ఆ దిగ్గజ ఆటగాడ్నిగుర్తుకుతెచ్చాడు..
ధర్మశాల: ఇటీవల భారత్ తో ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్లో విశేషంగా రాణించిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ పై ఆ దేశ కోచ్ డారెన్ లీమన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా మెరవడానికి కెప్టెన్ స్మిత్ బ్యాటింగే కారణమంటూ కొనియాడాడు. ఒక సిరీస్లో మూడు సెంచరీలు చేసి అద్వితీయ ప్రదర్శన ఆకట్టుకున్నాడన్నాడు.
దాంతో పాటు భారత్ పర్యటనలో స్మిత్ జట్టును నడిపించిన తీరు నిజంగా అద్భుతమన్నాడు.ఇక్కడకు పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి భారత్ను ముప్పుతిప్పలు పెట్టడంలో స్మిత్ పాత్ర కీలకమన్నాడు. అతను కేవలం బ్యాట్తోనే కాదు..కెప్టెన్ గా కూడా తన వంతు బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించడని లీమన్ పేర్కొన్నాడు. తమ దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్ మన్ ను స్మిత్ మరోసారి జ్ఞప్తికి తెచ్చాడంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. ఈ సిరీస్ తరువాత స్మిత్ కచ్చితంగా ఆధునిక గ్రేటెస్టు టెస్టు కెప్టెన్లలో ఒకడిగా నిలిచిపోతాడనంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఈ సిరీస్లో తమ జట్టు ప్రదర్శన భారత్ జట్టును నిరాశకు గురి చేయడమే కాకుండా తీవ్రంగా బాధించి కూడా ఉంటుందని లీమన్ అభిప్రాయపడ్డాడు.