ధోనీ చివరిదాకా ఒంటరి పోరాటం చేసినా..
బెంగళూరు: సుదీర్ఘ విరామం తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడుతున్న భారత టి-20, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాట్తో రాణించినా.. తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. విజయ్ హజారే ట్రోఫీలో ధోనీ ప్రాతినిధ్యం వహించిన సొంత జట్టు జార్ఖండ్ క్వార్టర్స్లో 99 పరుగుల తేడాతో గౌతమ్ గంభీర్ సారథ్యంలోని ఢిల్లీ చేతిలో ఓడిపోయింది.
బుధవారం బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్లో 226 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన జార్ఖండ్ 38 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌటైంది. ధోనీ (70 నాటౌట్) హాఫ్ సెంచరీతో చివరి వరకు క్రీజులో ఉన్నా ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. ఈ టోర్నీలో ధోనీ అత్యధిక స్కోరు ఇదే. జార్ఖండ్కు వరుణ్ ఆరోన్ నాయకత్వం వహించాడు. ఢిల్లీ బౌలర్లు భాటి నాలుగు, శైనీ మూడు వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 225 పరుగులు చేసింది. ఢిల్లీ జట్టులో రాణా 44 పరుగులు చేశాడు.