సాక్షి, హైదరాబాద్: ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) సీజన్ ఆరంభ టోర్నీ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ చాంపియన్‌షిప్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి రౌండ్‌లో సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచిన బెంగళూరుకు చెందిన ఎం. ధర్మ, పట్నా గోల్ఫర్ అమన్‌రాజ్... గురువారం జరిగిన రెండో రౌండ్ పోటీల్లోనూ ఉమ్మడిగా అగ్రస్థానాన్ని సంపాదించారు. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ (హెచ్‌జీసీ) వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. నోయిడా ప్లేయర్ గౌరవ్ ప్రతాప్ సింగ్ రెండోరోజు ఆటలో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఆతను 10 అండర్ 61 పాయింట్లు స్కోర్ చేసి కొత్త ‘కోర్స్ రికార్డు’ను తన పేర లిఖించుకున్నాడు.
అంతకుముందు ఈ రికార్డు అజితేశ్ సంధు (9 అండర్ 62) పేరిట ఉండేది. 2016లో అజితేశ్ ఈ ఘనత సాధించాడు. తొలి స్థానాన్ని దక్కించుకున్న ధర్మ, అమన్ రాజ్‌లిద్దరూ రెండోరౌండ్‌లో 7 అండర్ 64 పాయింట్లు స్కోర్ చేశారు. ఓవరాల్‌గా 14 అండర్ 128 పాయింట్లతో రెండోరోజు ముగిసేసరికి ఆధిక్యంలో నిలిచారు. ధర్మ 5 బిర్డీస్, 1 ఈగల్ సహాయంతో 64 పాయింట్లు సాధించగా... అమన్ రాజ్ 7 బిర్డీస్‌ను నమోదు చేశాడు. బెంగళూరుకు చెందిన చిక్కరంగప్ప కూడా రెండోరౌండ్‌లో 7 అండర్ 64 పాయింట్లు సాధించినప్పటికీ ఓవరాల్ స్కోర్‌లో 13 అండర్ 129 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. వీరంతా మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ... రెండోరౌండ్ ఆటను మాజీ పీజీటీఐ చాంపియన్ గౌరవ్ శాసించాడు. అతను ఎలాంటి పొరపాటుకు తావు ఇవ్వకుండా 10 బిర్డీస్ సహాయంతో 61 పాయింట్లు నమోదు చేశాడు.
దీంతో ఏకంగా 36 స్థానాలు ఎగబాకి ఓవరాల్ స్కోర్ 11 అండర్ 131తో నాలుగో స్థానాన్ని అందుకున్నాడు. ఈ ప్రదర్శనపై గౌరవ్ హర్షం వ్యక్తం చేశాడు. ‘తొలిరౌండ్‌లో చేసిన తప్పిదాలు రెండోరౌండ్‌లో సరిదిద్దుకున్నా. ఈ ప్రదర్శన నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అని అన్నాడు. గౌరవ్‌తో పాటు ప్రియాన్షు సింగ్ (గురుగ్రామ్), రషీద్ ఖాన్ (ఢిల్లీ) 64 పాయింట్లతో నాలుగోస్థానంలో నిలిచారు. తొలిరౌండ్‌లో అగ్రస్థానంలో నిలిచిన నోయిడా ప్లేయర్ అమర్‌దీప్ మలిక్ రెండోరౌండ్‌లో విఫలమయ్యాడు. అతను 73 పాయింట్లు స్కోర్ చేసి 7 అండర్ 135తో 13వ స్థానానికి పడిపోయాడు. డిఫెండింగ్ చాంపియన్ ఉదయన్ మానె (అహ్మదాబాద్) 66 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. రెండోరౌండ్ తర్వాత 50 మంది ప్రొఫెషనల్ గోల్ఫర్లు తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. కట్ కోసం నిర్దేశించిన ‘ఈవెన్ పర్ 142’ స్కోరును అందుకోలేకపోయిన స్థానిక ఫ్రొఫెషనల్ గోల్ఫర్లు సంజయ్, హైదర్ హుస్సేన్, అమెచ్యూర్ క్రీడాకారులు హార్దిక్, అనిరుధ్ టోర్నీ నుంచి నిష్క్రమించారు.
Comments
Please login to add a commentAdd a comment