ఢిల్లీ: మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఇద్దరు క్రికెటర్లపై ఢిల్లీ, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) వేటు వేసింది. ప్రస్తుతం ఆ క్రికెటర్లు ఢిల్లీ తరుపున అండర్-23 క్రికెట్ ఆడుతున్నారు. టీమ్ మేనేజర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ క్రికెటర్ల భవిష్యత్‌పై నిర్ణయం తీసుకంటామని డీడీసీఏ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి డీడీసీఎ ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి.
సీకే నాయుడు ట్రోఫీలో భాగంగా బెంగాల్‌తో మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టు కోల్‌కతాకు వెళ్లింది. స్థానికంగా జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఢిల్లీ క్రికెటర్లు పాల్గొన్నారు. వేడుకల అనంతరం ఇద్దరు క్రికెటర్లు కొంతమంది మహిళలను వెంబడిస్తూ వారితో అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతేకాకుండా ఆ మహిళలు బస చేస్తున్న హోటల్‌కు వెళ్లి వేధింపులకు గురిచేశారు. దీంతో హోటల్ సిబ్బందికి వారు ఫిర్యాదు చేయడంతో ఆ క్రికెటర్లను బయటకి పంపించేశారు.
ఈ విషయం తెలుసుకున్న డీడీసీఏ వెంటనే ఆ ఇద్దరు క్రికెటర్లపై వేటు వేసి ఢిల్లీకి వెనక్కి రప్పించింది. అంతేకాకుండా ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని టీమ్ మేనేజర్‌ను కోరింది. వీరి స్థానంలో మరో ఇద్దరి ఆటగాళ్లను కోల్‌కతాకు డీడీసీఏ పంపించింది. ఆటగాళ్ల క్రమశిక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని, అందరూ క్రమశిక్షణతో ఉండాలని హెచ్చరించింది. అయితే ఆ ఇద్దరి క్రికెటర్ల వివర్లను తెలపడానికి డీడీసీఏ నిరాకరించింది.
Comments
Please login to add a commentAdd a comment