MS Dhoni International Debut Completes 17 Years, Deets Inside - Sakshi
Sakshi News home page

MS Dhoni International Debut: ఎంఎస్‌ ధోని@17.. ఎన్నిసార్లు చదివినా బోర్‌ కొట్టదు

Published Thu, Dec 23 2021 2:58 PM | Last Updated on Thu, Dec 23 2021 6:27 PM

MS Dhoni Intermnational Debut Completes 17 Years On December 23rd  - Sakshi

17 years of Dhonism: ఎంఎస్‌ ధోని.. ఒక చరిత్ర.. టీమిండియాకు దొరికిన ఒక వరం.. రెండు ప్రపంచకప్‌లు అందించిన గొప్ప కెప్టెన్‌.. మంచి వికెట్‌ కీపర్‌.. సూపర్‌ ఫినిషర్‌.. గొప్ప మార్గనిర్దేశకుడు.. ఇలా చెప్పుకుంటే పోతే ఇంకా వస్తూనే ఉంటాయి.  టీమిండియా కెప్టెన్‌గా దశాబ్దం పాటు క్రికెట్‌ను ఒక ఊపు ఊపిన ఎంఎస్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి డిసెంబర్‌ 23నాటికి(ఇవాళ్టికి) 17 ఏళ్లు పూర్తయింది. ధోని అరంగేట్రం ఎలా జరిగిందన్నది అందరికి తెలిసిన విషయమే.  అయినా సరే ధోని గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్న బోర్‌ కొట్టదు. అందుకే మరోసారి ప్రస్తావించుకోవాల్సిన సమయం ఇది.

-సాక్షి, వెబ్‌డెస్క్‌

అది 2004వ సంవత్సరం.. టీమిండియా కెప్టెన్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ వ్యవహరిస్తున్నాడు. దీనికి తోడూ అప్పటికే గంగూలీ తెచ్చిన పిచ్చి ప్రయోగంలో భాగంగా ద్రవిడ్‌ కీపర్‌గానూ వ్యవహరించేవాడు. అటు కెప్టెన్‌గా.. ఇటు వికెట్‌ కీపర్‌గా ఒత్తిడి మీద పడుతుండడంతో ద్రవిడ్‌ బ్యాటింగ్‌లో లోపాలు కనిపించాయి. ద్రవిడ్‌ ఇలా అన్ని బ్యాలెన్స్‌ చేయలేనని.. ఒక మంచి వికెట్‌ కీపర్‌ అవసరం ఉందంటూ బీసీసీఐకి తెలిపాడు. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు బీసీసీఐ ఒక నిఖార్సైన వికెట్‌కీపర్‌/బ్యాట్స్‌మన్‌ కోసం ఎదురుచూస్తుంది. అప్పటికే దినేశ్‌ కార్తీక్‌, పార్థివ్‌ పటేల్‌ లాంటి వికెట్‌ కీపర్లు ఉన్నారు. ఇక అంతకుముందు రెండు నెలల క్రితం( 2004 సెప్టెంబర్‌ నెలలో) దినేశ్‌ కార్తిక్‌ టీమిండియా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ముందు అతన్నే బంగ్లాదేశ్‌ టూర్‌కు ఎంపికచేయాలని బీసీసీఐ భావించింది. కానీ ఇండియా - ఏ తరపున ఒక జులపాల జుట్టు ఉన్న వ్యక్తి వికెట్‌ కీపర్‌గా.. బ్యాట్స్‌మన్‌గా అదరగొడుతున్నాడనే వార్త వచ్చింది. వెంటనే ధోనిని పిలిచి బంగ్లాదేశ్‌ టూర్‌కు సెలక్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. అలా అంతర్జాతీయ క్రికెట్‌లో ధోని తొలి అడుగు పడింది.

అలా 2004 డిసెంబర్‌ 23న బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అయితే ధోని అరంగేట్రం అనుకున్నంత గొప్పగా ఏం జరగలేదు. ఆ మ్యాచ్‌లో ధోని ఎదుర్కొన్న తొలి బంతికే బంగ్లా బౌలర్‌ తపస్‌ బైస్యా రనౌట్‌ చేశాడు. దీంతో ధోని గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. అయితే ధోనిపై సెలక్టర్లు నమ్మకముంచి పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. ఆ సిరీస్‌ ధోనికి టర్నింగ్‌పాయింట్‌ అవుతుందని ఎవరు ఊహించలేదు. విశాఖపట్నం వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో 123 బంతుల్లోనే 148 పరుగులు మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

''జులపాల జట్టు.. బలమైన దేహదారుడ్యంతో అతను బంతిని కసితీరా బాదుతుంటే మేము చాలా ఎంజాయ్‌ చేశామంటూ..టీమిండియాకు నిఖార్సైన వికెట్‌ కీపర్‌ దొరికాడంటూ'' అప్పటి మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకులు పేర్కొనడం వైరల్‌గా మారింది. ఇక శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ ధోని కెరీర్‌లో మరో కీలక మలుపు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోషన్‌ పొంది మూడోస్థానంలో వచ్చిన ధోని తుపాను ఇన్నింగ్స్‌ ఆడాడు. లంక విధించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఒంటిచేత్తో ఏకిపారేశాడు. 145 బంతుల్లో 183 పరుగులు సుడిగాలి ఇన్నింగ్స్‌తో అందరిని ఆకట్టకున్నాడు. ఇక్కడినుంచి ధోనికి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అప్పటినుంచి కీలక బ్యాటర్‌గా ఎదుగుతూ.. మంచి ఫినిషర్‌గా తనదైన ముద్ర వేశాడు. 

ఇక బ్యాటింగ్‌ సంగతి పక్కనబెడితే.. 2007లో ద్రవిడ్‌ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడం.. తీసుకున్న తొలి ఏడాదిలోనే టి20 ప్రపంచకప్‌ అందించడం.. ఇక 28 సంవత్సరాల నిరీక్షణ తర్వాత టీమిండియాకు వన్డే వరల్డ్‌కప్‌ అందించిన కెప్టెన్‌గా ధోని నిలిచాడు. 2013లో టీమిండియాకు ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ అందించిన ధోని ఇప్పటివరకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన తొలి కెప్టెన్‌గా.. ఒకే ఒక్కడిగా ఉన్నాడు. ఇక 2009లో టెస్టుల్లోనూ టీమిండియాను 600 రోజులపాటు నెంబర్‌వన్‌గా నిలిపాడు. ఇక చివరిసారి 2019 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ధోని ఆఖరిసారి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించాల్సిన సమయంలో ధోని రనౌటయ్యాడు. యాదృశ్చికంగా రనౌట్‌తో కెరీర్‌ను ఆరంభించిన ధోని.. అదే రనౌట్‌తో కెరీర్‌ను ముగించాడు. ఇక  కెప్టెన్‌గా లెక్కలేనన్ని ఘనతలు.. బ్యాట్స్‌మన్‌గా.. ఫినిషర్‌గా రికార్డలు.. అవార్డులు అందుకున్న ధోని ఆగస్టు 15, 2020లో అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ తన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. 

టీమిండియా కెప్టెన్‌గా ధోనిని ఐసీసీ ముచ్చటపడిందేమో అన్నట్లుగా 2006, 2008, 2009, 2010,2011,2012,2013.. మొత్తంగా ఏడుసార్లు ఐసీసీ వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిపాడు. ఇక 2011లో ధోని ఐసీసీ స్పిరిట్‌ క్రికెట్‌ అవార్డు అందుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement