మణి దీపం | Deepa Malik becomes India's first female medallist at Rio Paralympics | Sakshi
Sakshi News home page

మణి దీపం

Published Tue, Sep 13 2016 2:17 AM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

మణి దీపం

మణి దీపం

దీపా మలిక్ కొత్త చరిత్ర
రియోలో దీప, మలిక్‌ల విన్యాసాలు మరచిపోకముందే ఈసారి దీపా మలిక్ మన జాతీయ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. భారత్ కీ బేటీలే కాదు...  భారత్ కీ ‘మా’ కూడా దేశం గర్వపడేలా చేయగలదని 46 ఏళ్ల ఈ స్ఫూర్తి ప్రదాత నిరూపించింది. పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించి భారత నారి  ఘనతను ప్రపంచానికి చాటింది. కాళ్లు కదపలేకపోతేనేమి... ఆత్మస్థైర్యం నిండిన ఆ చేతులు ఇనుప గుండును అల్లంత దూరం విసిరి వెండి వెలుగులు పంచాయి. రియో వేదికగా... తొలిసారి ఓ భారత మహిళ పారాలింపిక్స్ పతకం సాధించింది.
 
పారాలింపిక్స్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయురాలిగా రికార్డు  
రియోలో షాట్‌పుట్ ఈవెంట్‌లో రజతం

రియో డి జనీరో: భారత క్రీడాభిమానులకు మరో తీపి కబురు. రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. మహిళల షాట్‌పుట్ (ఎఫ్-53) ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి దీపా మలిక్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన ఫైనల్లో దీపా మలిక్ ఇనుప గుండును 4.61 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచింది. ఫాతిమా నెధమ్ (బహ్రెయిన్-4.76 మీటర్లు) స్వర్ణం సాధించగా... దిమిత్రా కొరోకిడా (గ్రీస్-4.28 మీటర్లు) కాంస్యం సంపాదించింది. హరియాణాలోని సోనెపట్‌కు చెందిన 46 ఏళ్ల దీపా పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు పతకం అందించిన తొలి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

ఇప్పటివరకు రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు మూడు పతకాలు లభించాయి. ఇంతకుముందు పురుషుల హైజంప్‌లో మరియప్పన్ తంగవేలు స్వర్ణం, వరుణ్ సింగ్ భటి కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే. ఫైనల్లో దీప మొత్తం ఆరు ప్రయత్నాలు చేసింది. ఆరో ప్రయత్నంలో ఆమె ఇనుప గుండును అత్యధికంగా 4.61 మీటర్ల దూరం విసిరి రజతాన్ని ఖాయం చేసుకుంది. తొలి మూడు ప్రయత్నాల్లో ఆమె వరుసగా 4.26 మీటర్లు, 4.49 మీటర్లు, 4.41 మీటర్లు దూరం విసిరింది. నాలుగో ప్రయత్నం ఫౌల్ కాగా... ఐదో ప్రయత్నంలో 4.41 మీటర్ల దూరం విసిరింది.
 
ఆల్‌రౌండర్: షాట్‌పుట్‌తోపాటు జావెలిన్ త్రో, స్విమ్మింగ్‌లో ప్రవేశమున్న దీపా మలిక్ 2011లో ప్రపంచ చాంపియన్‌షిప్ షాట్‌పుట్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు 2010లో ఆసియా పారాగేమ్స్‌లో జావెలిన్ త్రోలో కాంస్యం సాధించింది. 2012లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అర్జున’ పురస్కారాన్ని అందుకుంది. అర్జున అవార్డు పొందిన పెద్ద వయస్కురాలిగా కూడా దీప (42 ఏళ్ల వయసులో) గుర్తింపు పొందింది.
 
హరియాణా రూ.4 కోట్లు: రియో పారాలింపిక్స్‌లో రజతం నెగ్గిన దీపా మలిక్‌కు హరియాణా ప్రభుత్వ క్రీడా పథకం నిబంధనల ప్రకారం రూ. 4 కోట్ల నజరానా లభించనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 50 లక్షలు లభించనున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రూ. కోటి నజరానా ప్రకటించారు.
 
అభినందనల వెల్లువ: దీపా మలిక్ పతకం గెలవడంతో ఆమెపై ప్రశంసల వర్షం కురిసింది. ‘దేశం మొత్తం నిన్ను చూసి గర్విస్తోంది’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేయగా... దేశానికి స్ఫూర్తిని అందించే పతకం ఇదంటూ అభినవ్ బింద్రా అభినందనలు తెలిపాడు. సచిన్‌తో పాటు పలువురు క్రికెటర్లు, సోనియాతో సహా అనేకమంది రాజకీయ నాయకులు దీపను అభినందించారు.
 
‘నేనెంతో గర్వపడే క్షణం ఇది. వైకల్యంతో బాధపడే మహిళలకు అండగా నిలిచేందుకు ఈ విజయం తోడ్పడుతుంది. భారత జట్టులో పెద్ద వయస్కురాలిగా ఉండి పతకం గెలవడం సంతోషంగా అనిపిస్తోంది.
 ఇన్నేళ్ల నా ప్రయాణం చాలా గొప్పగా సాగింది. ఇందులో
 నా కుటుంబం మొత్తం తోడుగా నిలిచింది‘

- దీపా మలిక్
 
‘విల్ ఆన్ వీల్స్’
దీపా మలిక్ స్ఫూర్తిదాయక గాథ
అథ్లెటిక్స్.. బైక్ రైడింగ్.. స్విమ్మింగ్... అడ్వెంచరస్ స్పోర్‌‌ట్స.. నడుము కింది భాగం అంతా చచ్చుబడిపోరుు చక్రాల కుర్చీకే పరిమితమైపోరుున 46 ఏళ్ల మహిళ ఈ అన్ని అంశాల్లో అసాధారణ ప్రతిభ చూపడాన్ని కనీసం ఊహించగలమా..!  వైకల్యాన్ని అధిగమించి ఎన్నో ఘనతలు సాధించిన స్ఫూర్తి ప్రదాత దీపా మలిక్.

 
 
పారాలింపిక్స్ పతకంతో దీపా మలిక్ అద్భుతాల జాబితాలో మరో కోహినూర్ చేరింది. చిన్ననాటినుంచి ఆమె జీవితమే ఒక పోరాటంగా బతికింది.
మూడేళ్లు ఆస్పత్రిలో..: తండ్రి బీకే నాగ్‌పాల్ ఆర్మీలో ఉన్నతాధికారి. సరదాగా గడిచిపోతున్న బాల్యానికి ఐదేళ్ల వయసులోనే దేవుడు అడ్డుకట్ట వేశాడు. పారాప్లెజిక్ డిసెబిలిటీతో దీప కాళ్లూ, చేతులూ ఒక్కసారిగా బలహీనంగా మారిపోయాయి. కనీసం నిలబడటం కూడా సాధ్యం కాకపోయేది. వెన్నెముక సమస్య అని తేల్చిన డాక్టర్లు చివరకు సుదీర్ఘ వైద్యం చేశారు. మూడేళ్ల పాటు ఆస్పత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. చివరకు ఎలాగో కోలుకొని మళ్లీ ఈ ప్రపంచంలోకి వచ్చింది.
 
బైక్‌ల పిచ్చి: చిన్నప్పటినుంచి దీప స్నేహితుల్లో అబ్బాయిలే ఎక్కువగా ఉన్నారు.  దాంతో మోటార్ బైక్‌లు అంటే పిచ్చి. ఇంటర్ పూర్తయ్యే సరికే ఇదీ, అదని లేకుండా అన్ని రకాల బైక్‌లను నడిపేసింది. బైక్‌ల మీద వ్యామోహమే ఇంటికి పెళ్లి సంబంధాన్ని తెచ్చింది. ఒక రోజు తెల్లవారుజామునే ఇంటి ముందు ఏదో పని మీద నిలబడి ఉన్న సైనికుడి వద్ద బైక్ తీసుకొని అక్కడికక్కడే భిన్నమైన విన్యాసాలు చేసేసింది. దాంతో మనసు పారేసుకున్న ఆ కుర్రాడు కల్నల్ విక్రమ్ సింగ్ పెళ్లి చేసుకుంటానంటూ ఇంటికొచ్చేశాడు.
 
కూతురికి కూడా..: దీప హెల్త్ రిపోర్ట్‌లు అన్నీ చూపించి ఇదీ పరిస్థితి అని చెప్పినా ఆ సైనికుడు వెనుకడుగు వేయలేదు. దాంతో 19 ఏళ్లకే పెళ్లయిపోయింది. కొన్నాళ్లు మళ్లీ సంతోషాలు విరబూసాయి. ఒక పాప (దేవిక)పుట్టింది. అయితే 13 నెలల వయసులో ఆ చిన్నారికి కూడా తల్లిలాగానే సమస్య రావడంతో అమ్మ గుండె తరుక్కుపోయింది. అయితే చివరకు కోలుకున్న ఆ చిన్నారి నిలబడగలిగింది. ఆ తర్వాత రెండో పాప (అంబిక) కూడా పుట్టి కుటుంబంలో సంతోషాన్ని పంచింది.
 
ఒక్కసారి నడుస్తాను ప్లీజ్: అది 1999లో కార్గిల్ వార్ జరుగుతున్న సమయం... భర్త విక్రమ్ యుద్ధ భూమిలో ఉన్నాడు. ఇక్కడ దీప ఒక్కసారిగా అనారోగ్యం పాలైంది. చికిత్స కోసం వెళితే చిన్ననాటి సమస్య మళ్లీ వచ్చిందని తెలిసింది. ఆపరేషన్ చేసి ట్యూమర్‌ను తొలగిస్తామని డాక్టర్లు చెప్పారు. అయితే జీవితంలో మళ్లీ నడవలేవని పిడుగులాంటి మాట కూడా చెప్పారు. కన్నీళ్లు జలపాతాలై కారుతుండగా శాటిలైట్ ఫోన్‌లో భర్తతో మాట్లాడింది. అచ్చమైన సైనికుడిలా ‘నీకు నేనున్నాను, మరేం భయం లేదంటూ’ భర్త ధైర్యం నూరిపోశాడు. ఆపరేషన్‌కు అంతా సిద్ధమైంది. థియేటర్‌లోకి వెళ్లే ముందు డాక్టర్‌తో ‘చివరిసారిగా నడుస్తాను’ అని చెప్పి అక్కడి వరకు దీప నడుస్తూ పోయింది.
 
చక్రాల కుర్చీలోనే విజయాలు...
తనకు ఇలాంటి జీవితం ఇచ్చినందుకు దేవుడిని తిట్టుకోలేదు. తన ఆరోగ్య పరిస్థితి ఆమెలో మరింత స్థైర్యాన్ని, పట్టుదలను పెంచింది. ముందుగా కుటుంబ సభ్యుల సహకారంతో రెస్టారెంట్ నడిపి సక్సెస్ అయింది. స్విమ్మింగ్ ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోయిన వారికి యమునా నదిలో ఏటికి ఎదురీది చూపించింది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో హిమాలయాల వద్ద రైడింగ్ చేసింది. తర్వాత అథ్లెటిక్స్‌లోకి వచ్చింది. వీల్‌చైర్‌తోనే అంతా ముగిసిపోదని, జీవితమంటే ప్రతి రోజూ చేసుకునే పండగలాంటిదని నమ్మిన దీపా మలిక్ తనలాంటి వారి కోసం ఇప్పుడు ‘విల్ ఆన్ వీల్స్’ అనే సంస్థను కూడా నడిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement