పుణెకు సాధారణ లక్ష్యం
విశాఖ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా మంగళవారం ఇక్కడ పుణె సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాటింగ్లో తడబడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 122 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ప్రత్యర్థికి నిర్దేశించింది. ఢిల్లీ ఆటగాళ్లలో కరుణ్ నాయర్(41), క్రిస్ మోరిస్(38నాటౌట్) మినహా ఎవరూ రాణించలేదు. డీ కాక్(2), ఐయ్యర్(8), సంజూ శాంసన్(10), రిషబ్ పంత్(4), జేపీ డుమిని(12)లు తీవ్రంగా నిరాశపరచడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. పుణె బౌలర్లు అద్భుతంగా రాణించి ఢిల్లీని కట్టడి చేశారు. పుణె బౌలర్లలో ఆడమ్ జంపా, అశోక్ దిండాలు తలో మూడు వికెట్లతో రాణించారు.
చివరి ఓవర్లో 22 పరుగులు
ఆది నుంచి పరుగులు రాబట్టడానికి ఇబ్బంది పడిన ఢిల్లీ ప్రత్యేకంగా చివరి ఓవర్లో 22 పరుగులు సాధించడం ఇన్నింగ్స్కే హైలెట్. తిషారా పెరీరా వేసిన ఆఖరి ఓవర్ లో ఢిల్లీ దూకుడును ప్రదర్శించింది. తొలి రెండు బంతులు సింగిల్ మాత్రమే వచ్చినా.. ఆ తరువాత నాలుగు బంతులను మోరిస్ ఫోర్, సిక్స్, ఫోర్, సిక్స్ గా మలచి ఢిల్లీ సాధారణ స్కోరు చేయడంలో సహకరించాడు.