Real Madrid
-
లైవ్ కామెంట్రీ ఇస్తూ కుప్పకూలాడు.. వీడియో వైరల్
సీనియర్ కామెంటేటర్, న్యూ-కాసిల్(New-Castle) మాజీ గోల్‌కీపర్ షకా హిస్లాప్ లైవ్ కామెంట్రీ ఇస్తూ ఒక్కసారిగా కుప్పకూలడం ఆందోళన కలిగించింది. విషయంలోకి వెళితే.. సోమవారం కాలిఫోర్నియాలో రియల్ మాండ్రిడ్, ఏసీ మిలన్ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు హోస్ట్ డాన్ థామస్‌తో కలిసి షకా హిస్లాప్ కామెంట్రీ చేశాడు. అప్పటిదాకా నవ్వుతూ కామెంట్రీ చేసిన హిస్లాప్ మొహం ఒక్కసారిగా మారిపోయింది. సహచర కామెంటేటర్ థామస్‌తో మాట్లాడుతూనే అతనిపై ఒరుగుతూ కింద పడిపోయాడు. షాక్ తిన్న థామస్ సహాయం కోసం అరుస్తూ సిబ్బందిని అలర్ట్ చేశాడు. వెంటనే సహాయక సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హిస్లాప్ పరిస్థితి ఫర్వాలేదని వైద్యులు తెలిపారు. అయితే ఇలా జరగడానికి కారణమేంటో తెలియడంలేదని, కొన్ని పరీక్షలు చేసిన తర్వాత వెల్లడిస్తామని వైద్యులు పేర్కొన్నారు. బహుశా కాలిఫోర్నియాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కళ్లు తిరిగి పడిపోయి ఉండొచ్చని సహచరులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన 54 ఏళ్ల షకా హిస్లాప్ ఫుట్‌బాల్ కెరీర్ ముగిసిన తర్వాత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ESPN FC Commentator Shaka Hislop collapsed on live TV before the Real Madrid vs. AC Milan friendly. He is now in stable condition. No further reports on medical condition or reason for collapse reported at this time. pic.twitter.com/2lxRfxfFWM — DiedSuddenly (@DiedSuddenly_) July 24, 2023 చదవండి: Kohli-Zaheer Khan: 'కోహ్లి వల్లే జహీర్ కెరీర్‌కు ముగింపు'.. మాజీ క్రికెటర్ క్లారిటీ Lionel Messi: 'మెస్సీని చూసేందుకు 808 మేకలు'.. అద్బుతాన్ని చూసి తీరాల్సిందే -
రక్తం కళ్ల చూసిన ఫుట్‌బాల్ మ్యాచ్.. వీడియో వైరల్
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో భాగంగా ఒక గోల్ ఆటగాడి రక్తం కళ్ల చూసింది. ఈ ఘటన వార్సాలో జరుగుతున్న చాంపియన్ లీగ్‌లో చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా గ్రూఫ్-ఎఫ్‌లో రియల్ మాడ్రిడ్, షాఖ్తర్ దొనేత్సక్ల మధ్య బుధవారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) మ్యాచ్ జరిగింది. నిర్ణీత సమయం ముగిసే సమయానికి షాఖ్తర్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మరో ఐదు నిమిషాలు అదనపు సమయం ఇవ్వడంతో రియల్ మాడ్రిడ్ గోల్ కొట్టడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆట 95వ నిమిషంలో రియల్ మాడ్రిడ్ ఢిఫెండర్ ఆంటోనియో రూడిగర్ హెడర్ గోల్ చేశాడు. ఇక్కడే ఊహించని పరిణామం జరిగింది. బంతిని తలతో బలంగా కొట్టే క్రమంలో రూడిగర్ పైకి ఎగరగా.. అదే సమయంలో షాఖ్తర్ గోల్ కీపర్ అనటోలీ ట్రూబిన్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో ట్రూబిన్ తలభాగం రూడిగర్ నుదుటన గట్టిగా గుద్దుకుంది. అయితే అప్పటికే బంతి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లిపోవడంతో రియాల్ మాడ్రిడ్- షాఖ్తర్ దొనేత్సక్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తాము క్వార్టర్ ఫైనల్ చేరామన్న సంతోషంతో రియల్ మాడ్రిడ్ సంబరంలో మునిగిపోగా.. జట్టు ఆటగాడు రూడిగర్ తల పగిలి రక్తం కారసాగింది. అటు పక్కన ట్రూబిన్ తలకి కూడా బలంగానే తగిలింది. దీంతో గ్రౌండ్‌లోనే ఇద్దరు కాసేపు పడుకున్నారు. ఆ తర్వాత రూడిగర్, ట్రూబిన్లను ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు. కాగా ట్రూబిన్ తల చుట్టూ బ్యాండేజీ వేయగా.. రూడిగర్ మొహానికి 20 కుట్లు పడే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Rudiger scores the equalizer 🤍 He got into an accident with Shakhtar goalkeeper, hopefully both are well.pic.twitter.com/SkFpH0X1Lb — Omar Aref 🇦🇪 (@LosB1ancos_) October 11, 2022 చదవండి: కుక్కతో రెజ్లింగ్ మ్యాచ్.. దూల తీరింది! 'బౌలింగ్‌లో దమ్ము లేకపోయేది.. హెల్మెట్ లేకుండానే ఆడేవారు' -
రొనాల్డో ఎఫెక్ట్.. ఫియట్ కంపెనీకి షాక్
రోమ్ : ప్రఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డోను తమ యజమాని(ఆగ్నెల్లీ కుటుంబం- యువెంటస్ ఫుట్‌బాల్ క్లబ్ వాటాదారు) కొనుగోలు చేయడం పట్ల ఫియట్ కార్ల సిబ్బంది యూనియన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇందుకు నిరసనగా సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. యూనియన్ లీడర్ లావోరో ప్రైవాటో మాట్లాడుతూ.. ‘ సంస్థను సమర్థవంతంగా నడిపించడానికి, అభివృద్ధి సాధించడానికి ఏళ్ల తరబడి ఎన్నో త్యాగాలు చేస్తున్నాం. అయితే ఒక ఆటగాడి కోసం వందల మిలియన్ యూరోలు ఖర్చు చేయడం చూస్తుంటే కార్మికుల త్యాగాలకు విలువ లేదని అర్థమైంది. అందుకే ఎఫ్సీఏ, సీఎన్హెచ్ఐ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారని’ తెలిపారు. రొనాల్డో కోసం వెచ్చించిన డబ్బును ఉద్యోగ కల్పన కోసం ఖర్చు చేసి ఉంటే ఎంతో బాగుండేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రచారం కోసమే... ప్రఖ్యాత కార్ల కంపెనీలు ఫెరారీ, ఫియట్, యువెంటస్ క్లబ్‌లకు మాతృసంస్థ అయిన ఎగ్జార్.. రొనాల్డోను కొనుగోలు చేయడం ద్వారా తమ మార్కెట్ వ్యాల్యూను పెంచుకోవాలని భావిస్తోంది. జీప్ లోగో కలిగి ఉన్న యువెంటస్ క్లబ్ జెర్సీని రొనాల్డో ధరించడం ద్వారా భారీ స్థాయిలో తమకు ప్రచారం లభిస్తుందనే ఉద్దేశంతోనే 10 కోట్ల 50 లక్షల యూరోలు(846 కోట్ల రూపాయలు) వెచ్చించినట్లు తెలిపింది. కాగా గత తొమ్మిదేళ్లుగా రియల్ మాడ్రిడ్ క్లబ్(స్పెయిన్) తరపున ఆడుతున్న రొనాల్డోను ఇటలీకి చెందిన విఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ యువెంటస్ దక్కించుకున్న విషయం తెలసిందే. ఈ రెండు క్లబ్‌ల మధ్య కుదిరిన కొత్త ఒప్పందం ప్రకారం.. యువెంటస్ క్లబ్ 10 కోట్ల 50 లక్షల యూరోలు (రూ. 846 కోట్లు) రియల్ మాడ్రిడ్‌కు చెల్లించనుంది. అలాగే నాలుగేళ్ల పాటు యువెంటస్ తరపున ఆడనున్నందుకు గానూ రొనాల్డోకు సీజన్‌కు 3 కోట్ల యూరోలు (రూ. 241 కోట్లు) చొప్పున వేతనంగా లభిస్తాయని సమాచారం. -
రొనాల్డో కూడా పన్ను ఎగ్గొట్టాడు
మాడ్రిడ్ (స్పెయిన్): పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్, రియల్ మాడ్రిడ్ క్లబ్ హీరో క్రిస్టియానో రోనాల్డో రూ. 106 కోట్ల 28 లక్షల మేర పన్ను ఎగవేతకు పాల్పడినట్లు మాడ్రిడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపించారు. 2011–2014 మధ్య కాలంలో వివిధ ఎండార్స్మెంట్ల ద్వారా వచ్చిన ఆదాయంపై పన్ను కట్టకుండా ప్రభుత్వ ఖజానాకు లోటు తెచ్చాడని మాడ్రిడ్ పీపీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న క్రీడాకారుడిగా రికార్డులకెక్కిన ఈ 32 ఏళ్ల సాకర్ స్టార్ నాలుగు ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు మాడ్రిడ్ పీపీ తెలిపింది. దీనిపై స్పెయిన్ కోర్టులో విచారణ జరుగుతోంది. నేరం రుజువైతే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశముంది. అయితే స్పెయిన్ చట్టాల ప్రకారం క్రిమినల్ నేరం కాని తొలి శిక్షకు కారాగారం తప్పే వెసులుబాటు ఉంది. ఇటీవల అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీకి పన్ను ఎగవేత ఆరోపణలపై స్పెయిన్ కోర్టు 21 నెలల జైలుశిక్ష, రూ. 15 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. జరిమానా కట్టేందుకు మెస్సీ అంగీకరించారు. -
అతడి సంపాదన.. వారానికి రూ. 3 కోట్లు!
స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో పేరు చెబితే చాలు.. సాకర్ అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతారు. అలాంటి రొనాల్డోకు ఇప్పుడు బంపర్ ఆఫర్ తగిలింది. రియల్ మాడ్రిడ్ క్లబ్‌తో అతడికి ఐదేళ్ల కాంట్రాక్టు కుదిరింది. మరో పదేళ్ల పాటు తాను ఆడుతూనే ఉంటానని ఒప్పందం సందర్భంగా అతడు చెప్పాడు. దీని ప్రకారం అతడికి అక్కడ వారానికి దాదాపు రూ. 3 కోట్లకు పైగా చెల్లిస్తారు. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించే ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రొనాల్డో నిలిచిపోతాడు. తన జీవితంలో మిగిలిన కాలమంతా తాను ఆటను ఎంజాయ్ చేస్తూనే ఉంటానని.. మరో పదేళ్ల పాటు ఆడతానని స్పష్టం చేశాడు. ఈ కాంట్రాక్టుతో.. సంపాదన విషయంలో బార్సిలోనా ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ కంటే అగ్రస్థానంలోకి రొనాల్డో దూసుకెళ్లాడు. 'వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' టైటిల్‌ను ఇప్పటికి మూడుసార్లు గెలుచుకున్న రొనాల్డో.. ఈ ఏడాది కూడా చాలా విజయాలు సాధించాడు. అతడి పెనాల్టీ షూటవుట్ షాట్‌తో మాడ్రిడ్ 11వ సారి చాంపియన్స్ లీగ్‌ను గెలుచుకుంది. అంతకుముందు యూరో 2016ను పోర్చుగల్ గెలుచుకోవడంలో కూడా రొనాల్డోదే కీలక పాత్ర. ఇటీవలి కాలంలో రియల్ మాడ్రిడ్ కాంట్రాక్టులను పునరుద్ధరించుకున్నవాళ్లలో రొనాల్డో లేటెస్ట్ స్టార్ అయ్యాడు. అతడి కంటే ముందు గరెత్ బేల్, లుకా మాడ్రిక్, టోనీ క్రూస్ కూడా మంచి ఆకర్షణీయమైన కాంట్రాక్టులే పొందినట్లు సమాచారం. రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ నుంచి మాడ్రిడ్‌కు మారిన తర్వాత 8 సీజన్లలో 360 గేమ్స్ ఆడి 371 గోల్స్ సాధించాడు. ఈ క్లబ్లో ఇంతవరకు ఎవరూ చేయనన్ని గోల్స్ చేయడంతో 2009లోనే రికార్డు స్థాయి ఫీజు పొందాడు. ఇక ముందు ఎవరు ఏం చెప్పాలన్నా.. రొనాల్డో కంటే ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుందని మాడ్రిడ్ ప్రెసిడెంట్ ఫ్లోరెంటినో పెరెజ్ వ్యాఖ్యానించారు. రొనాల్డోను ప్రశంసల్లో ముంచెత్తారు. -
16 విజయాల రికార్డు సమం!
బార్సిలోనా: తమ విజయపరంపరను కొనసాగిస్తున్న రియల్ మాడ్రిడ్ జట్టు లా లీగా ఫుట్ బాల్ లీగ్‌లో వరుస విజయాల రికార్డును సమం చేసింది. ఆదివారం జరిగిన పోరులో రియల్ మాడ్రిడ్ జట్టు 2-0 తేడాతో ఎస్పానెయోల్పై ఘన విజయం సాధించింది. తద్వారా లా లీగాలో 16 వరుస విజయాలు సాధించిన బార్సిలోనా రికార్డును రియల్ మాడ్రిడ్ సమం చేసింది. మ్యాచ్ తొలి హాఫ్‌లో జేమ్స్ రోడ్రిగ్వెజ్ గోల్ చేయడంతో రియల్ మాడ్రిడ్‌కు ఆధిక్యం లభించింది. అనంతరం ఆట 70వ నిమిషంలో కరీమ్ బెంజీమా మరో గోల్ చేయడంతో రియల్ మాడ్రిడ్‌కు స్పష్టమైన పైచేయి సాధించింది. కాగా, ఎస్పానెయోల్ జట్టు గోల్ చేయడానికి చివరకు ప్రయత్నించినా సఫలం కాలేదు. 2010-11 సీజన్లో బార్సిలోనా వరుసగా 16 లా లీగా లీగ్ విజయాలను సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదు సంవత్సరాల తరువాత ఆ రికార్డును రియల్ మాడ్రిడ్ సమం చేయడం విశేషం. -
మా అమ్మ నన్ను చంపాలనుకుంది
రొనాల్డో... ప్రపంచ ఫుట్ బాల్ ఫ్యాన్స్ అందరూ రొనాల్డో అంటే పడిచస్తారు. కానీ రొనాల్డో తల్లి మాత్రం ఆ బిడ్డ వద్దనుకుంది. వదిలించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. గర్భస్రావం చేయించుకునేందుకు ప్రయత్నించింది. చివరికి భారీ వ్యాయామాలు చేసి, వేడి ఆల్కహాల్ తాగి గర్భం పోగొట్టుకునేందుకు ప్రయత్నించింది. కానీ రియల్ మాడ్రిడ్ ఆటగాడైన రొనాల్డో మహా గట్టిపిండం. ఇంత చేసినా గర్భస్రావం జరగలేదు. వదిలించుకోవాలని విదిలించుకున్నా అతను తల్లి గర్భాన్ని వదల్లేదు గాక వదల్లేదు. అలా పోరాటం చేయడం, పోరాడి గెలవడం రొనాల్డోకి చిన్నప్పుడే అలవాటైపోయిందని తల్లి డోలోరెస్ అవియెరో అంటున్నారు రొనాల్డో తల్లి తన జీవిత గాథను మదర్ కరేజ్ అన్న పేరిట పుస్తక రూపంలో ప్రచురించారు. ఆ పుస్తకంలోనే ఈ సంఘటనను ఆమె రాసింది. పుట్టకముందే బిడ్డను తాను చంపాలనుకున్న విషయం తాను రోనాల్డోకి చెప్పానని, అప్పుడప్పుడూ అతను తనను ఈ విషయంలో ఆటపట్టిస్తూంటాడని కూడా తల్లి తన ఆత్మకథలో రాసింది. ఆ తల్లి ప్రయత్నాలు విఫలం కావడం వల్లే మనకి రొనాల్డో వంటి అద్భుతమైన ఫుట్ బాల్ ఆటగాడు దొరికాడు. -
రియల్ మాడ్రిడ్ ‘టాప్’
న్యూయార్క్: స్పెయిన్‌కు చెందిన రియల్ మాడ్రిడ్, బార్సిలోనా క్లబ్బులు ఆట పరంగానే కాకుండా ధనార్జనలోనూ టాప్‌గా నిలిచాయి. తాజాగా ఫోర్బ్స్ బిజినెస్ మ్యాగజైన్ వెల్లడించిన జాబితా ప్రకారం రియల్ మాడ్రిడ్ 3.44 బిలియన్ డాలర్ల (రూ.2 లక్షల 70 వేల కోట్లు) ఆర్జనతో నంబర్‌వన్ స్పోర్ట్స్ టీమ్‌గా నిలిచింది. బార్సిలోనా 3.2 బిలియన్ డాలర్ల (రూ. లక్షా 90 వేల కోట్లు)తో రెండో స్థానంలో ఉంది. -
బేల్ గోల్ చేసినా...
మాడ్రిడ్ (స్పెయిన్): ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన గారెత్ బేల్... రియల్ మాడ్రిడ్ తరఫున అరంగేట్రం చేశాడు. స్పెయిన్ లీగ్ ‘లా లీగా’లో భాగంగా శనివారం విల్లార్ రియల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అతను బరిలోకి దిగి ఓ గోల్ సాధించాడు. అయితే రియల్ మాడ్రిడ్ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో ‘డ్రా’ అయ్యింది. ఆట 50వ నిమిషంలో డాని కార్వాజల్ ఇచ్చిన క్రాస్‌ను అద్భుతంగా గోల్‌పోస్ట్‌లోకి పంపిన బేల్ ఆ తర్వాత మైదానంలో నుంచి బయటకు వచ్చాడు. అతని స్థానంలో అంజెల్ డి మారియో ఆడాడు. ఈ నెలారంభంలో విఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ రియల్ మాడ్రిడ్ రూ. 878 కోట్లు వెచ్చించి బేల్‌ను టోటెన్హామ్ హాట్స్పర్ క్లబ్ నుంచి కొనుగోలు చేసింది. -
2018 వరకు ‘రియల్’తోనే...
మాడ్రిడ్: ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్)... రియల్ మాడ్రిడ్‌తో తన ఒప్పందాన్ని పునరుద్ధరించుకున్నాడు. నిబంధనల ప్రకారం 2015తో అతని కాంట్రాక్ట్ ముగియాల్సి ఉంది. కొత్త ఒప్పందం ప్రకారం రొనాల్డో 2018 వరకు క్లబ్‌తో కొనసాగనున్నాడు. అయితే దీనికి సంబంధించిన విషయాలను మాత్రం రియల్ మాడ్రిడ్ బయటకు వెల్లడించడం లేదు. శనివారం జరిగిన క్లబ్ వేడుకలకు రియల్ అధ్యక్షుడు ఫ్లొరెంటినో పెరెజ్తోపాటు రొనాల్డో కూడా హాజరయ్యాడు. ఆ సమయంలోనే కాంట్రాక్ట్ పునరుద్ధరణ జరిగిందని స్థానిక పత్రిక పేర్కొంది. ఈ ఒప్పందం ప్రకారం ప్రతీ సీజన్‌కు రొనాల్డోకు కోటీ 70 లక్షల యూరోల (రూ. 143 కోట్లు) చొప్పున క్లబ్ చెల్లించనుంది. అంతకంటే ఎక్కువ ఆడాల్సి వస్తే మరో 10 లక్షల యూరోలను అదనంగా చెల్లించనుంది. దీంతో స్పానిష్ ఫుట్‌బాల్‌లో అత్యధిక డబ్బులు ఆర్జించే ఆటగాడిగా రొనాల్డో రికార్డులకు ఎక్కే అవకాశం ఉంది.