
అలసట అని చెప్పను!
∙ బిజీ షెడ్యూల్ అలవాటైంది
∙ క్లిష్ట పరిస్థితులను అధిగమిస్తేనే ఫలితం
∙ భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ మనోగతం
భారత క్రికెట్‌లో అత్యంత నైపుణ్యం కలిగిన ఆటగాడిగా రోహిత్ శర్మకు పేరుంది. వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా పేరు తెచ్చుకున్న అతను ఇటీవలే ముగిసిన శ్రీలంక పర్యటనలోనూ శతకాలతో మెరిశాడు. అయితే గాయం కారణంగా గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఈ ముంబైకర్ క్రికెట్‌కు దూరం కావాల్సి వచ్చింది. లండన్‌లో సర్జరీ అనంతరం జాతీయ క్రికెట్ శిబిరం (ఎన్‌సీఏ)లో పునరావాసానికి వెళ్లాడు. అయితే ఈ విరామమేదీ అతడి నైపుణ్యాన్ని వెనక్కి నెట్టలేదు. ఆరు నెలల అనంతరం భారత జట్టు తరఫున తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీలో అడుగుపెట్టిన ఓపెనర్ రోహిత్ అదరగొట్టే ప్రదర్శన చేశాడు.
మొత్తం 10 వన్డేల్లో మూడు సెంచరీలతో రాణించాడు. దీనికి ముందు తను ఐపీఎల్‌లో ఆడి ముంబై ఇండియన్స్‌కు టైటిల్ అందించగలిగాడు. కానీ గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసి రాణించడం అంత తేలికేమీ కాదని రోహిత్ చెబుతున్నాడు. ప్రత్యర్థి ఎవరనేది కాకుండా పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటమే తన ఉద్దేశమని అన్నాడు. ప్రస్తుతం ఆసీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు సిద్ధమవుతున్న రోహిత్ నాలుగేళ్ల క్రితం వన్డేల్లో తన తొలి డబుల్ సెంచరీని కూడా వారిపైనే సాధించాడు.
విరామం తర్వాత కష్టమే...
ఏ ఆటగాడికైనా గాయాల తర్వాత తిరిగి జట్టులోకి రావడమంటే సవాలే. శస్త్రచికిత్స అనంతరం అంతర్గత భయాలను అధిగమించడం చాలా కష్టం తో కూడుకుంది. ఎవరికి వారు ఈ సమస్య నుంచి బయటపడాల్సి ఉంటుంది. నా బ్యాటింగ్ చాలా సులువుగా అనిపించవచ్చు కానీ అది మీ కంటికి కనిపించినంత సులువు మాత్రం కాదు.
ఐపీఎల్ బాగానే ఆడినా...
నిజానికి నా పునరావాస శిబిరం పూర్తయ్యాక ఐపీఎల్ ప్రారంభం కావడం లాభించింది. ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నప్పుడు ఒకవేళ తిరిగి గాయపడితే ఎలా? అనే ఆందోళన ఎప్పుడూ కలగలేదు. అయితే భారత జట్టుకు ఆడుతూ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం నా మనస్సులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు లేవు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి అలక్ష్యానికి తావు లేదు. కచ్చితంగా నిరూపించుకోవాల్సి ఉంటుంది.
ధనంజయ బౌలింగ్ అర్థమైంది
శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో స్పిన్నర్ ధనంజయ ఆరు వికెట్లతో చెలరేగాడు. అయితే నేను అర్ధ సెంచరీతో రాణించినా అతడి బంతులను ఎక్కువగా ఎదుర్కోలేదు. అతడు బౌలింగ్‌కు వచ్చిన తొలి ఓవర్‌లోనే నేను వెనుదిరిగాను. అయితే ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో అతడి బౌలింగ్‌ను పూర్తిగా అర్థం చేసుకొని ఆడాను.
పరిస్థితులకు తగ్గట్టుగానే
నా సన్నాహకాలు ఎప్పుడైనా ప్రత్యర్థిని బట్టి కాకుండా పరిస్థితులకు తగ్గట్టుగానే ఉంటాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా జట్ల కోర్ గ్రూప్ ఒకేలా ఉంటుంది. ఫలానా పిచ్‌లపై ఎలాంటి షాట్లు ఆడితే మేలు అనే విషయాలు తెలిసి ఉండాలి. నీ ఇన్నింగ్స్‌ను ఎలా ఆడబోతున్నావనే దానిపై స్పష్టత అవసరం.
స్టార్క్ లేకపోవడం లోటే
ఆసీస్ జట్టులో మిషెల్ స్టార్క్ లేకపోవడం వారికి లోటుగానే చెప్పవచ్చు. స్టార్క్ జట్టులో ఉంటే అదనపు బలంగా ఉంటుంది. అయితే జట్టులోని చాలామంది ఆటగాళ్లుఐపీఎల్‌లో ఆడి ఉండటంతో వారికి ఇక్కడి పిచ్‌లపై పరిజ్ఞానం ఉంటుంది. కచ్చితంగా వారిని మేం తేలిగ్గా తీసుకోం.
కెప్టెన్సీ ఓ గౌరవం
టీమిండియా వైస్‌కెప్టెన్‌గా ఉండటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. మైదానంలో విరాట్‌కు సహాయపడటమే నా విధి. నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని అనుకుంటున్నాను.
రొటేషన్ పాలసీపై
కఠినమైన షెడ్యూల్, ఎక్కువ క్రికెట్ ఆడాల్సి రావడం ఇప్పుడు కొత్తేమీ కాదు. చాలా రోజులుగా దీనికి అలవాటు పడిపోయాం. మన శరీరం ఎలా స్పందిస్తుందనేదానిపై మనకు అవగాహన ఉండాలి. ఏదైనా సమస్య వస్తే జట్టుతో పాటు ఫిజియో, ట్రైనర్, డాక్టర్ ఎలాగూ ఉన్నారు. ప్రతీ ఆటగాడు వంద శాతం ఫిట్‌గా ఉండాలనే రొటేషన్ పాలసీని అమలు చేస్తున్నారు. క్రికెటర్ల కెరీర్ చాలా చిన్నది. ఉన్న సమయాన్నే పూర్తిగా ఉపయోగించుకొని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలి. కాబట్టి అలసిపోయాను అని, షెడ్యూల్ ఇబ్బందికరంగా ఉందని సాకులు చెప్పరాదు.