హ్యాట్సాఫ్... రొనాల్డో
నేపాల్ భూకంప బాధితులకు రూ.50 కోట్ల విరాళం
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. నేపాల్ భూకంప బాధితుల సహాయార్థం 50 లక్షల పౌండ్ల (రూ. 50 కోట్లు) విరాళాన్ని ప్రకటించాడు. నేపాల్‌లో సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ‘సేవ్ ద చిల్డ్రన్’ అనే చారిటీ సంస్థకు అతను ఈ విరాళాన్ని అందజేసినట్లు ఫ్రాన్స్ నుంచి వెలువడే క్రీడా మేగజైన్ ‘సో ఫుట్’ తెలిపింది.
నేపాల్ భూకంప బాధితులకు తమకు తోచినంత విరాళం అందించాలని తన అభిమానులకు 30 ఏళ్ల రొనాల్డో గత నెలలో ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చాడు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం ఈ రియల్ మాడ్రిడ్ క్లబ్ సూపర్‌స్టార్‌కు అలవాటే. గతేడాది ఓ 10 నెలల చిన్నారికి మెదడుకు శస్త్రచికిత్స చేయించేందుకు రొనాల్డో 60 వేల పౌండ్లు (రూ. 59 లక్షలు) అందజేశాడు.