చలో కామన్‌వెల్త్‌ | Day-by-day guide to Gold Coast 2018 | Sakshi
Sakshi News home page

చలో కామన్‌వెల్త్‌

Published Sat, Mar 31 2018 1:13 AM | Last Updated on Sat, Mar 31 2018 1:14 AM

Day-by-day guide to Gold Coast 2018 - Sakshi

కామన్వెల్త్‌ గేమ్స్‌... క్రీడాంశాలు... ప్రాతినిధ్యం వహించే దేశాలు... పాల్గొనే ఆటగాళ్ల సంఖ్యపరంగా... ఒలింపిక్స్‌ తర్వాత అతి పెద్ద సంరంభం. కాలంతో పాటు నాలుగుసార్లు పేర్లు మారినా... రెండో ప్రపంచ యుద్ధ అవాంతరంతో రెండుసార్లు నిర్వహణకు నోచుకోకున్నా... ఎనిమిదిన్నర దశాబ్దాలపైగా క్రీడలు కొనసాగుతున్నాయి. తాజా పోటీలకు ఏప్రిల్‌ 4 నుంచి ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో కామన్వెల్త్‌ చరిత్రపై అవలోకనం...  

ఇదీ నేపథ్యం...
బ్రిటీష్‌ ఏలుబడిలోని దేశాల మధ్య సౌహార్థ్రత పెంపొందించేలా ఓ క్రీడా వేడుక ఉండాలన్న ఆలోచనను 1891లో జాన్‌ ఆస్టీ›్లకూపర్‌ ప్రతిపాదించాడు. ‘పాన్‌–బ్రిటానిక్‌–పాన్‌–ఆంగ్లికన్‌’ పేరిట వీటిని నాలుగేళ్లకోసారి నిర్వహించాలని సూచించాడు. అప్పటికింకా తొలి ఒలింపిక్స్‌ (1896) కూడా జరగలేదు. వాస్తవానికి కూపర్‌ తదితరుల సాయంతోనే పియరి డి క్యుబర్టిన్‌ ఒలింపిక్స్‌కు ఓ రూపునిచ్చాడు. కానీ, కామన్వెల్త్‌ క్రీడలు పట్టాలెక్కడానికి 1930 వరకు సమయం పట్టింది.

తొలిగా ఇలా...
1930లో కెనడాలోని హామిల్టన్‌ నగరంలో ఆరు అంశాల్లో తొలి కామన్వెల్త్‌ క్రీడలు జరిగాయి. 11 దేశాలు 400 మంది అథ్లెట్లను పంపాయి. కెనడాకు చెందిన ట్రిపుల్‌ జంపర్‌ గొర్డాన్‌ స్మాల్‌కాంబ్‌ మొట్ట మొదటి స్వర్ణం గెలిచిన క్రీడాకారుడు.  

2010లో ఢిల్లీలో
భారత్‌ 2010లో కామన్వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో పోటీలు జరిగాయి. 11 బిలియన్ల అమెరికన్‌ డాలర్ల వ్యయమైంది. పతకాల పట్టికలో ఆస్ట్రేలియా తొలి, భారత్‌  రెండో స్థానంలో నిలిచాయి. మన దేశానికిదే అత్యుత్తమ ప్రదర్శన.

క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కె ట్‌బాల్, బాక్సింగ్, సైక్లింగ్, డైవింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, లాన్‌ బౌల్స్, నెట్‌బాల్, రోయింగ్, రగ్బీ, స్క్వా ష్, స్విమ్మింగ్, షూటింగ్, సింక్రనైజ్డ్‌ స్విమ్మింగ్, టేబుల్‌ టెన్నిస్, టెన్నిస్, ట్రయథ్లాన్, వెయిట్‌ లిఫ్టింగ్, రెజ్లింగ్‌

► ఈవెంట్, నిర్వహణ నగరాల ఎంపిక బాధ్యతను కామన్వెల్త్‌ క్రీడా సమాఖ్య (సీజీఎఫ్‌) చూస్తుంది.

► కామన్వెల్త్‌ దేశాల సంఖ్య 53 అయినా... ప్రాతినిథ్యం వహించేవి మాత్రం 71 దేశాలు. గ్రేట్‌ బ్రిటన్‌లో భాగమైనప్పటికీ స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌ వంటి అర్ధ స్వయంప్రతిపత్తి ప్రాంతాలు సొంత జెండాలతో పాల్గొనడమే దీనికి కారణం.

► ఇప్పటివరకు 9 దేశాలు ఈ క్రీడలకు ఆతిథ్యమిచ్చాయి. అత్యధికంగా ఆస్ట్రేలియాలో అయి దోసారి జరుగుతున్నాయి. కెనడా నాలుగుసార్లు తమ దేశంలో నిర్వహించింది.

► ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, వేల్స్‌ దేశాలు మాత్రమే అన్నిసార్లు పోటీల్లో పాల్గొన్నాయి. పతకాల పట్టికలో ఆస్ట్రేలియా (12 సార్లు), ఇంగ్లండ్‌ (7), కెనడా ఒకసారి అగ్రస్థానంలో నిలిచాయి.


ప్రారంభ సంవత్సరం : 1930
1950 వరకు         : బ్రిటీష్‌ ఎంపైర్‌ గేమ్స్‌(రెండో ప్రపంచ యుద్ధంతో 1942, 1946లలో నిర్వహించలేదు)
1954–66            : బ్రిటీష్‌ ఎంపైర్‌ అండ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌
1970–74            : బ్రిటీష్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌
1978 నుంచి         : కామన్వెల్త్‌ గేమ్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement