స్వీట్‌ మెమోరీస్‌.. అద్భుతాలను నెమరువేసుకున్న ధోని | IPL 2024 MI VS CSK: Dhoni Visits BCCI Headquarters To See The World Cup Trophy | Sakshi
Sakshi News home page

స్వీట్‌ మెమోరీస్‌.. అద్భుతాలను నెమరువేసుకున్న ధోని

Published Mon, Apr 15 2024 11:30 AM | Last Updated on Mon, Apr 15 2024 1:28 PM

IPL 2024 MI VS CSK: Dhoni Visits BCCI Headquarters To See The World Cup Trophy - Sakshi

భారత క్రికెట్‌కు సంబంధించి మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని పరిచయం అక్కర్లేని పేరు. ఈ మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌ తన కెరీర్‌లో సాధించిన ఘనతల ద్వారా భారత్‌లోనే కాకుండా విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాధించుకున్నాడు. ధోని ఎక్కడికి వెళ్లినా అభిమానులు నీరాజనాలు పలుకుతారు. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి దాదాపు ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ క్రేజ్‌ తగ్గడం​ లేదు.

ఆటగాడిగానే కాకుండా వ్యక్తిగతంగానూ ధోనిని అభిమానించే వారు చాలామంది ఉన్నారు. ధోనిని స్టయిల్‌ ఐకాన్‌గా ఆరాధించే వారు కోకొల్లలు. ధోని తాజా లుక్‌కు సెపరేట్‌ ఫ్యాన్‌ బేసే ఉంది. కెరీర్‌ ఆరంభంలో ధోని ఆహార్యం ఎలా ఉండిందో ప్రస్తుతం అలాగే ఉంది. జులపాల జట్టుతో ధోని సినిమా హీరోలను తలదన్నేలా ఉన్నాడు. 42 ఏళ్ల వయసులోనూ 24 ఏళ్ల యువకుడిలా కనిపిస్తున్నాడు. ధోనికి వయసు మీద పడుతున్నా వన్నె తగ్గడం లేదని అభిమానులు అనుకుంటారు. 

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్న తర్వాత ఐపీఎల్‌కు, సినిమాలకు మాత్రమే పరిమితమైన ధోని.. నిన్న (ఏప్రిల్‌ 14) ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ ఆడేందుకు ముంబైకి వచ్చాడు. ఈ సందర్భంగా బీసీసీఐ హెడ్‌ క్వార్టర్స్‌కు సందర్శించిన ధోని.. భారత క్రికెట్‌ తరఫున తాను సాధించిన అద్భుతాలను నెమరువేసుకున్నాడు. బీసీసీఐ ఆఫీస్‌లో తాను సాధించిన ఘనతలను తలచుకుంటూ మురిసిపోయాడు.

తన సారధ్యంలో టీమిండియా సాధించిన టీ20 వరల్డ్‌కప్‌ (2007), వన్డే వరల్డ్‌కప్‌ (2011) ట్రోఫీలను స్పర్శించి పరవశించిపోయాడు. టీమిండియా జెర్సీని చూసుకుని మురిసిపోయాడు. వన్డే వరల్డ్‌కప్‌లో తానాడిన విన్నింగ్‌ షాట్‌ ఫోటోగ్రాఫ్‌పై ఆటోగ్రాఫ్‌ చేసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ధోని బీసీసీఐ ఆఫీస్‌లో గడిపిన క్షణాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. 

నిన్నటి మ్యాచ్‌లో ధోని మెరుపు ఇన్నింగ్స్‌ అనంతరం ఈ వీడియో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ముంబైతో మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ధోని ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హార్దిక్‌ వేసిన ఆ ఓవర్‌లో అతను హ్యాట్రిక్‌ సిక్సర్లు సహా 20 పరుగులు చేసి పాత ధోనిని గుర్తు చేశాడు. ఈ మ్యాచ్‌లో ధోని ఆడిన మెరుపు ఇన్నింగ్సే ముంబై, సీఎస్‌కే స్కోర్ల మధ్య వ్యత్యాసంగా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో ముంబై ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సెంచరీతో కదంతొక్కినప్పటికీ సీఎస్‌కే 20 పరుగుల తేడాతో గెలుపొందింది. కెరీర్‌ చరమాంకంలో (ఐపీఎల్‌) ఉన్న ధోని పాత రోజులను గుర్తు చేయడంతో అతని అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు. ధోని ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. ఈ సీజన్‌లోనూ సీఎస్‌కేదే టైటిల్‌ అని చెప్పుకుంటున్నారు. ధోని ఇటీవలే సీఎస్‌కే సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ధోని స్వచ్ఛందంగా సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి వైదొలిగి రుతురాజ్‌కు బాధ్యతలు అప్పజెప్పాడు. ఈ సీజన్‌లో సీఎస్‌కే 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement