లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్.. తాజాగా ఆసీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అదరగొట్టాడు. ఆది నుంచి అత్యంత నిలకడగా ఆడిన ధావన్ శతకం సాధించాడు. 95 బంతుల్లో 13 ఫోర్లతో సెంచరీ సాధించాడు. తొలుత 53 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కును చేరిన ధావన్.. దాన్ని సెంచరీగా మలచుకున్నాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ భారత్ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌లు ఆరంభించారు. తొలి ఏడు ఓవర్ల వరకూ ఈ జోడి అత్యంత నెమ్మదిగా ఆడింది. దాంతో భారత జట్టు ఏడు ఓవర్లు ముగిసే సరికి 22 పరుగులు మాత్రమే చేసింది. అటు తర్వాత ధావన్ బ్యాట్ ఝుళిపించాడు. కౌల్టర్ నైల్ వేసిన ఎనిమిదో ఓవర్లలో మూడు ఫోర్లు కొట్టి ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చాడు. ఈ ఓవర్లు ధావన్ 14 పరుగులు పిండుకోవడంతో భారత్ గాడిలో పడింది. ఆపై నిలకడగా బ్యాటింగ్ చేయడంతో పాటు అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరొకవైపు రోహిత్ కూడా సమయోచితంగా ఆడి అర్థ సెంచరీ సాధించాడు. ఈ జోడి 127 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత రోహిత్(57) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
ఆ తరుణంలో కోహ్లితో కలిసిన ధావన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ప్రధానంగా ఆసీస్ బౌలింగ్ విభాగానికి పరీక్షగా నిలిచి సెంచరీ నమోదు చేశాడు. ఇది ధావన్‌కు 16వ వన్డే సెంచరీ. కాగా, ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో అత్యధిక సెంచరీ లు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్, కుమార్ సంగక్కరాలతో కలిసి ధావన్ రెండో స్థానంలో నిలిచాడు. ఇది ఐసీసీ వన్డే టోర్నమెంట్లో ధావన్‌కు ఆరో సెంచరీ. ఇక్కడ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలు తలో ఏడు సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆసీస్‌తో మ్యాచ్‌లో ధావన్ సెంచరీ సాధించడంతో భారత్ జట్టు 35 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 206 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment