సిడ్నీ : ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ టెస్ట్ సిరీస్ నెగ్గకపోతేనే ఆశ్చర్యమని ఆ జట్టు మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ అభిప్రాయపడ్డాడు. టెస్ట్ సిరీస్ నెగ్గేందుకు కోహ్లిసేనకు ఇదే మంచి అవకాశమని చెప్పుకొచ్చాడు. రెండు నెలలు సుదీర్ఘంగా సాగే ఈ పర్యటనలో భారత్, ఆసీస్‌తో 4 టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ముందుగా ఈ నెల 21 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అయితే కోహ్లిసేనకు మాత్రం డిసెంబర్ 6న ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌తోనే అసలు పరీక్ష ఎదురుకానుంది. ఇప్పటి వరకు ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గని టీమిండియాకు ఇదో అద్భుత అవకాశమని డీన్ జోన్స్ అభిప్రాయపడ్డాడు.
క్రికెట్ కంట్రీ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘ఈ సిరీస్‌లో అశ్విన్ చెలరేగుతాడనుకుంటున్నా. గత పర్యటనల్లో అతను రాణించాడు. అప్పుడు అతని ప్రదర్శనతో భారత్ గెలిచేంత పనిచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు ఇదో మంచి అవకాశం. ఇప్పటి వరకు వారు ఇక్కడ టెస్ట్ సిరీస్ నెగ్గలేదు. ఇప్పుడు కూడా నెగ్గకపోతే ఆశ్చర్యపోవాల్సిందే. అశ్విన్‌కు తోడుగా కుల్దీప్‌కు జతయ్యాడు. అతను కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆసీస్ జట్టులో స్పిన్ బౌలింగ్ ఎదుర్కునే సత్తా పీటర్ హ్యాండ్‌స్కోంబ్, ఆరోన్ ఫించ్‌లకే ఉంది. ఈ ఇద్దరు అశ్విన్-కుల్దీప్‌లను ఎదుర్కుంటారని భావిస్తున్నా’ అని తెలిపాడు.
సూపర్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కోహ్లికి ఇక్కడ మంచి రికార్డే ఉంది. మొత్తం ఇక్కడ 8 మ్యాచ్‌లాడిన ఈ రన్ మెషిన్ 62 సగటుతో 992 పరుగులు చేశాడు. 169 పరుగుల అత్యధిక స్కోర్ ఐదు సెంచరీలు సాధించాడు. 2014-15 పర్యటనలో సైతం కోహ్లి బ్యాట్‌తో చెలరేగాడు. 4 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలతో 692 పరుగులు చేసి ప్రతీ మ్యాచ్ గెలిపించేంత పనిచేశాడు. టెస్ట్ సిరీస్ నెగ్గి ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించాలంటే కోహ్లి సేనకు ఇదే సదావకాశమని క్రికెట్ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment