సాక్షి, వైఎస్సార్: పులివెందులో టీడీపీ(TDP) నేతల మధ్య వర్గపోరు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. రేషన్ షాప్ డీలర్ల విషంయలో తమ ఆధిపత్యం చాటుకునేందుకు పచ్చ నేతలు బాహాబాహీకి దిగారు. దీంతో, టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వాగ్వాదంలో అతడి చొక్కా చిరిగిపోయింది. అనంతరం, రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
వివరాల ప్రకారం.. పులివెందులలో రేషన్ షాపుల కోసం టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. నేడు రేషన్ షాప్ డీలర్ల కోసం పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తమ వర్గానికి చెందినవారే పరీక్షకు హాజరు కావాలంటూ రెండు వర్గాలు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్ వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కేవలం తమ వాళ్ళే పరీక్ష రాసి షాపులు పొందాలంటూ ఇరువర్గాల పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో వాగ్వాదం మరింత పెరిగింది.
ఘర్షణ అనంతరం, వేంపల్లికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తిపై బీటెక్ రవి అనుచరులు దాడి చేశారు. దీంతో, దాడికి నిరసనగా పరీక్షా కేంద్రం వద్ద ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సతీమణి ఉమాదేవి ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత నాటకీయంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. పరీక్షా కేంద్రం వద్ద ఇరు వర్గాల కార్యకర్తలు భారీగా మోహరించారు. దీంతో, అక్కడ ఉద్రిక్తతకర పరిస్థితిలు నెలకొన్నాయి. మరోవైపు గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఇసుక టెండర్ల కోసం బీటెక్ రవి అనుచరులు హంగామా సృష్టించారు. ఆ ఘటన మరవక ముందే శుక్రవారం పులివెందులలో మరోసారి రెచ్చిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment