కేరళ కోచ్గా ఆసీస్ మాజీ క్రికెటర్?
చెన్నై:డేవ్ వాట్మోర్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 1996లో శ్రీలంక క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ సాధించడంలో కోచ్ గా అతనిదే కీలక పాత్ర. ఆ సమయంలో కొత్తగా వచ్చిన ఫీల్డింగ్ నిబంధనలకు సంబంధించి బాగా అధ్యయనం చేసి లంకేయులు వరల్డ్ కప్ సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు. ఆ తరువాత వాట్మోర్ ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ఆ క్రమంలోనే బంగ్లాదేశ్, పాకిస్తాన్, జింబాబ్వే జట్లకు ప్రధాన కోచ్ గా వాట్మోర్ పనిచేశాడు.
అయితే ఆసీస్ కు చెందిన ఈ మాజీ క్రికెటర్ ఇప్పుడు కేరళ రంజీ జట్టుకు కోచ్ గా వ్యవహరించే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఈ జనవరి నెలలో చెన్నైలో కేరళ రంజీ ఆటగాళ్లతో సమావేశమైన వాట్మోర్ వారితో సుదీర్ఘంగా పలు విషయాల్ని చర్చించాడు. దాంతో కేరళ క్రికెట్ అసోసియేషన్ అతన్ని కోచ్ గా ఎంపిక చేసేందుకు ఆసక్తిని కనబరించింది. దీనిలో భాగంగా ఇప్పటికే అతనితో క్రికెట్ అసోసియేషన్ పెద్దలు పలుమార్లు చర్చలు జరిపారు. ఈ నెల 22 వ తేదీన చెన్నైకు రాబోతున్న వాట్మోర్తో మరోసారి కేరళ క్రికెట్ అసోసియేషన్ చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది. ఒకవేళ ఆ చర్చలు సఫలమైతే అతను కేరళ రంజీ జట్టుకు కోచ్ గా ఎంపికవుతాడు.