అంపైర్లతో బెన్ క్రాఫ్ట్, స్టీవ్ స్మిత్ (ఫైల్ ఫొటో)
కేప్‌టౌన్ : ఆస్ట్రేలియా ఆటగాళ్ల బాల్ ట్యాంపరింగ్ వివాదం అంతర్జాతీయ క్రికెట్‌లో తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ జరుగుతుండగా.. అందరూ ఆటపై నిమగ్నమైన వేళ ఒక ఆటగాడి కదలికలపై కన్నేసి, ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నట్టు ప్రపంచానికి తెలిసేలా చేసింది మాత్రం దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఫానీ డివిలియర్స్. తాను ఆడుతున్న రోజుల్లోనే ఆసీస్ పని పట్టిన ఈ మాజీ పేస్ బౌలర్ తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ ఆటగాళ్ల తొండాటను ప్రపంచానికి తెలియ జేశాడు.
సాధారణంగా బంతి పాత బడిన తర్వాతే రివర్స్ స్వింగ్ చేయాడానికి వీలుంటుంది. కానీ ఆసీస్ మాత్రం 30 ఓవర్లలోపే కష్టతరమైన పచ్చిక మైదానంపై రివర్స్ స్వింగ్ చేయడం డివిలియర్స్‌కు అనుమానం వచ్చేలా చేసింది. వెంటనే కెమరామెన్‌లను అప్రమత్తంచేసి ఆసీస్ ఆటగాళ్లపై నిఘా పెట్టమని సూచించాడు.
అప్పటికే ఫీల్డ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ సైతం అంపైర్లకు ఫిర్యాదు చేయడంతో వారు బెన్‌క్రాఫ్ట్ వివరణ కోరారు. ఆ సమయంలో బెన్ క్రాఫ్ట్ అలాంటిదేమి లేదని, సన్ గ్లాస్ కవర్ అని బుకాయించే యత్నం చేశాడు. దీంతో అంపైర్లు బంతిని మార్చకుండా, పెనాల్టీ పరుగులు విధించకుండా మ్యాచ్‌ను కొనసాగించారు. అయితే బెన్ క్రాఫ్ట్ అంపైర్లకు చూపించింది, అతని ప్యాంట్‌లో దాచిన వస్తువు వేరు కావడంతో డివిలియర్స్ వ్యక్తం చేసిన అనుమానం నిజమయింది. దీంతో ఆసీస్ ఆటగాళ్ల ట్యాంపరింగ్ వెలుగులోకి వచ్చింది.
మ్యాచ్‌ను 30 కెమెరాలతో కవరేజ్ చేసామని, ట్యాంపరింగ్ యత్నం జరుగుతందని డివిలియర్స్ తమకు చెప్పగానే మరో ఏడు కెమెరాలతో ప్రత్యేకంగా బంతిపైనే నిఘా ఉంచామని మ్యాచ్ ప్రసారం చేసిన టెలివిజన్ అధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment