golf tourney
-
వేల కోట్ల రూపాయల ఆఫర్‌ను తిరస్కరించిన గోల్ఫ్ దిగ్గజం
అంతర్జాతీయ గోల్ఫ్ దిగ్గజం టైగర్‌వుడ్స్ ఒక బిలియన్ అమెరికన్ డాలర్లు(ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. ఏడున్నర వేల) కోట్ల ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. సౌదీ రన్ ఎల్ఐవీ గోల్ఫ్ సిరీస్‌కు సంబంధించిన టోర్నీలో టైగర్‌వుడ్స్ పాల్గొనేందుకు నిరాకరించినట్లు మరో మాజీ గోల్ఫ్ ఆటగాడు గ్రెగ్ నార్మన్ ద్రువీకరించాడు. 46 ఏళ్ల టైగర్‌వుడ్స్ సౌదీ గోల్ఫ్ నుంచి తప్పుకోవాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నాడని.. మరింత బెస్ట్ ప్లేయర్లు ఉన్న కొత్త సిరీస్‌కు టైగర్‌వుడ్స్ సంతకం చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసిందని నార్మన్ అభిప్రాయపడ్డాడు. అయితే ఫిల్ మికెల్సన్, డస్టిన్ జాన్సన్‌లతో సహా కొంతమంది హై ప్రొఫైల్ ప్లేయర్లు £100 మిలియన్ విలువైన రుసుముపై సంతకం చేయనున్నారు. కాగా టైగర్ వుడ్స్ గతంలోనూ ఎల్ఐవీ గోల్ఫ్‌కు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించాడు. నవంబర్ 2021లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న టైగర్‌వుడ్ ఎల్ఐవీ గోల్ఫ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నేను పీజీఏ టూర్‌కు మద్దతు ఇస్తున్నానని స్వయంగా నిర్ణయించుకున్నాను. నా వారసత్వం ఇక్కడే ఉంది. ఈ టూర్లో 82 ఈవెంట్లు, 15 మేజర్ ఛాంపియన్షిప్లను గెలుచుకోవడంతో పాటు ఛాంపియన్‌షిప్‌లలో భాగమైనందుకు అదృష్టవంతుడిని అయ్యాను.'' అని చెప్పుకొచ్చాడు. -
భారత క్రీడల చరిత్రలోనే అత్యధిక ప్రైజ్‌మనీ కొట్టేశాడు..
పాంచె వెడ్రా బీచ్ (అమెరికా): భారత గోల్ఫర్ అనిర్బన్ లాహిరి ప్రైజ్‌మనీ విషయంలో అరుదైన ఘనత సాధించాడు. ప్రతిష్టాత్మక గోల్ఫ్ టోర్నీ ‘ప్లేయర్స్ చాంపియన్‌షిప్’లో అతను రన్నరప్‌గా నిలిచాడు. ఒక్క షాట్ తేడాతో అతను విజేతగా నిలిచే అవకాశాన్ని కోల్పోగా... ఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్ స్మిత్ టైటిల్ సాధించాడు. రన్నరప్‌గా నిలవడం ద్వారా లాహిరికి 2.18 మిలియన్ డాలర్లు (సుమారు రూ.16.66 కోట్లు) బహుమతిగా లభించాయి. భారత క్రీడల చరిత్రలో ఏ క్రీడాంశంలోనైనా వ్యక్తిగత విభాగంలో ఒక ఆటగాడు సాధించిన అత్యధిక బహుమతి మొత్తం ఇదే కావడం విశేషం. గతంలో విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ విజేతగా నిలిచిన రెండు సందర్భాల్లో 1.68 మిలియన్ డాలర్లు, 1.53 మిలియన్ డాలర్లు చొప్పున అందుకున్నాడు. చదవండి: (India vs England: ప్రతీకారానికి సమయం!) -
ఆసియా ప్లేయర్‌కు తొలిసారిగా టైటిల్.. సరికొత్త చరిత్ర
ప్రపంచ గోల్ఫ్ క్రీడలో ప్రతిష్టాత్మక టోర్నీగా పేరున్న ‘మాస్టర్స్’ ఈవెంట్లో తొలిసారి ఆసియా ప్లేయర్ చాంపియన్‌గా నిలిచాడు. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగిన ఈ టోర్నీలో జపాన్ గోల్ఫర్, 29 ఏళ్ల హిడెకి మత్సుయామ టైటిల్ సాధించాడు. నిర్ణీత నాలుగు రౌండ్ల తర్వాత మత్సుయామ 278 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. విజేతగా నిలిచిన మత్సుయామకి 20,70,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ.15 కోట్ల 54 లక్షలు)తోపాటు గ్రీన్ జాకెట్‌ను అందజేశారు. భారత్ అజేయంగా... బ్యూనస్ ఎయిర్స్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్‌లో భాగంగా అర్జెంటీనాతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ భారత్ గెలిచింది. రియో ఒలింపిక్స్ చాంపియన్ అర్జెంటీనాతో జరిగిన తొలి పోరులో ‘షూటౌట్’లో నెగ్గిన భారత్... రెండో మ్యాచ్‌లో 3–0తో ఘన విజయం సాధించింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (11వ నిమిషంలో), లలిత్ ఉపాధ్యాయ్ (25వ నిమిషంలో), మన్దీప్ సింగ్ (58వ నిమిషంలో) చెరో గోల్ సాధించి జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. తొమ్మిది జట్ల మధ్య జరుగుతున్న ప్రొ లీగ్‌లో తాజా విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియాను దాటేసి 15 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. -
విజేత చాముండేశ్వరీనాథ్
సాక్షి, హైదరాబాద్: కృష్ణపట్నం పోర్ట్స్ గోల్ఫ్ టోర్నమెంట్లో మాజీ క్రికెటర్ చాముండేశ్వరీనాథ్ ‘హిట్ ద వింగ్స్’ కేటగిరీలో విజేతగా నిలిచాడు. హైదరాబాద్‌లోని బౌల్డర్‌హిల్స్‌లో జరిగిన ఈ టోర్నీలో 200 మంది కంటే ఎక్కువ మంది గోల్ఫర్లు పాల్గొన్నారు. కృష్ణపట్నం పోర్ట్ ఆధ్వర్యంలో ఈ టోర్నీని ప్రతి ఏడాది దుబాయ్, ఢిల్లీ, బెంగళూరు, పుణే, హైదరాబాద్‌లలో నిర్వహిస్తారు. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశాడు. ఈ కార్యక్రమంలో భారత మహిళల గోల్ఫ్ సంఘానికి (డబ్ల్యూజీఏఐ) ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’’ సభ్యులు త్వెసా మలిక్, రిధిమ దిలావరీ, భారత స్టార్ గోల్ఫర్ షర్మిలా నికోలెట్, బాలీవుడ్ నటి చిత్రాంగద సింగ్, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తనయుడు ప్రశాంత్ కుమార్, కృష్ణపట్నం పోర్ట్ ఎండీ శశిధర్, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ చైర్మన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్యం ‘టోక్యో’...: వరుసగా ఎనిమిదో ఒలింపిక్స్‌లో పాల్గొనడమే తన లక్ష్యమని లియాండర్ పేస్ తెలిపాడు. గోల్ఫ్ టోర్నీనలో బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా మాట్లాడిన పేస్ హైదరాబాద్ నగరమంటే తనకెంతో ఇష్టమని అన్నాడు. -
చిక్కరంగప్ప జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో బెంగళూరు ప్లేయర్ చిక్కరంగప్ప మరోసారి మెరిశాడు. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ (హెచ్‌జీసీ) వేదికగా జరిగిన ఈ టోర్నీలో సింగిల్స్ కేటగిరీలో చాంపియన్‌గా నిలిచిన చిక్కరంగప్ప... టీమ్ విభాగంలోనూ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ప్రో–ఆమ్ ఈవెంట్లో అమెచ్యూర్ గోల్ఫర్లు అనిల్ యామాని, ఆదిత్య జంవాల్, కె. పృథ్వీరెడ్డిలతో జతకట్టిన ప్రొఫెషనల్ గోల్ఫర్ చిక్కరంగప్ప బృందం 52.4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. నోయిడాకు చెందిన ప్రొఫెషనల్ ప్లేయర్ అమర్దీప్ మలిక్ బృందం రన్నరప్‌గా నిలిచింది. అమెచ్యూర్ క్రీడాకారులు చక్రవర్తి, ఓంప్రకాశ్ మోదీ, భీమరాజులతో కూడిన అమర్దీప్ జట్టు 52.8 పాయింట్లు స్కోర్ చేసి రెండోస్థానాన్ని దక్కించుకుంది. ఈ ఈవెంట్లో 300 యార్డ్స్ దూరం నుంచి 14వ హోల్‌ను పూర్తి చేసిన విరాట్ రెడ్డి షాట్ ‘లాంగెస్ట్ డ్రైవ్’గా ఎంపికైంది. అబ్రహం సంధించిన షాట్ ‘క్లోజెస్ట్ పిన్’గా నమోదైంది. పోటీల్లో భాగంగా అతను కొట్టిన షాట్ నిర్దేశించిన పిన్‌కు అతి సమీపంగా (1 అడుగు 3 ఇంచుల దూరంలో) పడింది. కె. శశిధర్ రెడ్డి కొట్టిన షాట్ ‘స్ట్రెయిటెస్ట్ డ్రైవ్’గా ఎంపికైంది. -
అగ్రస్థానంలో ధర్మ
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) సీజన్ ఆరంభ టోర్నీ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్లో బెంగళూరు ప్లేయర్ ఎం. ధర్మ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ (హెచ్‌జీసీ) వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో ధర్మ అగ్రస్థానంలో నిలిచాడు. శుక్రవారం మూడో రౌండ్ పోటీల్లో ధర్మ 2 అండర్ 69 పాయింట్లు స్కోర్ సాధించి ఓవరాల్ పాయింట్లలో 16 అండర్ 197తో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. గతేడాది ఈ టోర్నీలో ఐదో స్థానంలో నిలిచిన ధర్మ... మూడో రౌండ్ ఆరంభంలో తడబడ్డాడు. ఐదో హోల్‌ను నిర్ణీత షాట్లకు మించి అదనంగా మరో షాట్ (బోగే)ను ఉపయోగించి పూర్తి చేశాడు. దీన్నుంచి వెంటనే తేరుకున్న 32 ఏళ్ల బెంగళూరు ప్లేయర్ వెంటవెంటనే 3 బిర్డీస్ నమోదు చేసి గాడిలో పడ్డాడు. తర్వాత 15వ హోల్ వద్ద తృటిలో ఈగల్‌ను చేజార్చుకుని బిర్డీతో సరిపెట్టుకున్నాడు. చివర్లోనూ మరో బోగే సహాయంతో 69 షాట్లలో రౌండ్‌ను పూర్తిచేశాడు. మూడోరౌండ్ ముగిసేసరికి ఓవరాల్‌గా 14 అండర్ 199 పాయింట్లతో చిక్కరంగప్ప (బెంగళూరు), రషీద్ ఖాన్ (ఢిల్లీ), కరణ్‌దీప్ కొచ్చర్ (చండీగఢ్), ప్రియాన్షు సింగ్ (గురుగ్రామ్) సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాడు. కెరీర్లో రెండో ప్రొఫెషనల్ ఈవెంట్లో పాల్గొంటున్న 22 ఏళ్ల ప్రియాన్షు అద్భుత పోరాటపటిమ కనబరిచాడు. ఈ ఏడాది పీజీటీఐ క్వాలిఫయింగ్ స్కూల్ చాంపియన్ అయిన ప్రియాన్షు... తొలి ఏడు హోల్స్‌లో 3 బోగేలతో వెనుకబడినప్పటికీ... తర్వాత 6 బిర్డీస్‌తో అదరగొట్టాడు. ఫలితంగా రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఓవరాల్‌గా రెండోస్థానంలో నిలిచాడు. మూడోరోజు పోటీల్లో ప్రియాన్షుతో పాటు చిక్కరంగప్ప 70 పాయింట్లు, రషీద్ ఖాన్ 68 పాయింట్లు, కరణ్‌దీప్ కొచ్చర్ 66 పాయింట్లు సాధించి ఓవరాల్ స్కోరులో సంయుక్తంగా రెండోస్థానంలో ఉన్నారు. డిఫెండింగ్ చాంపియన్ ఉదయన్ మానె (67, అహ్మదాబాద్) ఏడో స్థానంలో, ఖాలిన్ జోషి (68, బెంగళూరు) ఆరో స్థానంలో నిలిచారు. గురువారం ఆధిపత్యం ప్రదర్శించిన అమన్‌రాజ్ పేలవ ప్రదర్శనతో ఎనిమిదోస్థానానికి పడిపోయాడు. అతను నిర్దేశించిన 71 షాట్లకు బదులుగా 74 షాట్లలో రౌండ్‌ను పూర్తిచేశాడు. కొత్త కోర్స్ రికార్డుతో అందరి దృష్టిని ఆకర్షించిన గౌరవ్ ప్రతాప్ సింగ్ (71 పాయింట్లు) నాలుగు స్థానాలు కోల్పోయి అమన్ రాజ్, హనీ బైసోయాతో కలిసి సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచాడు. మరోవైపు ఓవరాల్ ప్రదర్శనలో వెనుకబడినప్పటికీ మూడోరోజు పోటీల్లో గురుగ్రామ్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. పోటీల్లో భాగంగా అతను 11వ హోల్‌ను కేవలం ఒక షాట్‌లోనే పూర్తిచేసి ఔరా అనిపించాడు. దీంతో అతను ఓవరాల్ ర్యాంకింగ్‌లో 4 అండర్ 209 పాయింట్లతో 26వ స్థానంలో ఉన్నాడు. -
ధర్మ, అమన్‌రాజ్ జోరు
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) సీజన్ ఆరంభ టోర్నీ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ చాంపియన్‌షిప్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి రౌండ్లో సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచిన బెంగళూరుకు చెందిన ఎం. ధర్మ, పట్నా గోల్ఫర్ అమన్‌రాజ్... గురువారం జరిగిన రెండో రౌండ్ పోటీల్లోనూ ఉమ్మడిగా అగ్రస్థానాన్ని సంపాదించారు. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ (హెచ్‌జీసీ) వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. నోయిడా ప్లేయర్ గౌరవ్ ప్రతాప్ సింగ్ రెండోరోజు ఆటలో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఆతను 10 అండర్ 61 పాయింట్లు స్కోర్ చేసి కొత్త ‘కోర్స్ రికార్డు’ను తన పేర లిఖించుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు అజితేశ్ సంధు (9 అండర్ 62) పేరిట ఉండేది. 2016లో అజితేశ్ ఈ ఘనత సాధించాడు. తొలి స్థానాన్ని దక్కించుకున్న ధర్మ, అమన్ రాజ్‌లిద్దరూ రెండోరౌండ్లో 7 అండర్ 64 పాయింట్లు స్కోర్ చేశారు. ఓవరాల్‌గా 14 అండర్ 128 పాయింట్లతో రెండోరోజు ముగిసేసరికి ఆధిక్యంలో నిలిచారు. ధర్మ 5 బిర్డీస్, 1 ఈగల్ సహాయంతో 64 పాయింట్లు సాధించగా... అమన్ రాజ్ 7 బిర్డీస్‌ను నమోదు చేశాడు. బెంగళూరుకు చెందిన చిక్కరంగప్ప కూడా రెండోరౌండ్లో 7 అండర్ 64 పాయింట్లు సాధించినప్పటికీ ఓవరాల్ స్కోర్‌లో 13 అండర్ 129 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. వీరంతా మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ... రెండోరౌండ్ ఆటను మాజీ పీజీటీఐ చాంపియన్ గౌరవ్ శాసించాడు. అతను ఎలాంటి పొరపాటుకు తావు ఇవ్వకుండా 10 బిర్డీస్ సహాయంతో 61 పాయింట్లు నమోదు చేశాడు. దీంతో ఏకంగా 36 స్థానాలు ఎగబాకి ఓవరాల్ స్కోర్ 11 అండర్ 131తో నాలుగో స్థానాన్ని అందుకున్నాడు. ఈ ప్రదర్శనపై గౌరవ్ హర్షం వ్యక్తం చేశాడు. ‘తొలిరౌండ్లో చేసిన తప్పిదాలు రెండోరౌండ్లో సరిదిద్దుకున్నా. ఈ ప్రదర్శన నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అని అన్నాడు. గౌరవ్‌తో పాటు ప్రియాన్షు సింగ్ (గురుగ్రామ్), రషీద్ ఖాన్ (ఢిల్లీ) 64 పాయింట్లతో నాలుగోస్థానంలో నిలిచారు. తొలిరౌండ్లో అగ్రస్థానంలో నిలిచిన నోయిడా ప్లేయర్ అమర్దీప్ మలిక్ రెండోరౌండ్లో విఫలమయ్యాడు. అతను 73 పాయింట్లు స్కోర్ చేసి 7 అండర్ 135తో 13వ స్థానానికి పడిపోయాడు. డిఫెండింగ్ చాంపియన్ ఉదయన్ మానె (అహ్మదాబాద్) 66 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. రెండోరౌండ్ తర్వాత 50 మంది ప్రొఫెషనల్ గోల్ఫర్లు తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. కట్ కోసం నిర్దేశించిన ‘ఈవెన్ పర్ 142’ స్కోరును అందుకోలేకపోయిన స్థానిక ఫ్రొఫెషనల్ గోల్ఫర్లు సంజయ్, హైదర్ హుస్సేన్, అమెచ్యూర్ క్రీడాకారులు హార్దిక్, అనిరుధ్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. -
తొలి రౌండ్లో అమర్దీప్ ఆధిక్యం
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) సీజన్ ఆరంభ టోర్నమెంట్ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో నోయిడా ప్లేయర్ అమర్దీప్ మలిక్ శుభారంభం చేశాడు. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ (హెచ్‌జీసీ) వేదికగా బుధవారం జరిగిన తొలిరౌండ్లో అమర్దీప్ అగ్రస్థానంలో నిలిచాడు. నిర్ణీత 71 పాయింట్లకు గానూ అతను 12 బిర్డీస్ సహాయంతో 9 అండర్ 62 పాయింట్లు స్కోర్ చేశాడు. ఈ క్రమంలో అతను రెండుసార్లు గోల్కొండ మాస్టర్స్ టోర్నీ చాంపియన్ అజితేశ్ సంధు కోర్స్ రికార్డును సమం చేశాడు. 2016లో అజితేశ్ ఈ రికార్డును నెలకొల్పాడు. తొలిరోజు ఆటను శాసించినప్పటికీ అమర్దీప్ ఆరంభంలో తడబడ్డాడు. అతను తొలి హోల్‌ను ‘డబుల్ బోగే’ సహాయంతో పూర్తి చేశాడు. నిర్దేశించిన 4 స్ట్రోక్స్ కంటే అదనంగా రెండు స్ట్రోక్స్‌ను సంధించి తొలి హోల్‌ను పూర్తి చేశాడు. తర్వాత వరుసగా మూడు బిర్డీస్‌ను నమోదు చేసిన ఈ 33 ఏళ్ల గోల్ఫర్... ఐదో హోల్‌ను కూడా ‘బోగే’ సహాయంతో ముగించాడు. అనంతరం మరో తప్పిదానికి తావు ఇవ్వకుండా తొలిరౌండ్‌ను పూర్తి చేశాడు. ఇటీవలే ఆసియా టూర్ టోర్నీకి అర్హత సాధించిన పట్నా గోల్ఫర్ అమన్ రాజ్, బెంగళూరుకు చెందిన ఎం.ధర్మ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వీరిద్దరూ 7 అండర్ 64 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచారు. అమన్ రాజ్ 9 బిర్డీస్, 2 బోగేలు నమోదు చేయగా... ధర్మ 8 బిర్డీలు నమోదు చేశాడు. బెంగళూరుకు చెందిన చిక్కరంగప్ప 6 అండర్ 65 పాయింట్లతో నాలుగోస్థానంలో నిలవగా... మాజీ చాంపియన్స్ అజితేశ్ సంధు (చండీగఢ్) 4 అండర్ 67 తో ఏడో స్థానంలో, హరేంద్ర గుప్తా (చండీగఢ్) ఈక్వల్ పర్‌తో 49వ స్థానంలో నిలిచారు. డిఫెండింగ్ చాంపియన్ ఉదయన్ మానే (అహ్మదాబాద్) 68 పాయింట్లు స్కోర్ చేసి 19వ స్థానానికి పరిమితమయ్యాడు. -
ఉత్తమ గోల్ఫ్ ప్లేయర్‌గా రవి
తార్నాక: టెట్రాసాఫ్ట్ టెక్నాలజీ కన్సల్టింగ్ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో తార్నాక రైల్వే గోల్ఫ్ క్లబ్ వేదికగా జరిగిన ప్రిన్స్ వింటర్ గోల్ఫ్ టోర్నీ ఆదివారంతో ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో నెట్, గ్రాస్, స్టేబుల్ ఫోర్ట్ విభాగాల్లో పోటీలను నిర్వహించారు. పోటీల్లో భాగంగా అన్ని కేటగిరీలలో లాంగెస్ట్ డ్రైవ్, నియరెస్ట్ పిన్ విధానాన్ని పాటించారు. మహిళల విభాగంలో ప్రత్యేకం గా పోటీలు జరిగాయి. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన రవి బెస్ట్ గోల్ఫ్ ప్లేయర్ అవార్డును అందుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో టెట్రాసాఫ్ట్ టెక్నాలజీ కన్సల్టింగ్ సర్వీసెస్ సంస్థ ప్రతినిధి జయపాల్‌రెడ్డి, దక్షిణమధ్య రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు అర్జున్ ముండియా అతిథులుగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. -
కపిల్ దేవ్ మళ్లీ భారత్ తరఫున
న్యూఢిల్లీ: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన 24 ఏళ్ల తర్వాత భారత దిగ్గజం కపిల్ దేవ్ మరోసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ సారి బరిలోకి దిగే మైదానం మాత్రం మారింది. సరదాగా మొదలు పెట్టిన గోల్ఫ్‌లో ప్రొఫెషనల్‌గా ఎదిగిన ‘హరియాణా హరికేన్’ ఇప్పుడు 59 ఏళ్ల వయసులో మళ్లీ దేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. 2018 ఆసియా పసిఫిక్ సీనియర్ గోల్ఫ్ టోర్నీలో పాల్గొనే ముగ్గురు సభ్యుల భారత జట్టులో కపిల్‌కు చోటు దక్కింది. జపాన్‌లోని మియాజాకిలో అక్టోబర్ 17 నుంచి ఈ టోర్నీ జరుగుతుంది. ఇటీవల నోయిడాలో జరిగిన ఆలిండియా సీనియర్ టోర్నీలో కపిల్ మూడో స్థానంలో నిలిచి అర్హత సాధించాడు. -
విజేత గిరిధర్ – షాన్ రెడ్డి జంట
సాక్షి, హైదరాబాద్: ‘ఆడి’ క్వాట్రో కప్ ఇండియా ఫైనల్స్ టోర్నీలో ‘ఆడి హైదరాబాద్’ శాఖ గోల్ఫర్లు గిరిధర్ తోట – షాన్ రెడ్డి విజేతలుగా నిలిచారు. థాయ్‌లాండ్‌లోని బన్యన్ గోల్ఫ్ క్లబ్లో జరిగిన ఈ టోర్నమెంట్లో వీరిద్దరూ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ‘గ్రీన్సమ్ స్టేబుల్‌ఫోర్డ్’ ఫార్మాట్లో జరిగిన ఈ పోటీల్లో 800 మంది గోల్ఫర్లు తలపడగా... హైదరాబాద్‌కు చెందిన ఈ జంట 45 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ‘ఆడి కోల్‌కతా’కు ప్రాతినిధ్యం వహించిన అతుల్ అల్మాల్ – రోహన్ ష్రాఫ్ ద్వయం 38 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. 37 పాయింట్లు సాధించిన ‘ఆడి గుర్గావ్’ జోడీ వివేక్ భరద్వాజ్ – సిద్ధాంత్ ఖోస్లా మూడో స్థానాన్ని దక్కించుకుంది. సెప్టెంబర్ 23 నుంచి 27 వరకు ఆస్ట్రియా వేదికగా ‘ఆడి క్వాట్రో కప్ వరల్డ్ ఫైనల్స్’ టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీలో 47 దేశాలకు చెందిన గోల్ఫర్లు తలపడతారు. -
చాంపియన్ ఉదయన్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్లో కొత్త చాంపియన్ అవతరించాడు. అహ్మదాబాద్‌కు చెందిన గోల్ఫర్ ఉదయన్ మానే విజేతగా నిలిచి చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ), తెలంగాణ పర్యాటక శాఖ సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహించింది. హైదరాబాద్ గోల్ఫ్ కోర్టులో ఆదివారం జరిగిన చివరిదైన నాలుగోరౌండ్లో ఉదయన్ 3 అండర్ 68 పాయింట్లను స్కోర్ చేశాడు. దీంతో ఓవరాల్‌గా 284 పాయింట్లకు గానూ అత్యుత్తమంగా 14 అండర్ 270 స్కోరుతో టోర్నీలో విజేతగా అవతరించాడు. అంతకుముందు తొలి మూడు రౌండ్లలో వరుసగా 67, 66, 69 ప్రయత్నాల్లో పోటీని ముగించాడు. ఈ ఏడాది పీజీటీఐ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో 39వ స్థానంలో ఉన్న ఉదయన్ ఈ విజయంతో మూడో స్థానానికి ఎగబాకాడు. చాంపియన్‌గా నిలిచిన ఉదయన్‌కు రూ. 4,50,000 ప్రైజ్‌మనీగా లభించాయి. నాలుగో రౌండ్‌ను ఉదయన్ కన్నా మెరుగ్గా 67 ప్రయత్నాల్లోనే ముగించినప్పటికీ షమీమ్ ఖాన్, అభిజిత్ సింగ్‌లకు తొలి స్థానం దక్కలేదు. నిర్ణయాత్మక ప్లేఆఫ్ రౌండ్లో వీరిద్దరూ వెనకబడి ఎన్. తంగరాజతో కలిసి సంయుక్తంగా రన్నరప్‌లుగా నిలిచారు. ఈ ముగ్గురికి రూ. 2,09,960 నగదు బహుమానం లభించింది. తంగరాజ నాలుగోరౌండ్ పోటీని 68 ప్రయత్నాల్లో ముగించాడు. మూడో రౌండ్లో విజేతగా నిలిచిన ముకేశ్ కుమార్ తుదిపోరులో నిర్దేశిత 71 షాట్లకు బదులుగా 74 ప్రయత్నాల్లో పోటీని ముగించి ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 30 లక్షలు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ గోల్ఫ్ సంఘం అధ్యక్షుడు జె. విక్రమ్‌దేవ్ రావు, కెప్టెన్ దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
టైటిల్ రేసులో ముకేశ్ కుమార్
గోల్కొండ: ప్రతిష్టాత్మక గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్ రసవత్తరంగా జరుగుతోంది. తెలంగాణ పర్యాటక శాఖ, పీజీటీఐ సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ టోర్నీలో రోజురోజుకీ ఆధిక్యం చేతులు మారుతోంది. శనివారం హైదరాబాద్ గోల్ఫ్ కోర్ట్‌లో జరిగిన మూడో రౌండ్లో వెటరన్ ప్లేయర్ ముకేశ్ కుమార్ విజేతగా నిలిచాడు. 71 ప్రయత్నాలకు గానూ ముకేశ్ 3 అండర్ 68 స్కోరుతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో ఓవరాల్‌గా 12 పాయింట్లతో టైటిల్ బరిలో అందరి కన్నా ముందున్నాడు. తన కెరీర్లో 120 టైటిళ్ళు సాధించిన ముకేశ్ కుమార్ (52) గోల్కొండ మాస్టర్ టోర్నీలో పోటీపడుతున్న వారిలో అత్యధిక వయస్సు గలవాడు. గతేడాది ఇదే టోర్నీలో ముకేశ్ టాప్–3లో నిలిచాడు. నేడు జరిగే చివరి రౌండ్‌తో చాంపియన్ ఎవరనేది తెలుస్తుంది. మరోవైపు రెండో రౌండ్లో సూపర్ షోతో విజేతగా నిలిచిన అంగద్ చీమా మూడోరౌండ్లో తడబడ్డాడు. అతను నిర్ణీత 71 షాట్లకు బదులుగా 74 ప్రయత్నాల్లో పోటీని పూర్తి చేసి ఓవరాల్ పాయింట్లలో వెనుకబడ్డాడు. ప్రస్తుతం 10 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా నాలుగోస్థానంలో ఉన్నాడు. తంగరాజ(శ్రీలంక), అహ్మదాబాద్ గోల్ఫర్ ఉదయన్ మానే మూడో రౌండ్‌ను వరుసగా 68, 69ప్రయత్నాల్లో ముగించి ఓవరాల్‌గా 11 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. తొలి రౌండ్ విజేత ధర్మ 8 పాయింట్లతో ప్రస్తుతం 11వ స్థానంలో ఉన్నాడు. -
అంగద్ సూపర్ షో
గోల్కొండ: ప్రతిష్టాత్మక గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్లో పంచకుల గోల్ఫర్ అంగద్ చీమా ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ గోల్ఫ్ కోర్సులో శుక్రవారం జరిగిన రెండో రౌండ్లో విజేతగా నిలిచి టోర్నీలో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించాడు. తెలంగాణ పర్యాటక శాఖ, ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ టోర్నీలో అంగద్ అత్యుత్తమంగా 64 ప్రయత్నాల్లోనే రెండో రౌండ్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. రెండో రౌండ్లో పోటీపడే ఆటగాళ్లు 18 హోల్స్‌లోకి బంతుల్ని 71 ప్రయత్నాల్లో పంపించాలి. అయితే 28 ఏళ్ల అంగద్ రెండో రౌండ్లో 64 షాట్లలోనే లక్ష్యాన్ని చేరుకొని 7 పాయింట్లు ఆర్జించాడు. తొలి రౌండ్లో 6 పాయింట్లను కలుపుకొని ఓవరాల్‌గా 13 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. గతేడాది ఈ టోర్నీ రన్నరప్‌గా నిలిచిన బెంగళూరుకు చెందిన ఖాలిన్ జోషి కూడా ఈ రౌండ్లో 7 పాయింట్లు సాధించాడు. అయితే తొలి రౌండ్లో కేవలం 2 పాయింట్లు మాత్రమే పొందిన ఖాలిన్ ఓవరాల్‌గా 9 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్నాడు. శుక్రవారం పోటీల్లో వీర్ ఆహ్లావట్ (66), ముకేశ్ కుమార్ (66), ఉదయన్ (66) తలా 5 పాయింట్లు స్కోర్ చేసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. తొలి రౌండ్లో విజేతగా నిలిచిన ఎం. ధర్మ (బెంగళూరు) 72 ప్రయత్నాల్లో పోటీని ముగించి పదో స్థానానికి పడిపోయాడు. -
గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నీ షురూ
గోల్కొండ: ప్రతిష్టాత్మక గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ చాంపియన్‌షిప్ బుధవారం ప్రారంభమైంది. ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ), హైదరాబాద్ గోల్ఫ్ సంఘం (హెచ్జీఏ) సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ టోర్నీ నాలుగు రోజుల పాటు జరుగనుంది. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో హెచ్జీఏ అధ్యక్షులు జె. విక్రమ్ దేవ్ రావు, కెప్టెన్ సి. దయాకర్ రెడ్డి, కార్యదర్శి శ్రీకాంత్ రావు, పీజీటీఐ సీఈఓ ఉత్తమ్ సింగ్, భారత పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఐఏఎస్ రష్మీ వర్మతోపాటు 123 మంది గోల్ఫ్ క్రీడాకారులు పాల్గొన్నారు. టోర్నీ ప్రైజ్‌మనీ రూ. 30 లక్షలు. ఇందులో భారత్‌కు చెందిన ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారులు ఖాలిన్ జోషి, చిక్కరంగప్ప, రాహిల్ గాంగ్జి, విరాజ్ మాడప్ప, హిమ్మత్ రాయ్, షమీమ్ ఖాన్, మాజీ చాంపియన్ హరేంద్ర గుప్తా, సయ్యద్ సకీబ్ అహ్మద్, ఉదయన్ మానే, హనీ బైసోయా సందడి చేయనున్నారు. వీరితో పాటు శ్రీలంకకు చెందిన అనురా రోహన, మిథున్ పెరీరా, ఎన్. తంగరాజ, కె. ప్రభాకరన్, దక్షిణాఫ్రికా నుంచి అల్బీ హనేకోమ్, బంగ్లాదేశ్‌కు చెందిన మొహమ్మద్ జమాల్ హొస్సేన్, ఆస్ట్రేలియా నుంచి కునాల్ భాసిన్ ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సందర్భంగా హెచ్జీఏ అధ్యక్షుడు జె. విక్రమ్‌దేవ్ రావు మాట్లాడుతూ ప్రతిష్టాత్మక పీజీటీఐ టోర్నమెంట్‌కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వడం గర్వంగా ఉందన్నారు. -
గోల్ఫ్ చాంపియన్ రవి
సాక్షి, హైదరాబాద్: గోల్ఫ్ బడ్డీస్ అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్)కు చెందిన గోల్ఫర్ ఎ. రవి సత్తా చాటాడు. బొల్లారంలోని బైసన్ ఇన్విరాన్మెంట్, ట్రైనింగ్ పార్క్‌లో జరిగిన ఈ టోర్నీలో అతను విజేతగా నిలిచాడు. రెండు రోజుల పాటు జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో రవి 73 పాయింట్లు స్కోర్ చేసి టైటిల్‌ను దక్కించుకున్నాడు. రవితో పాటు ఎస్సీఆర్ జట్టు తరఫున అర్జున్, కేపీ సోమ్ కువార్, పీఎస్ బ్రహ్మానందం, అజయ్ భారతి, సాయి ముదళియార్, వర్గీస్ ఈ టోర్నీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ టైటిల్‌ను సాధించిన రవిని అభినందించారు. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీఆర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు అర్జున్ ముండియా, ఎస్సీఆర్ చీఫ్ వర్క్‌షాప్స్ ఇంజినీర్ సోమ్ కువార్ పాల్గొన్నారు.