నాగ్‌పూర్: శ్రీలంక పేస్ బౌలర్ దసన్ షనక బాల్ ట్యాంపరింగ్ ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. రెండో టెస్ట్ రెండో రోజు టీమిండియా బ్యాట్స్‌మెన్ ఎంతకి అవుట్ కాకపోవడంతో చికాకు చెందిన షనక బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించాడు. షనక వేసిన 50వ ఓవర్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు ప్రయత్నించడం కెమెరాల్లో రికార్డైంది. ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ గుర్తించి ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో దీన్ని లెవల్ 2 ఉల్లంఘనగా పరిగణించి షనక మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించారు.
బంతి కండీషన్‌ను మార్చేందుకు షనక ప్రయత్నించాడు. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కోసం ఉద్దేశించిన ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో ఆర్టికల్ 2.2.9ను ఇది ఉల్లఘించడమేనని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ ఘటన కారణంగా షనక ఖాతాలో మూడు డీ మెరిట్ పాయింట్లను చేర్చారు. రెండేళ్ల వ్యవధిలో నాలుగు లేదా అంత కంటే ఎక్కువ డీ మెరిట్ పాయింట్లు పొందితే.. సదరు ఆటగాడు నిషేధానికి గురవుతాడు.
షనక కెరీర్ ఆరంభంలో ఉన్నాడు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు చేయకుండా జాగ్రత్త వహించాలని మ్యాచ్ రిఫరీ హెచ్చరించారు. రెండోస్థాయి ఉల్లంఘన కింద మ్యాచ్ ఫీజులో 50-100 శాతం వరకూ కోత విధించే అవకాశం ఉంది. దీంతో పాటు రెండు సస్పెన్షన్ పాయింట్లు కూడా విధించొచ్చు. దీని వల్ల ఒక టెస్ట్ మ్యాచ్ లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20ల్లో ఏదీ ముందు ఆడితే దానికి సదరు క్రికెటర్ దూరం అవుతాడు.
Comments
Please login to add a commentAdd a comment