
కుటుంబ సభ్యులతో డేవిడ్ వార్నర్
సిడ్నీ: బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంపై డేవిడ్ వార్నర్ మరోసారి స్పందించాడు. ఆ ఘటన తనకు జీవితంలో మరిచిపోలేని గుణపాఠం నేర్పిందని చెబుతున్నాడు. కష్టకాలంలో తనకు మద్ధతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో వార్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘క్రికెట్ ఆడుతున్నంత కాలం జీవితం ఓ వలయంలా అనిపించేంది. క్రికెట్.. ప్రాక్టీస్, హోటల్స్, ప్యాకింగ్స్, ప్రయాణాలు ఇవే ఉండేవి. కుటుంబ సభ్యులతో గడిపేందుకు క్షణం తీరిక దొరికేది కాదు. కానీ, ఇప్పుడు పూర్తిగా పిల్లలతోనే గడుపుతున్నా. నా క్రికెట్ ప్రయాణంలో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నా. కానీ, వారి నమ్మకానికి నేను తూట్లు పొడిచా.అయినా వారు కష్టకాలంలో నాకు అండగా నిల్చున్నందుకు కృతజ్ఞుడిని. ఈ అనుభవాల నుంచి విలువైన పాఠాలు నేర్చుకున్నానని భావిస్తున్నా. ఇకపై ఇతరులకు సాయం చేయటానికి నా వంతు కృషి చేస్తా’ అని వార్నర్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.