రిజ్వీ గురి అదిరె... | Debutant Shahzar Rizvi wins gold with world record, Jitu Rai gets bronze | Sakshi
Sakshi News home page

రిజ్వీ గురి అదిరె...

Published Mon, Mar 5 2018 3:46 AM | Last Updated on Mon, Mar 5 2018 4:07 AM

Debutant Shahzar Rizvi wins gold with world record, Jitu Rai gets bronze - Sakshi

షాజర్‌ రిజ్వీ, మెహులీ ఘోష్‌, జీతూ రాయ్‌

అంతర్జాతీయ షూటింగ్‌ సీజన్‌ తొలి టోర్నమెంట్‌లో తొలి రోజే భారత షూటర్లు అదరగొట్టారు. మెక్సికోలోని గ్వాడలహారా నగరంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో మొదటిరోజు భారత షూటర్ల గురికి మూడు పతకాలు లభించాయి. కెరీర్‌లో తొలి ప్రపంచకప్‌ ఆడుతోన్న 23 ఏళ్ల ఉత్తరప్రదేశ్‌ షూటర్‌ షాజర్‌ రిజ్వీ ‘ప్రపంచ రికార్డు’ ప్రదర్శనతో పసిడి పతకం సొంతం చేసుకోగా... 18 ఏళ్ల బెంగాలీ  అమ్మాయి మెహులీ ఘోష్‌ కాంస్య పతకం కైవసం చేసుకొని ఔరా అనిపించింది. స్టార్‌ షూటర్‌ జీతూ రాయ్‌ తన సత్తా చాటుతూ కాంస్యాన్ని దక్కించుకొని తన ఖాతాలో మరో అంతర్జాతీయ పతకాన్ని జమ చేసుకున్నాడు.   

గ్వాడలహారా (మెక్సికో): ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన తొలి ప్రపంచకప్‌లోనే భారత యువ పిస్టల్‌ షూటర్‌ షాజర్‌ రిజ్వీ అద్వితీయ ప్రదర్శన చేశాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో స్వర్ణ పతకం నెగ్గడంతోపాటు కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో మీరట్‌కు చెందిన రిజ్వీ 242.3 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో 241.8 పాయింట్లతో తొమొయుకి మత్సుదా (జపాన్‌) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును రిజ్వీ బద్దలు కొట్టాడు.

భారత్‌కే చెందిన స్టార్‌ షూటర్‌ జీతూ రాయ్‌ 219 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెల్చుకోగా... క్రిస్టియన్‌ రీట్జ్‌ (జర్మనీ–239.7 పాయింట్లు) రజత పతకం సాధించాడు. మరో భారత షూటర్‌ ఓంప్రకాశ్‌ 198.4 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. 33 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్‌లో క్రిస్టియన్‌ రీట్జ్‌ (588 పాయింట్లు) తొలి స్థానంలో నిలువగా... రిజ్వీ (579 పాయింట్లు), జీతూ రాయ్‌ (578 పాయింట్లు), ఓంప్రకాశ్‌ (576 పాయింట్లు) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాలను పొంది ఫైనల్‌కు చేరారు. 

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో భారత్‌ నుంచి ముగ్గురు షూటర్లు మెహులీ ఘోష్, అపూర్వీ చండేలా, అంజుమ్‌ మౌద్గిల్‌ ఫైనల్‌కు చేరారు. తొలి ప్రపంచ కప్‌ ఆడుతోన్న మెహులీ ఘోష్‌ 228.4 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని గెల్చుకుంది. లారా జార్జెటా కొమన్‌ (రొమేనియా–251.5 పాయింట్లు) స్వర్ణం... జూ హాంగ్‌ (చైనా–251 పాయింట్లు) రజతం సాధించారు. గతేడాది జాతీయ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో మెహులీ ఏకంగా 8 స్వర్ణ పతకాలు సాధించి వెలుగులోకి వచ్చింది. భారత్‌కే చెందిన అంజుమ్‌ 208.6 పాయింట్లతో నాలుగో స్థానాన్ని పొందగా... అపూర్వీ 144.1 పాయింట్లతో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement