సిడ్నీ: ప్రస్తుత భారత క్రికెట్ జట్టును ఒకనాటి ఆస్ట్రేలియా జట్టుతో పోల్చలేమని టీమిండియా పేసర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. ప్రధానంగా 1990-2000మధ్య కాలంలోని ఆసీస్ జట్టుతో ప్రస్తుత టీమిండియాకు పోలిక లేదని నెహ్రా తేల్చిచెప్పాడు. అప్పటి ఆసీస్ జట్టును చేరుకోవడానికి భారత్ ఇంకా చాలా దూరంలో ఉందన్నాడు. స్టీవ్ వా, రికీ పాంటింగ్‌లు సారథ్యం వహించిన ఆసీస్ జట్టుకు ఇప్పటి కోహ్లి నేతృత్వంలోని భారత జట్టుకు చాలా తేడా ఉందని పేర్కొన్నాడు. టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాతో ‘ఆకాశ్ వాణి’ కార్యక్రమంలో నెహ్రా మాట్లాడుతూ పలు విషయాల్ని షేర్ చేసుకున్నాడు. ‘స్టీవ్ వా, రికీ పాంటింగ్‌లు కెప్టెన్‌లుగా చేసిన ఆసీస్ జట్టును చేరుకోవాలంటే ప్రస్తుత టీమిండియా చాలా దూరంలో ఉందనేది నా అభిప్రాయం. వారి సారథ్యంలో ఆసీస్ జట్టు చాలా పటిష్టంగా ఉండేది. 1996 వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా సరిపెట్టుకున్న ఆస్ట్రేలియా.. ఆపై హ్యాట్రిక్ వరల్డ్‌కప్‌లు సాధించింది. ఆ కాలంలోనే 18-19 వరకూ స్వదేశీ-విదేశీ టెస్టు గెలుపులను అందుకుంది. (36 ఏళ్లు... 11 సిరీస్‌లు...)
అంటే భారత జట్టు ఆ మార్కును చేరుకోలేదని నేను చెప్పడం లేదు. అప్పటి ఆసీస్ జట్టుకు ప్రస్తుత భారత జట్టుకు చాలా తేడా ఉందనే విషయాన్ని మాత్రమే చెబుతున్నాను. ఇక్కడ కోర్ గ్రూప్ ముఖ్యం అనే విషయాన్ని నేను విశ్వసిస్తున్నాను. ఒక టేబుల్‌పై అనేక రకాల వంటకాలు ఉన్నప్పుడు ఏమీ తినాలనే విషయంలో గందరగోళం ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కువ వంటకాలు కంటే కూడా పరిమితంగా ఉండే నాణ్యత గల ఆహారమే ముఖ్యం’ అని ఆటగాళ్ల ఎంపికలో జాగ్రత్తలు అవసరమని పరోక్షంగా హెచ్చరించాడు. కాగా, కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో ఆడుతున్నాడని, ఎంఎస్ ధోని భర్తీ చేయాల్సిన రిషభ్ పంత్‌ను డ్రింక్స్ అందించడానికి మాత్రమే పరిమితం చేస్తున్నారని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ఇటీవల కాలంలో పంత్ చాలా చాన్సులు మిస్సయ్యాడనే వాస్తవమని,కానీ అతను ఎంత టాలెంట్ ఉన్న క్రికెటర్ అనే విషయాన్ని ఇప్పటికే చూశామన్నాడు. పంత్‌కు సాధ్యమైనన్ని ఎక్కువ అవకాశాలు ఇస్తే ధోని స్థానాన్ని భర్తీ చేయగలడని నెహ్రా ఆశాభావం వ్యక్తం చేశాడు. అతన్ని కేవలం రిజర్వ్ బెంచ్‌లో కూర్చొబెట్టవద్దని నెహ్రా పేర్కొన్నాడు. తన కెరీర్‌లో 120 వన్డేలు, 17 టెస్టులు, 27 అంతర్జాతీయ టీ20లు ఆడిన నెహ్రా.. కోహ్లి కెప్టెన్సీ ఇంకా పురోగతిలోనే ఉందన్నాడు. ఒక బ్యాట్స్‌మన్‌గా కోహ్లి ఇప్పటికే ఎన్ని ఘనతలు సాధించాడో ప్రత్యేకం చెప్పనక్కర్లేదని, కానీ కెప్టెన్సీ విషయంలో చాలా పరిణితి సాధించాల్సి ఉందన్నాడు. (ఇమ్రాన్‌ను మించి పాపులర్ అయ్యాడు: నెహ్రా)
Comments
Please login to add a commentAdd a comment