సైనాపై అంచనాలు లేకపోవడం మంచిదే
కోచ్ విమల్ కుమార్ అభిప్రాయం
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో ఎలాంటి అంతర్జాతీయ ఈవెంట్స్ జరిగినా స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌పై అభిమానులు పెద్దగా ఎలాంటి అంచనాలు పెట్టుకోవడం లేదనే చెప్పవచ్చు. గాయాలతో పాటు వరుస పరాజయాలు ఆమెను వెనక్కి నెడుతున్నాయి. మరోవైపు పీవీ సింధు, శ్రీకాంత్, సాయిప్రణీత్‌లాంటి వారు చక్కటి విజయాలతో దూసుకెళుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి ప్రతిష్టాత్మక వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సైనాకు మేలు చేస్తుందని ఆమె కోచ్ విమల్ కుమార్ అభిప్రాయపడ్డారు.
2015లో ఇదే టోర్నీలో రజతం సాధించిన తొలి భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సైనా చరిత్ర సృష్టించింది. ‘మోకాలి గాయం తర్వాత సైనా ఇబ్బంది పడుతోంది. కొన్ని గెలవాల్సిన మ్యాచ్‌లను కూడా కోల్పోయింది. స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే అగ్రశ్రేణి ఆటగాళ్లను ఓడించే సత్తా ఉంది. ఇప్పటికైతే అందరి ఫోకస్ సైనాపై లేదు. సింధు, శ్రీకాంత్‌లపై అంచనాలున్నాయి. ఇదే తనకు మేలు చేస్తుంది. గాయం కూడా ఇబ్బంది పెట్టడం లేదు. డ్రా మాత్రం కఠినంగానే ఉంది. తొలి రౌండ్‌లో నెగ్గితే ప్రపంచ నంబర్ 2 సంగ్ జీతో సైనా తలపడాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆమెపై సైనా నెగ్గింది’ అని విమల్ అన్నారు.