టుకొచ్చాయి. కానీ ఆర్థికంగా ఇవి నిర్వాహకులకు భారీ ఆదాయాలు తెచ్చి పెట్టాయా అనేది సందేహమే. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఐపీఎల్ జట్లు కూడా నష్టాలు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అలాంటప్పుడు క్రికెటేతర క్రీడల లీగ్‌ల ఫ్రాంచైజీలు మూటగట్టుకునేది పెద్దగా ఉండకపోవచ్చు. తాము ఆశించిన ఆదాయం వస్తే గానీ వారు మరొకరికి ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు జట్లకు భారీగా లాభాలు వచ్చిన దాఖలాలు కూడా లేవు. అలాంటప్పుడు వారు తమ వాటా పోగా అందులో కొంత మొత్తం క్రికెటర్లకు ఇచ్చేదెప్పుడు? మొత్తంగా చూస్తే ఇదో ప్రచారార్భటపు ప్రయత్నమే తప్ప దీని వల్ల సదరు లీగ్‌కు చెప్పుకోదగ్గ ప్రయోజనమూ దక్కడం లేదు, సదరు క్రీడకు విలువ కూడా పెరగడం లేదు.
ఆ ఒక్కటి మినహా...
క్రికెటర్ల పాత్ర లీగ్‌లను ఆకర్షణీయంగా మారుస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. దీనికి అత్యుత్తమ ఉదాహరణ ప్రొ కబడ్డీ లీగ్. ఈ టోర్నీలో ఒక్క క్రికెటర్ కూడా పెట్టుబడి పెట్టడం గానీ, సహ భాగస్వామిగా గానీ లేడు. కానీ ఐపీఎల్ తర్వాత కబడ్డీ లీగ్ మాత్రమే సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ లీగ్ అన్ని వర్గాలను ఆకట్టుకుంది. ఫలితంగా సంవత్సరం తిరిగే లోపే మరోసారి టోర్నీ జరిపేందుకు నిర్వాహకులు సన్నద్ధమైపోయారు. ఇదంతా కబడ్డీ క్రీడకు లభించిన ఆదరణే తప్ప దాని యజమానులకు కాదు. అంటే ఆటపై ఆసక్తి ఉన్న అభిమాని దాని వెనక ఎవరు ఉన్నా లేకపోయినా మ్యాచ్‌లను చూసేందుకు మాత్రం ఉత్సాహం చూపిస్తారనేది ఖాయం.
ప్రయోజనం ఉందా...
నిజంగా క్రికెటర్ల ప్రచారం లీగ్‌లకు ఏదైనా అదనపు మేలు చేస్తోందా అంటే సందేహమే. క్రికెటర్ల జట్లు కదా అని అభిమానులు పొలోమంటూ ఈ లీగ్‌లకు వెల్లువలా రావడం లేదు. గత రెండేళ్ల పరిస్థితి చూస్తే... ఐఎస్‌ఎల్ మ్యాచ్‌లు జరిగిన నగరాలను మాత్రమే ఆకర్షించగలిగింది. దేశంలోని ఇతర చోట్ల దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. టెన్నిస్‌కు కోహ్లికంటే ఫెడరర్, నాడల్, సానియాలే ప్రధాన ఆకర్షణ. క్రికెట్ స్టార్లు వచ్చినా, రాకున్నా దశాబ్దాలుగా హాకీకి అడ్డాలుగా ఉన్న కొన్ని చోట్లనే లీగ్ సక్సెస్ అవుతోంది తప్ప దక్షిణం దిశగా అసలు ప్రభావమే లేదు. ఇక తొలిసారి నిర్వహించిన రెజ్లింగ్ లీగ్ విజయవంతం అవుతుందా లేదా అనేదానిపై ఇంకా సందేహాలు ఉన్నాయి.