టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని భారత జాతీయ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా నియమించాలని కొందరు భారత క్రికెట్ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా బీసీసీఐని డిమాండ్ చేస్తున్నారు. ధోని స్థాయికి చీఫ్ సెలెక్టర్ పదవి చిన్నదే అయినప్పటికీ ఆటగాళ్ల ఎంపికల విషయంలో పారదర్శకత ఉంటుందని వారంటున్నారు. ధోని చీఫ్ సెలెక్టర్ అయితేనే ఎలాంటి పక్షపాతాలు లేకుండా ప్రతిభే కొలమానంగా ఎంపికలు జరుగుతాయని గట్టిగా నమ్ముతున్నారు.
ఐపీఎల్ కారణంగా ధోనికి యువ ఆటగాళ్లపై పూర్తిగా అవగాహణ ఉంది కాబట్టి, టాలెంట్ ఉన్న యువకులకు సరైన నాయ్యం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే ధోని ఫ్రాంచైజీ క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పి కొద్దికాలం పాటు సెలెక్టర్‌గా, కోచ్‌గా, నేషనల్ క్రికట్ అకాడమీ ఛైర్మన్‌గా వ్యవహరించాలని కోరుతున్నారు. భారత్‌లో మరో తరం క్రికెట్ మెరుగుపడాలంటే ధోని ఈ త్యాగం చేయాలని ప్రాధేయపడుతున్నారు.
ఇలా జరగడానికి అవకాశం లేకపోతే బీసీసీఐ తగు సవరణలు చేసైనా ధోనికి ఈ మూడు పదవులు కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. టీమిండియాలో చాలామంది స్టార్ క్రికెటర్లకు వయసు పైబడుతుండటంతో, తదుపరి జనరేషన్‌ను ఇప్పటి నుంచే తీర్చిదిద్దుకోవడం కోసం ధోనికి ఈ మూడు కీలక పదవులు కట్టబెట్టాలని కోరుతున్నారు.
ధోని కొంతకాలం పాటు ఈ మూడు పదవులు చేపడితే భారత క్రికెట్‌లో నెక్స్ట్ జనరేషన్ బాగుపడుతుందని అంటున్నారు. ధోనికి ఉన్న అపారమైన క్రికెట్ పరిజ్ఞానం, ఆట పట్ల అతనికున్న అంకితభావం, టాలెంట్ ఉన్న ఆటగాళ్లకు వీలైనన్ని అవకాశాలు ఇచ్చి వారి నుంచి సక్సెస్‌ను రాబట్టిన ట్రాక్ రికార్డును పరిగణలోకి తీసుకుని భారత క్రికెట్ భవిష్యత్తును ధోని చేతుల్లో పెట్టాలని కోరుతున్నారు.
కాగా, భారత జాతీయ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా చేతన్ శర్మ తొలగించబడటంతో ఆ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ధోనిని చీఫ్ సెలెక్టర్‌గా నియమించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. త్వరలో ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలు ఉండటంతో ధోని లాంటి వ్యక్తి అయితే సమతూకం కలిగిన జట్టును ఎంపిక చేయగలడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ధోని విషయంలో వారికి ఇలాంటి ఆచరణ సాధ్యం కాని అంచనాలు ఉన్నప్పటికీ.. ఇది జరగడం దాదాపుగా అసాధ్యమేనని చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment