సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్‌లో కొత్త చాంపియన్ అవతరించాడు. అహ్మదాబాద్‌కు చెందిన గోల్ఫర్ ఉదయన్ మానే విజేతగా నిలిచి చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ), తెలంగాణ పర్యాటక శాఖ సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహించింది. హైదరాబాద్ గోల్ఫ్ కోర్టులో ఆదివారం జరిగిన చివరిదైన నాలుగోరౌండ్‌లో ఉదయన్ 3 అండర్ 68 పాయింట్లను స్కోర్ చేశాడు. దీంతో ఓవరాల్‌గా 284 పాయింట్లకు గానూ అత్యుత్తమంగా 14 అండర్ 270 స్కోరుతో టోర్నీలో విజేతగా అవతరించాడు.
అంతకుముందు తొలి మూడు రౌండ్‌లలో వరుసగా 67, 66, 69 ప్రయత్నాల్లో పోటీని ముగించాడు. ఈ ఏడాది పీజీటీఐ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో 39వ స్థానంలో ఉన్న ఉదయన్ ఈ విజయంతో మూడో స్థానానికి ఎగబాకాడు. చాంపియన్‌గా నిలిచిన ఉదయన్‌కు రూ. 4,50,000 ప్రైజ్‌మనీగా లభించాయి. నాలుగో రౌండ్‌ను ఉదయన్ కన్నా మెరుగ్గా 67 ప్రయత్నాల్లోనే ముగించినప్పటికీ షమీమ్ ఖాన్, అభిజిత్ సింగ్‌లకు తొలి స్థానం దక్కలేదు. నిర్ణయాత్మక ప్లేఆఫ్ రౌండ్‌లో వీరిద్దరూ వెనకబడి ఎన్. తంగరాజతో కలిసి సంయుక్తంగా రన్నరప్‌లుగా నిలిచారు.
ఈ ముగ్గురికి రూ. 2,09,960 నగదు బహుమానం లభించింది. తంగరాజ నాలుగోరౌండ్ పోటీని 68 ప్రయత్నాల్లో ముగించాడు. మూడో రౌండ్‌లో విజేతగా నిలిచిన ముకేశ్ కుమార్ తుదిపోరులో నిర్దేశిత 71 షాట్లకు బదులుగా 74 ప్రయత్నాల్లో పోటీని ముగించి ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 30 లక్షలు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ గోల్ఫ్ సంఘం అధ్యక్షుడు జె. విక్రమ్‌దేవ్ రావు, కెప్టెన్ దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment