రొనాల్డో కూడా పన్ను ఎగ్గొట్టాడు
మాడ్రిడ్ (స్పెయిన్): పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్, రియల్ మాడ్రిడ్ క్లబ్ హీరో క్రిస్టియానో రోనాల్డో రూ. 106 కోట్ల 28 లక్షల మేర పన్ను ఎగవేతకు పాల్పడినట్లు మాడ్రిడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపించారు. 2011–2014 మధ్య కాలంలో వివిధ ఎండార్స్‌మెంట్ల ద్వారా వచ్చిన ఆదాయంపై పన్ను కట్టకుండా ప్రభుత్వ ఖజానాకు లోటు తెచ్చాడని మాడ్రిడ్ పీపీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న క్రీడాకారుడిగా రికార్డులకెక్కిన ఈ 32 ఏళ్ల సాకర్ స్టార్ నాలుగు ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు మాడ్రిడ్ పీపీ తెలిపింది. దీనిపై స్పెయిన్ కోర్టులో విచారణ జరుగుతోంది.
నేరం రుజువైతే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశముంది. అయితే స్పెయిన్ చట్టాల ప్రకారం క్రిమినల్ నేరం కాని తొలి శిక్షకు కారాగారం తప్పే వెసులుబాటు ఉంది. ఇటీవల అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీకి పన్ను ఎగవేత ఆరోపణలపై స్పెయిన్ కోర్టు 21 నెలల జైలుశిక్ష, రూ. 15 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. జరిమానా కట్టేందుకు మెస్సీ అంగీకరించారు.