డేర్‌డెవిల్స్ ఢమాల్
* పుణే చేతిలో ఢిల్లీ ఓటమి
* రాణించిన జంపా, దిండా
సాక్షి, విశాఖపట్నం: అంచనాలకు మించి రాణిస్తూ ప్లే ఆఫ్ వైపు దూసుకెళ్లిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ చివరి దశలో తడబడుతూ తమ అవకాశాలను క్లిష్టం చేసుకుంటోంది. మంగళవారం వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 19 పరుగుల తేడాతో ఓడింది. ఇక ఈ జట్టు తమకు మిగిలిన రెండు మ్యాచ్‌లను కచ్చితంగా గెలవాల్సిందే. అలాగే తమ చివరి ఐదు మ్యాచ్‌ల్లో ఢిల్లీకిది నాలుగో ఓటమి.
మరోవైపు తమకు నామమాత్రమైన మ్యాచ్‌లో మాత్రం పుణే సమష్టి కృషితో రాణించి ఆకట్టుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 121 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (43 బంతుల్లో 41; 5 ఫోర్లు) పోరాడగా... చివర్లో మోరిస్ (20 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) మోతెక్కించాడు. అశోక్ దిండా, ఆడమ్ జంపాకు మూడేసి వికెట్లు దక్కాయి.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పుణే 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 76 పరుగులు చేసిన సమయంలో రెండోసారి వర్షం అంతరాయం కలిగిం చింది. దీంతో ఢిల్లీకన్నా రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో పుణే విజేతగా నిలిచింది.
వికెట్లు టపటపా
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టును పుణే బౌలర్లు ఓ ఆటాడించారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచడంతో పరుగులు రావడమే కష్టమైంది. ఓపెనర్ డి కాక్ (2)ను మూడో ఓవర్‌లోనే పేసర్ దిండా ఎల్బీగా పంపడంతో వికెట్ల పతనం ప్రారంభమైంది. తన మరుసటి ఓవర్‌లో శ్రేయస్ (8)ను కూడా అవుట్ చేయడంతో జట్టు పవర్‌ప్లేలో 28/2 పరుగులు మాత్రమే చేయగలిగింది.
దీనికి తోడు మధ్య ఓవర్లు కట్టుదిట్టంగా పడడంతో సింగిల్స్ తీయడమే కష్టంగా మారింది. కరుణ్ నాయర్ ఒక్కడే నిలబడ్డాడు. పదో ఓవర్‌లో జంపా ప్రవేశంతో ఢిల్లీ పతనం ప్రారంభమైంది. శామ్సన్ (10), రిషబ్ (4), కరుణ్‌లను అవుట్ చేయడంతో జట్టు వంద పరుగులు చేయడం కూడా కష్టంగా అనిపించింది. అయితే చివరి ఓవర్‌లో మోరిస్ 4,6,4,6తొ మొత్తం 22 పరుగులు రాబట్టాడు.
స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన పుణే ఇన్నింగ్స్ ఖవాజా (13 బంతుల్లో 19; 4 ఫోర్లు) జోరుతో 3 ఓవర్లలోనే 30 పరుగులకు చేరింది. అయితే ఆ తర్వాత పరుగుల వేగం మందగించింది. తొమ్మిదో ఓవర్‌లో వర్షం కారణంగా గంట పాటు మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత 11వ ఓవర్‌లో రహానే 4,6 బాదగా మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో ఆట సాధ్యం కాలేదు.
స్కోరు వివరాలు
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ ఎల్బీడబ్ల్యు (బి) దిండా 2; శ్రేయస్ అయ్యర్ (సి) ఖవాజా (బి) దిండా 8; నాయర్ ఎల్బీడబ్ల్యు (బి) జంపా 41; శామ్సన్ (స్టంప్డ్) ధోని (బి) జంపా 10; రిషబ్ (సి) పెరీరా (బి) జంపా 4; డుమిని (సి) ఇర్ఫాన్ (బి) దిండా 14; మోరిస్ నాటౌట్ 38; నైల్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 121.
వికెట్ల పతనం: 1-4, 2-25, 3-49, 4-62, 5-70, 6-93.
బౌలింగ్: దిండా 4-1-20-3; చాహర్ 2-0-13-0; పెరీరా 3-0-27-0; ఇర్ఫాన్ 3-0-17-0; జంపా 4-0-21-3; అశ్విన్ 4-0-23-0.
రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే నాటౌట్ 42; ఖవాజా (సి) అయ్యర్ (బి) మోరిస్ 19; బెయిలీ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (11 ఓవర్లలో వికెట్ నష్టానికి) 76.
వికెట్ల పతనం: 1-31.; బౌలింగ్: జహీర్ 3-0-19-0; కౌల్టర్ నైల్ 3-0-21-0; మోరిస్ 2-0-12-1; మిశ్రా 2-0-10-0; షమీ 1-0-12-0.