లండన్ : ప్రపంచకప్‌లో టీమిండియా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఓవల్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో కోహ్లి సేన జయభేరి మోగించింది. టీమిండియా నిర్దేశించిన 353 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన ఆసీస్ 316 పరుగులకు ఆలౌటై ఓటమి చవిచూసింది. భారత్ బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా(3/61), భువనేశ్వర్(3/50), చాహల్(2/62)లు కీలక సమయాలలో వికెట్లు తీసి టీమిండియాకు విజయాన్నందించారు. ఈ మ్యాచ్‌లో శతకం బాదిన శిఖర్ ధావన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఆసీస్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్(56; 84 బంతుల్లో 5ఫోర్లు), స్టీవ్ స్మిత్(69; 70 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సర్), అలెక్స్ కేరీ(55; 35 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సర్)లు మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఒకానొక దశలో ఆసీస్ లక్ష్యం ఛేదించేలా కనిపించింది. 36.4 ఓవర్లలో మూడు వికెట్లకు 202 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. అయితే 40వ ఓవర్లలో భువనేశ్వర్ మ్యాచ్ స్వరూపానే మార్చేశాడు. ఒకే ఓవర్లో జోరు మీదున్న స్మిత్‌ను, స్టొయినిస్‌ను పెవిలియన్‌కు పంపించాడు. దీంతో మ్యాచ్ టీమిండియా చేతుల్లోకి వచ్చింది. అనంతరం బుమ్రా, భువీలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ ఓటమి ఖాయమైంది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. భానత ఆటగాళకల్లో శిఖర్ ధావన్(117; 109 బంతుల్లో 16 ఫోర్లు) శతక్కొట్టగా.. రోహిత్ శర్మ(57; 70 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్), విరాట్ కోహ్లి(82; 77 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా(48; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లు మెరుపులు మెరిపించడంతో ఆసీస్‌కు టీమిండియా భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ బౌలర్లలో స్టోయినిస్ రెండు వికెట్లు సాధించగా, కమిన్స్, స్టార్క్, కౌల్టర్ నైల్‌లకు తలో వికెట్ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment