బాల్ ట్యాంపరింగ్ వివాదంలో జరిగిన తప్పును ఒప్పుకుంటూ స్టీవ్ స్మిత్ కంటతడి పెట్టాడు. ఈ తప్పిదానికి తనదే పూర్తి బాధ్యత అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఎగదన్నుకొని వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ.. మాట్లాడానికి ప్రయత్నించాడు. మీడియా సమావేశంలో ఉద్విగ్నుడై.. మాటలు వెతుక్కుంటూ వెక్కీ వెక్కీ ఏడ్చాడు. బాల్ ట్యాంపరింగ్ తప్పిదం తనను ఎంతో బాధకు గురిచేసిందని కన్నీరు కార్చాడు. సిడ్నీలో స్టీవ్ స్మిత్ నిర్వహించిన మీడియా సమావేశం ఆయన అభిమానుల్నే కాదు తోటి క్రికెటర్లను కదిలించింది. అతను వ్యక్తం చేసిన బాధను చూసి.. అయ్యో స్మిత్ అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో మంచి బ్యాట్స్‌మెన్‌లో స్టీవ్ స్మిత్ ఒకరని, అతను తప్పకుండా తిరిగొచ్చి.. మళ్లీ క్రికెట్ అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంటాడని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. స్టీవ్ స్మిత్ ప్రెస్‌మీట్ తర్వాత.. గుండె పగిలిపోయిందంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ట్వీట్ చేశాడు. స్టీవ్ స్మిత్, బెన్‌క్రాఫ్ట్ మీడియా సమావేశాలను చూడలేకపోయానని, వారు తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని భవిష్యత్‌లో మరింత ఉత్తమంగా తిరిగొస్తారని మరో ఆటగాడు మిట్చెల్ జాన్సన్ ట్వీట్ చేశాడు.
‘స్టీవ్ స్మిత్ బాధ నన్ను కదిలిస్తోంది. మళ్లీ క్రికెట్‌లోకి తిరిగొచ్చి తన సుప్రీం బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానల్ని అలరిస్తాడని ఎదురుచూస్తున్నా.. షేన్ వార్న్ కూడా ఇలాగే ఏడాది నిషేధం ఎదుర్కొని.. తిరిగొచ్చి శ్రీలంకపై మూడు టెస్టుల్లో 26 వికెట్లు తీశాడు’ అని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment