
గోల్కొండ: ప్రతిష్టాత్మక గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్ రసవత్తరంగా జరుగుతోంది. తెలంగాణ పర్యాటక శాఖ, పీజీటీఐ సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ టోర్నీలో రోజురోజుకీ ఆధిక్యం చేతులు మారుతోంది. శనివారం హైదరాబాద్ గోల్ఫ్ కోర్ట్‌లో జరిగిన మూడో రౌండ్‌లో వెటరన్ ప్లేయర్ ముకేశ్ కుమార్ విజేతగా నిలిచాడు. 71 ప్రయత్నాలకు గానూ ముకేశ్ 3 అండర్ 68 స్కోరుతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో ఓవరాల్‌గా 12 పాయింట్లతో టైటిల్ బరిలో అందరి కన్నా ముందున్నాడు. తన కెరీర్‌లో 120 టైటిళ్ళు సాధించిన ముకేశ్ కుమార్ (52) గోల్కొండ మాస్టర్ టోర్నీలో పోటీపడుతున్న వారిలో అత్యధిక వయస్సు గలవాడు. గతేడాది ఇదే టోర్నీలో ముకేశ్ టాప్–3లో నిలిచాడు.
నేడు జరిగే చివరి రౌండ్‌తో చాంపియన్ ఎవరనేది తెలుస్తుంది. మరోవైపు రెండో రౌండ్‌లో సూపర్ షోతో విజేతగా నిలిచిన అంగద్ చీమా మూడోరౌండ్‌లో తడబడ్డాడు. అతను నిర్ణీత 71 షాట్లకు బదులుగా 74 ప్రయత్నాల్లో పోటీని పూర్తి చేసి ఓవరాల్ పాయింట్లలో వెనుకబడ్డాడు. ప్రస్తుతం 10 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా నాలుగోస్థానంలో ఉన్నాడు. తంగరాజ(శ్రీలంక), అహ్మదాబాద్ గోల్ఫర్ ఉదయన్ మానే మూడో రౌండ్‌ను వరుసగా 68, 69ప్రయత్నాల్లో ముగించి ఓవరాల్‌గా 11 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. తొలి రౌండ్ విజేత ధర్మ 8 పాయింట్లతో ప్రస్తుతం 11వ స్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment