గోల్ఫ్ చాంపియన్ రవి
సాక్షి, హైదరాబాద్: గోల్ఫ్ బడ్డీస్ అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్‌లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్)కు చెందిన గోల్ఫర్ ఎ. రవి సత్తా చాటాడు. బొల్లారంలోని బైసన్ ఇన్విరాన్‌మెంట్, ట్రైనింగ్ పార్క్‌లో జరిగిన ఈ టోర్నీలో అతను విజేతగా నిలిచాడు. రెండు రోజుల పాటు జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో రవి 73 పాయింట్లు స్కోర్ చేసి టైటిల్‌ను దక్కించుకున్నాడు. రవితో పాటు ఎస్‌సీఆర్ జట్టు తరఫున అర్జున్, కేపీ సోమ్ కువార్, పీఎస్ బ్రహ్మానందం, అజయ్ భారతి, సాయి ముదళియార్, వర్గీస్ ఈ టోర్నీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ టైటిల్‌ను సాధించిన రవిని అభినందించారు. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్‌సీఆర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు అర్జున్ ముండియా, ఎస్‌సీఆర్ చీఫ్ వర్క్‌షాప్స్ ఇంజినీర్ సోమ్ కువార్ పాల్గొన్నారు.