గోల్కొండ: ప్రతిష్టాత్మక గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్‌లో పంచకుల గోల్ఫర్ అంగద్ చీమా ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ గోల్ఫ్ కోర్సులో శుక్రవారం జరిగిన రెండో రౌండ్‌లో విజేతగా నిలిచి టోర్నీలో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించాడు. తెలంగాణ పర్యాటక శాఖ, ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ టోర్నీలో అంగద్ అత్యుత్తమంగా 64 ప్రయత్నాల్లోనే రెండో రౌండ్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. రెండో రౌండ్‌లో పోటీపడే ఆటగాళ్లు 18 హోల్స్‌లోకి బంతుల్ని 71 ప్రయత్నాల్లో పంపించాలి.
అయితే 28 ఏళ్ల అంగద్ రెండో రౌండ్‌లో 64 షాట్లలోనే లక్ష్యాన్ని చేరుకొని 7 పాయింట్లు ఆర్జించాడు. తొలి రౌండ్‌లో 6 పాయింట్లను కలుపుకొని ఓవరాల్‌గా 13 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. గతేడాది ఈ టోర్నీ రన్నరప్‌గా నిలిచిన బెంగళూరుకు చెందిన ఖాలిన్ జోషి కూడా ఈ రౌండ్‌లో 7 పాయింట్లు సాధించాడు. అయితే తొలి రౌండ్‌లో కేవలం 2 పాయింట్లు మాత్రమే పొందిన ఖాలిన్ ఓవరాల్‌గా 9 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్నాడు. శుక్రవారం పోటీల్లో వీర్ ఆహ్లావట్ (66), ముకేశ్ కుమార్ (66), ఉదయన్ (66) తలా 5 పాయింట్లు స్కోర్ చేసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. తొలి రౌండ్‌లో విజేతగా నిలిచిన ఎం. ధర్మ (బెంగళూరు) 72 ప్రయత్నాల్లో పోటీని ముగించి పదో స్థానానికి పడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment