ఆ పిచ్ చూస్తే.. వణికిపోతారు
భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మధ్య జరిగే చిట్టచివరి, నాలుగో టెస్టు గురించి ఆస్ట్రేలియా చాలా ఆశాభావంతో ఉంది. ఇప్పటి వరకు జరిగిన మూడింటిలో రెండు జట్లు తలో విజయం సాధించగా, మూడో టెస్టు డ్రా అయింది. ఇప్పుడు నాలుగో టెస్టు వేదిక అయిన ధర్మశాల పిచ్ గురించి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ మంచి ఆశాభావంతో ఉన్నాడు. ఇక్కడ పేస్‌బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌ను చూస్తే భారత జట్టు వణికిపోతుందని వ్యాఖ్యానించాడు. ''ధర్మశాల చాలా అద్భుతమైన గ్రౌండ్. చాలా తక్కువసార్లు మాత్రమే పిచ్ మీద గడ్డి కనిపిస్తుంది. అందువల్ల ఆస్ట్రేలియన్లు మంచి విశ్వాసంతో ఉంటే, టీమిండియా మాత్రం వణుకుతోంది. ఈ సిరీస్‌లో వాళ్లు అతి విశ్వాసంతో ఉన్నట్లున్నారు. వాళ్ల స్కోర్‌లైన్ దాన్ని చూపిస్తోంది'' అని జాన్సన్ అన్నాడు. జాక్సన్ బర్డ్‌కు బదులు ఇలాంటి పిచ్ మీద పుణె టెస్టు హీరో స్టీవ్ ఓకీఫ్‌ను తీసుకొచ్చే అవకాశం ఉందని తెలిపాడు. నాలుగో టెస్టు శనివారం నుంచి ప్రారంభం కానుంది.
ఈ సిరీస్ మొత్తమ్మీద స్పిన్నర్లు మంచి పెర్ఫామెన్స్ చూపించారని, ఇంతకుముందు వాళ్లను జట్టులో ఉంచుతారా లేదా అన్న పరిస్థితి ఉండగా.. ఇప్పుడు తమ ప్రదర్శనతో ఎలాంటి పిచ్‌ల మీదైనా ఫలితాలు సాధించగలమని చూపించుకున్నారని జాన్సన్ చెప్పాడు. నాథన్ లయన్‌కు ఈసారి మంచి బౌన్స్ వస్తుందని, అతడు బాల్‌ను చాలా బాగా టర్న్ చేస్తున్నాడని అన్నాడు. అయితే.. రైట్, లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త పడాల్సిందేనని తెలిపాడు. ధర్మశాల లాంటి పిచ్‌ల మీద బర్డ్ బాగా ఉపయోగపడతాడని చెప్పాడు.