అదొక ఛాలెంజ్: ఆసీస్ కోచ్
రాంచీ: భారత్ తో మూడో టెస్టు చివరిరోజు ఆటలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్ ను ఎదుర్కొని నిలబడటం తమకు అసలు సిసలైన ఛాలెంజ్ అని ఆసీస్ ప్రధాన కోచ్ డారెన్ లీమన్ స్పష్టం చేశాడు. నాల్గో రోజు ఆటలో స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను తీసిన జడేజాపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నాడు. తమ ఆటగాళ్లు ఇద్దరూ మంచి బంతులకే పెవిలియన్ చేరారని పేర్కొన్న లీమన్.. ఈ తరహా ఘటనలు క్రికెట్ గేమ్లో సహజమన్నాడు. ఆఖరి రోజు ఆటలో తాము కచ్చితంగా భారత్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
'మూడో టెస్టు ఆఖరి రోజు ఆట మాకు ఛాలెంజ్. ప్రధానంగా జడేజాను సమర్దవంతంగా ఎదుర్కోవాలి. అతను సంధించిన రెండు అద్భుతమైన బంతులకు రెండు వికెట్లను కోల్పోయాం. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ ను జడేజా అవుట్ చేసిన తీరు అమోఘం. జడేజాపై మా ఫోకస్ పెట్టాం. మా వికెట్లను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, మా పది వికెట్లను తీసి గెలుపొందడం భారత్ కు కఠినమైన సవాల్'అని లీమన్ తెలిపాడు.