టీమిండియా మరోసారి కాలర్‌ ఎగరేసిన రోజు! | This Day T20 World Cup 2007 Champion Team India BCCI Recalls | Sakshi
Sakshi News home page

ఆ మధుర క్షణాలకు పన్నెండేళ్ళు

Published Tue, Sep 24 2019 1:26 PM | Last Updated on Tue, Sep 24 2019 1:41 PM

This Day T20 World Cup 2007 Champion Team India BCCI Recalls - Sakshi

క్రికెట్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ.. క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కించాలనే ఉద్దేశంతో ఐసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది టీ20 ప్రపంచకప్‌. దక్షిణాఫ్రికా వేదికగా 2007లో ప్రారంభమైన ఈ పొట్టి ఫార్మట్‌ ప్రపంచకప్‌పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ముఖ్యంగా టీమిండియాపై. ఎందుకంటే అప్పటికీ టీమిండియాకు టీ20 వంటబట్టలేదు. ఈ మెగా టోర్నీలో అడుగుపెట్టే సరికి కేవలం ఒకే ఒక్క టీ20 ఆడిన అనుభవం. పూర్తిగా యువకులతో కూడిన జట్టు.. అందులోనూ సారథిగా ఎంఎస్‌ ధోనికి తొలి సవాల్‌. ఈ మెగా టోర్నీకి కొద్ది నెలల ముందు వెస్టిండీస్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ చేదు అనుభవాలు అందరిలోనూ కదలాడుతూనే ఉన్నాయి. దీంతో టీమిండియా మహా అంటే ఒకటో రెండో గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ అడ్డంకులన్నింటినీ జయించి.. టీ20 ప్రపంచకప్‌ గెలిచి.. ప్రతీ ఒక్క టీమిండియా అభిమాని మరోసారి(1983 ప్రపంచకప్‌ విజయం తర్వాత) కాలర్‌ ఎగరేసేలా చేసింది అప్పటి ధోని గ్యాంగ్‌. 

సరిగ్గా నేటికి పుష్కర కాలం అయింది.. ఐసీసీ తొలి టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచి. ఆ మధుర క్షణాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. పాకిస్తాన్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో కొత్త విధానం బౌలౌట్‌తో గెలవడం.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో గిల్‌క్రిస్ట్‌-శ్రీశాంత్‌ల మధ్య జరిగిన సమరం.. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్‌ సింగ్‌ ఆరు సిక్సర్లు కొట్టడం.. ఫైనల్‌ మ్యాచ్‌లో జోగిందర్‌ శర్మ బౌలింగ్‌లో మిస్బావుల్‌ హక్‌ క్యాచ్‌ను శ్రీశాంత్‌ అందుకోవడం.. టీమిండియా కప్‌ గెలవడం.. ఫైనల్‌ మ్యాచ్‌ అయిపోయాక ధోని తన టీషర్ట్‌ను బుల్లి అభిమానికి గిఫ్ట్‌గా ఇవ్వడం.. ఈ సంఘటనలన్నీ మరోసారి అందరికీ గుర్తొస్తున్నాయి. టీమిండియా టీ20 ప్రపంచకప్‌ గెలిచి నేటికి పన్నెండేళ్లు పూర్తైన సందర్భంగా బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌లో ఆనాటి మధుర స్మృతులను గుర్తుచేస్తూ ఓ వీడియో పోస్ట్‌ పెట్టింది. ప్రస్తుతం ఆ వీడియోను నెటిజన్లు తెగ లైక్‌ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ ప్రపంచకప్‌కు సంబంధించిన సంఘటనలను, ఫోటోలను నెటిజన్లు పోస్ట్‌ చేసి తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.   

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ప్రయాణం సాగిందిలా..
స్కాట్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. అనంతరం పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠపోరు మ్యాచ్‌ టైగా ముగిసింది. దీంతో ఈ టోర్నీలో ఐసీసీ కొత్తగా ప్రవేశ పెట్టిన బౌలౌట్‌ విధానంతో టీమిండియా గెలిచి పాక్‌కు షాక్‌ ఇచ్చింది. పాక్‌పై గెలుపుతో జోరుమీదున్న ధోని సేనను న్యూజిలాండ్‌ కంగుతినిపించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పది పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కివీస్‌ ఇచ్చిన షాక్‌ నుంచి కోలుకున్న భారత్‌ ఇంగ్లండ్‌తో జరిగిన తరువాతి మ్యాచ్‌లో అదరగొట్టింది. యువీ సిక్సర్ల వర్షంతో 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆదే జోరులో ఆతిథ్య దక్షిణాఫ్రికాను 37 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి సెమీఫైనల్‌కు ప్రవేశించింది. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియపై సమిష్టిగా ఆడటంతో 15 పరుగుల తేడాతో విజయం అందుకొని ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ పోరులో టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాక్‌పై ఉత్కంఠ పోరులో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి సగర్వంగా తొలి టీ20 ప్రపంచకప్‌ను అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.

   

చదవండి: 
యువీ.. నీ మెరుపులు పదిలం
ఈరోజు ధోనికి వెరీ వెరీ స్పెషల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement